విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): డాక్టర్ ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కొత్తపల్లి హేమప్రసాద్ (55) శుక్రవారం గుండెపోటుకు గురై వెంటనే కోమాలోకి వెళ్లారు. యూనివర్సిటీలో విధుల్లో ఉండగానే గుండెపోటుకు గురవ్వడంతో ఉద్యోగులు బందరు రోడ్డులోని రమేష్ హాస్పిటల్‌కు తరలించగా, పరీక్షించిన డాక్టర్లు బ్రెయిన్‌డెడ్ (జీవన్మృతుడు) గా నిర్ధారించారు. బ్రెయిన్‌డెడ్ కావడంతో అతని అవయవాలు దానం చేయడానికి కుటుంబం సభ్యులు ముందుకొచ్చారు.
ప్రస్తుతం ఏయే అవయవాలు జీవన్‌దాన్‌కు పనికొస్తాయో డాక్టర్లు పరీక్షలు చేస్తున్నారు. నగరంలోని అరుణ్ కిడ్నీ సెంటర్, సన్‌రైజ్ ఆసుపత్రులకు ఒక్కో మూత్రపిండం దానం చేయనున్నట్లు జీవన్‌దాన్ అధికారులు తెలిపారు. నేత్రాలను శంకర్ నేత్రాలయం, కాలేయం హైదరాబాద్, విశాఖపట్నం గాని పంపుతామని డాక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. హేమప్రసాద్ అవయవాలు ఏమేమి పనిచేస్తాయి?, ఎక్కడెక్కడికి పంపించాలనే దానిపై శనివారం తుదినిర్ణయం తీసుకోనున్నారు.
బ్రెయిన్‌డెడ్‌కు గురైన హేమప్రసాద్ భార్య అరుణకుమారి ప్రభుత్వాస్పత్రిలోని సూపరింటెండెంట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. హేమప్రసాద్‌ను యూనివర్సిటీ, ప్రభుత్వాసుపత్రి ఉద్యోగులు సందర్శించారు. ఆయన 1988లో టైపిస్ట్‌గా యూనివర్సిటీలో చేరారు. అందరితో కలివిడిగా, సౌమ్యంగా ఉండే హేమప్రసాద్ బ్రెయిన్ డెడ్‌కు గురికావడం పట్ల వర్సిటీ ఉద్యోగులు విచారం వెలిబుచ్చారు.
హెల్త్ వర్సిటీ ఉద్యోగి బ్రెయిన్ డెడ్
Published Fri, Feb 26 2016 8:27 PM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM
Advertisement