హెలికాప్టర్ సమకూర్చిన కృష్ణపట్నం పోర్టు
నెల్లూరు రూరల్ :
అవయవదానంలో గుండెను తరలించేందుకు కృష్ణపట్నం పోర్టు ప్రత్యేక హెలికాప్టర్‌ను సమకూర్చింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన సుబ్బారెడ్డి అవయవదానం ఆపరేషన్ నారాయణ హాస్పిటల్‌లో మంగళవారం నిర్వహించారు. గుండెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేశారు. హెలికాప్టర్ జిల్లా పోలీసు కవాతు మైదానంలో ల్యాండ్ కావాల్సి ఉండగా గ్రౌండ్‌లో దుమ్ము వల్ల ల్యాండ్ కాకుండా నేరుగా కృష్ణపట్నం పోర్టుకు వెళ్లింది. అక్కడ వరకు గుండెను అంబులెన్స్‌లో తీసుకురావడం కష్టం అవుతుందని నారాయణ మెడికల్ కళాశాల మైదానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగింది. నారాయణ ఆస్పత్రి నుంచి గుండెను అంబులెన్స్‌లో హెలిప్యాడ్ వరకు తీసుకురాగా అక్కడ నుంచి హెలికాప్టర్‌లో వైద్యులు తీసుకెళ్లారు. అవయవదానానికి తమ వంతు సాయంగా కృష్ణపట్నం పోర్టు సొంత హెలికాప్టర్‌ను పంపించినట్లు పోర్టు పీఆర్ హెడ్ వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ విజయకుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మీడియా మేనేజర్ శీనయ్య పాల్గొన్నారు.