మానవత్వానికి మతం లేదని చాటారు!
జైపూర్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటుండగా మత సామరస్యం వెల్లివిరిసే ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్ లో వెలుగు చూసింది. ఇద్దరు వ్యక్తులు మతాలకు అతీతంగా మానత్వం ప్రదర్శించారు. తమ మతం కాని మహిళలకు మూత్రపిండాలు దానం చేసి మానవత్వానికి హద్దులు లేవని నిరూపించారు.
రెండు వేర్వేరు మతాలకు చెందిన అనితా మెహ్రా, తస్లీమ జహానే అనే మహిళలకు మూత్రపిండాలు పాడైపోవడంతో ఆస్పత్రిలో చేరారు. తమ భర్తలు కిడ్నీలు దానం చేసేందుకు ముందు వచ్చినా వీరి బ్లడ్ గ్రూపులు మ్యాచ్ కాలేదు. అనిత బ్లడ్ గ్రూపు బి పాజిటివ్ కాగా, ఆమె భర్త వినోద్ మెహ్రాది ఏ పాజిటివ్. తస్లీమ బ్లడ్ గ్రూపు ఏ పాజిటివ్ కాగా, ఆమె భర్త అహ్మద్ ది బి పాజిటివ్.
పరిస్థితిని గుర్తించిన డాక్టర్లు మూత్రపిండాల పరస్పర మార్పిడికి వినోద్, అహ్మద్ ను ఒప్పించారు. అహ్మద్ భార్యకు వినోద్ కిడ్నీ దానం చేయంగా, వినోద్ భార్యకు అహ్మద్ కిడ్నీ ఇచ్చాడు. సెప్టెంబర్ 2న ఆపరేషన్ చేసి కిడ్నీలు అమర్చారు. విభిన్న మతాలకు చెందిన వ్యక్తుల మధ్య కిడ్నీల మార్పిడి తమ రాష్ట్రంలో ఇదే తొలిసారి వైద్యులు తెలిపారు. వినోద్, అహ్మద్ పరస్పరం ధన్యవాదాలు తెలుపుకోవడం విశేషం.