మనసున్న మనస్విని...
* అవయవదానం చేసిన ఎనిమిదేళ్ల చిన్నారి
* మరణిస్తూ మరో నలుగురికి పునర్జన్మ
హైదరాబాద్: మరణాన్ని ఆహ్వానిస్తూ మరో నలుగురికి పునర్జన్మనిచ్చింది ఓ చిన్నారి... తన కళ్లు, కాలేయం, మూత్రపిండాలు, గుండె రక్త నాళాలతో పాటు మొత్తం శరీరాన్ని దానం చేసి పిన్న వయసులోని పెద్ద మనసు చూపింది ఎనిమిదేళ్ల మనస్విని. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన గంగిశెట్టి గోపీ నాథ్, రూప దంపతుల కుమార్తె మనస్విని.
గత బుధవారం గోదావరి పుష్కరాల కోసం గోపీనాథ్ కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా పోచంపాడుకు కారులో వెళ్లారు. అక్కడ గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి తిరిగి వస్తుండగా డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోంపేట వద్ద ప్రమాదవశాత్తు వీరి కారు ముందున్న లారీని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో గోపీనాథ్, ఆయన బావమరిది రాజేశ్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రూప, మనస్వినిలను స్థానికులు చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మనస్వినిని అదేరోజు జూబ్లిహిల్స్ అపోలోకు తరలించారు. రెండు రోజుల పాటు వైద్యసేవలు అందించారు.
అయినా ఫలితం లేకుండా పోయింది. బాలిక అప్పటికే బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే విషయాన్ని బంధువులకు తెలుపగా, వారు బాలిక అవయవాలను దానం చేయడానికి ముందుకువచ్చారు. ఈ మేరకు జీవన్‌దాన్‌కు సమాచారం ఇచ్చారు. అపోలో వైద్యులు శనివారం ఉదయం మనస్విని శరీరం నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలు, కళ్లు, గుండె కవాటాలను సేకరించి అక్కడే చికిత్స పొందుతున్న మరో నలుగురు బాధితులకు అమర్చారు. మనస్విని మృతదేహాన్ని గాంధీ వైద్యకళాశాలకు అప్పగించారు.