కంకర తేలిన ఉంద్యాల–సీసీకుంట రోడ్డు
సాక్షి, చిన్నచింతకుంట: ప్రభుత్వాలు, పాలకులు మారిన పల్లెల స్థితిగతులు మారడంలేదు. ఒక గ్రామం అభివృద్ధి చేయాలంటే ప్రధానంగా ఆ గ్రామానికి రోడ్డుసౌకర్యం బాగుండాలి. ఈ మేరకు అన్నిగ్రామాలకు రోడ్డు నిర్మించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ కొన్ని గ్రామాలను మాత్రం అధికారులు పట్టించుకోవడంలేదు. మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉంధ్యాల గ్రామం కొన్ని ఏళ్లుగా మట్టి, గుంతలు తేలిన రోడ్డే వీరికిగతి. బీటీరోడ్డు లేక గ్రామప్రజలు మండల కేంద్రానికి రావడానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు వర్షాకాలం కావడంతో రోడ్డంతా బురదమయంగా మారి వాహనదారులకు ఎన్నో అవస్థలకు గురిచేస్తుంది.
కంకరతేలిన రోడ్డుతో అవస్థలు
ఏళ్లుగడుస్తున్నా.. ఉంధ్యాల బీటీరోడ్డుకు నోచుకోవడం లేదు. గుంతలుపడి కంకరతేలిన రోడ్డుపై ప్రయాణం నరకాన్ని తలపిస్తుందని పలువురు పేర్కొంటున్నారు. దీంతో గ్రామానికి బస్సులు, ఆటోలు రాలేకపోతున్నాయి. గ్రామప్రజలు ఏ చిన్నపని ఉన్నా.. మండల కేంద్రానికి రావాల్సిందే. అయితే ద్విచక్రవాహనాలు తప్పా.. ఏ వాహనాలు గ్రామం నుంచి మండల కేంద్రానికి రాకపోవడంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గర్భిణుల ఇబ్బందులు వర్ణనాతీతం. నెలనెలా చికిత్సలు చేయించుకునేందుకు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలోనే అవస్థల మధ్య కంకరతేలిన బీటీరోడ్డుపై తిరుగుతున్నారు. ఒకవేళ పురిటినొప్పులు వచ్చాయంటే.. అంబులెన్స్ సైతం రోడ్డు బాగోలేదంటూ ఊర్లోకి రావడం లేదు. ఆటోలో తరలిస్తుంటే కంకర రోడ్డుపై మార్గమధ్యంలోనే ప్రసవాలు అవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మధ్యలోనే నిల్చిన పనులు
ఇదిలా ఉండగా మద్దూర్ నుంచి ఉంధ్యాల వరకు రెండు కిలోమీటర్ల బీటీరోడ్డు వేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. మిగతా 6 కిలోమీటర్లు అలాగే వదిలేశారు. వర్షాకాలంలో రోడ్లపై గుంతలు పడి వాహనదారులకు పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామస్తులు వాపోతున్నారు.
ఎందరో గాయపడ్డారు
మండల కేంద్రం నుంచి గ్రామానికి రావాలంటే గుంతలు, కంకరతేలిన రోడ్డేగతి. ఇప్పుడు వర్షాకాలంలో బురదగా మారి గుంతలుపడి రాత్రివేళల్లో గుంతల రోడ్డుపై వాహనాలను నడుపుతూ కిందపడి గాయపడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైన పాలకులు, ఆర్‌అండ్‌బీ అధికారులు తక్షణమే స్పందించి బీటీగా మార్చాలి.
– ఆర్.రమేష్, ఉంద్యాల
అధికారులు స్పందించాలి
అన్ని నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రోడ్ల విస్తరణ చేపట్టారు. బీటీరోడ్డు, సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యే అధికారులు స్పందించాలి. మా గ్రామం నుంచి మండల కేంద్రం వరకు బీటీరోడ్డు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి.
– ఆర్.రాములు, ఉంద్యాల
Comments
Please login to add a commentAdd a comment