ఆ ఆరుగురిలో ‘ఆమె’
అవయవదానం చేసి చిరంజీవిగా మారిన శారద
హైదరాబాద్: అప్పటి దాకా చక్కగానే ఉన్న ఆమె ఒక్క సారి కుప్పకూలిపోయింది. తాళలేని తలనొప్పి, కళ్లుతిరిగి పడిపోవడంతో కుటుంబీకులు ఆందోళనతో నగరంలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించిందనీ..‘బ్రెయిన్ డెడ్’ అయిందని వైద్యులు వెల్లడించారు. అమె కొడుకు సురేష్ స్పందించాడు. తన తల్లి చిరంజీవి కావాలని కోరుకున్నాడు. కానరాని లోకాలకు వెళ్లినా మరికొందరిలో ఆమె బతకాలని భావించాడు. మిగతా కుటుంబీకులు అందుకు సరే అన్నారు. ఇలా అనుకోని రీతిలో ఆమె మరో ఆరుగురికి కొత్త జీవితాన్నిచ్చింది. అవయవదానంతో చిరంజీవిగా నిలచిపోయింది. ఇదీ నిజాంబాద్ జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన లింగంపేట శారద(45) కథ. ఎందరికో చూపిన స్ఫూర్తి బాట. శారద భర్త గంగా గౌడ్ గీత కార్మికుడు. వారికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు. ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో పనిచేస్తూ కుప్పకూలిపోయింది. స్థానికంగా చికిత్సలందించినా ఫలితం లేక పోవడంతో శనివారం నగరంలోని లక్డీకాపూల్ గ్లోబల్ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు ‘బ్రెయిన్ డెడ్’గా తేల్చారు.
కొడుకు చొరవతో...
దీంతో ఆమె కుమారుడు సురేష్ తన తల్లి భౌతికంగా లేకపోయినా పది మందిలో బతికుండాలనే కోరికతో ఆమె అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చాడు. మోహన్‌ఫౌండేషన్ ఆధ్వర్యంలో జీవన్‌దాన్ కోఆర్డినేటర్ అనురాధ సహకారంతో ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం తెల్లవారు జామున డాక్టర్ల బృందం శారద అవయవాలను సేకరించింది. ఆమె లివర్‌ను గ్లోబల్ హాస్పిటల్‌లో ఢిల్లీకి చెందిన 54 ఏళ్ల వ్యక్తికి డాక్టర్ బల్‌భీర్‌సింగ్ నేతృత్వంలోని బృందం అమర్చి ఆయనకు కొత్త బతుకు నిచ్చారు. ఒక కిడ్నీని పాతబస్తీకి చెందిన 31ఏళ్ల మహిళకు డాక్టర్ జి.శ్రీధర్ నేతృత్వంలో శస్త్రచికిత్స చేసి అమర్చారు.గ్లోబల్ హాస్పిటల్ వైస్ ప్రసిడెంట్, మెడికల్ సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్ డాక్టర్ హీరేంద్రనాధ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మరో కిడ్నీని దక్కన్ హాస్పిటల్, గుండె వాల్వ్స్‌ను ఇన్నోవా హాస్పిటల్, కళ్లను ఎల్వీప్రసాద్ ఐ హాస్పిటల్‌కు ఇచ్చారు. అవయవాల సేకరణ అనంతరం శారద మృతదేహాన్ని ఆదివారం ఉదయం స్వగ్రామానికి అంబులెన్స్‌లో కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. కుటుంబీకుల చొరవను పలువురు ప్రశంసించారు.