మరణించినా జీవించు | Organ donation | Sakshi
Sakshi News home page

మరణించినా జీవించు

Published Fri, Oct 12 2018 7:13 AM | Last Updated on Fri, Oct 12 2018 7:13 AM

Organ donation - Sakshi

వైద్య రంగంలో సరికొత్త మార్పులు వస్తున్నాయి. రోజురోజుకూ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతోంది. అధునాతన పరికరాలు, వైద్య సేవలు, మందులు అందుబాటులోకి వస్తున్నాయి. ఏ రోగాన్ని అయినా తగ్గించే డాక్టర్లు, ఆస్పత్రుల సంఖ్య అధికంగానే ఉంటోంది. కృత్రిమ అవయవాలు కూడా పుట్టుకొస్తున్నాయి. కానీ, కొన్ని అవయవాలను మాత్రం ఒక మనిషికి మరో మనిషి నుంచి సేకరించే అమర్చాలి. అలాంటి అవయవాలను కోల్పోయి చావుకు చేరువైన వారిని బతికించాలంటే.. చనిపోయిన వారు అవయవదానం చేయాలి. మరణానంతరం ఒక వ్యక్తి అవయవదానం చేస్తే.. అలాంటి అవయవాల లోపంతో బాధపడుతున్న 8 మంది జీవితాల్లో వెలుగులు నింపొచ్చు. ఇటీవల కొన్ని నగరాల్లో ఇలాంటి అవయవదానాలతో ఎంతోమందికి పునర్జన్మ లభించింది. అవయవదానం చేసిన వారికి మరణాంతరం కూడా మళ్లీ జీవించే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో అవయవదానంపై అవగాహన కోసం ‘సాక్షి’ ప్రత్యేక కథనం...

అద్దంకి: మానవ శరీరంలోని అవయవాలు కణజాలంతో నిర్మితమై ఉంటాయి. మన శరీరంలోని ప్రతి అవయవం ప్రత్యేక పనులు నిర్వర్తిస్తుంటుంది. పుట్టిన సమయంలో అవసరానికన్నా మిగులు సామర్థ్యం కలిగి.. వయసు పెరుగుతున్న కొద్దీ పనిచేసే సమర్థ్యం తగ్గుతూ ఉంటుంది. అటువంటి అవయవాల్లో గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు కీలకమైనవి.

పలు కారణాల వలన పాడవుతున్న అవయవాలు...
కొన్ని రకాల వ్యాధుల కారణంగా శరీరంలోని అవయవాలు దెబ్బతింటుంటాయి. అనేక రకాల చికిత్సలతో దెబ్బతిన్న అవయవం తిరిగి సక్రమంగా పనిచేసేలా చేయొచ్చు. అయితే, మూత్రపిండ వ్యాధితో డయాలసిస్‌ చేయించుకునే వారికి కార్డియో వ్యాస్క్యులర్‌ (గుండె జబ్బు) ముప్పు ఉంటుంది. డయాలసిస్‌ చేసే సమయంలో రక్తంలో యాంటీఆక్సిడెంట్‌లు తగ్గిపోవడమే దీనికి కారణమని వైద్యులు చెబుతున్నారు. అందుకే అధిక కేసుల్లో అవయవ పనితీరు క్షీణిస్తే మరో అవయవాన్ని అమర్చడమే ప్రత్యామ్నాయంగా మారింది. దానికి ఆరోగ్యవంతమైన వ్యక్తి నుంచి అవయవాన్ని తీసి రోగికి అమరుస్తారు. దీన్నే ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అంటారు. అవయవదాత జీవించి ఉన్న వ్యక్తి, లేదా చనిపోయిన వ్యక్తి అయినా కావచ్చు. 

అవయవదానం ఎవరు చేయవచ్చు..?
కేన్సర్, హెచ్‌ఐవీ వ్యాధి బాధితులు, రక్తంలో లేదా శరీర కణజాలంలో వ్యాధికారక బ్యాక్టీరియా ఉన్న వారు, ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారు, గుండె, మూత్రపిండాల వ్యాధులన్న వారు మినహా మిగిలిన వారందరూ అవయవదానం చేయడానికి అర్హులే. ఇలా చేసే అవయవదానం మరణానంతరమే కాకుండా, జీవించి ఉన్న సమయంలోనూ చేసే అవయవాలున్నాయి. అవయవదానం చేయదలచుకున్న వారు జీవన్‌దాన్‌ సంస్థలో పేరు నమోదు చేసుకోవచ్చు.
జీవించి ఉన్న వారి అవయవాలను ఎవరు స్వీకరించవచ్చు...జీవించి ఉన్న వారి అవయవాలను వారి తల్లిదండ్రులు, పిల్లలు, సోదర, సోదరిలు, మనవరాళ్లు, మనవళ్లకు మాత్రమే దానం చేయవచ్చు. వేరేవారికి ఈ అవయవాలను దానం చేయడం కుదరదు. కొన్ని సందర్భాల్లో స్నేహితుల నుంచి దానం స్వీకరించవచ్చు. 

మరణించిన వ్యక్తి అవయవాలతో ఎంతమందికి ప్రాణదానం చేయొచ్చు...
మరణించిన వ్యక్తి నుంచి స్వీకరించిన ఎనిమిది అవయవాలను ఎనిమిది మంది రోగులకు అమర్చి వారికి ప్రాణదానం చేయవచ్చు. అలా దానం చేసే అవయవాల్లో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, పాన్‌క్రియాస్, చిన్నపేగు, కార్నియా (కంటిపై పారదర్శక పొర), ఎముక కణజాలం, గుండె కవాటాల రక్తనాళాలు ఉన్నాయి.

అవయవదానం సురక్షితమేనా..?
దాతల్లో హెచ్‌ఐవీ, హెపటైటిస్, కేన్సర్‌ ఇన్‌ఫెక్షన్‌ కారకాలు ఉన్నాయో.. లేవో అన్నది వైద్యులు నిర్ధారించిన తర్వాతే అవయవదానం చేయాలా.. వద్దా..? అనేది తేలుస్తారు. దానానికి ముందుకు వచ్చిన వారికి ఆరోగ్య సమస్యలుంటే వాటిని పరీక్షిస్తారు. బ్లడ్‌ గ్రూప్, రోగ నిరోధక శక్తి వ్యవస్థ స్థితి స్వీకర్తతో సరిపోతుందా..లేదా..? అనే అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే అవయవాలను తీసుకుంటారు.
అవయవదానానికి ఎలా సమాచారం అందించాలి...

మరణం లేదా బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి కేసులు వైద్యశాలల్లో నమోదైనప్పుడు ఆ సమాచారాన్ని ఆర్గాన్‌ ప్రోక్యూర్‌మెంట్‌ విభాగాలకు వెంటనే అందజేస్తారు. ఆ వివరాల ఆధారంగా సంబంధిత వ్యక్తి అవయవదానానికి అంగీకరించి ఉన్నారా.. లేదా..? చెక్‌ చేస్తారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను సంప్రదించి అవయవదానానికి ఆమోదం తీసుకుంటారు. వెంటనే అవయవాలను వేరుచేసే పనిని వేగంగా చేస్తారు. వైద్యశాలల్లో మరణించిన వారి విషయంలో ఈ పని చాలా వేగంగా జరుగుతుంది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి కేసుల్లో మరింత సులువుగా ఉంటుంది. 

ఎంత సమయంలోగా దానం చేయాలి..?
దాత శరీరం నుంచి గుండెను బయటకు తీసిన తర్వాత దాని జీవిత కాలం కేవలం సగటున నాలుగు గంటలే. ఊపిరితిత్తులు కూడా అంతే. మూత్రపిండాలను 30 గంటల్లోపు రోగి శరీరంలో అమర్చాలి. లివర్, పాన్‌క్రియాస్‌ అవయవాలను సేకరించిన 12 గంటల్లోపు అమర్చాలి. ముఖ్యంగా దాత నుంచి అవయవాన్ని వేరుచేసిన తర్వాత వేగంగా రోగి శరీరంలో అమర్చాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కో వయసు వ్యక్తిని బట్టి ఆ సమయం మారుతూ ఉంటుంది. 

బ్రెయిన్‌ డెడ్‌ అంటే..?
మెదడు పనిచేయకుండా ఆగిపోయో స్థితిని బ్రెయిన్‌ డెడ్‌ అంటారు. గాయం కారణంగా మెదడు దెబ్బతిని పనిచేయకుండాపోతే ఆ వ్యక్తి ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉండదు. అయితే, కృత్రిమ వ్యవస్థల సాయంతో పనితీరును కొనసాగించవచ్చు. ఇలా చేసి ఆ వ్యక్తి నుంచి అవయవాలను బయటకు తీసి రోగి శరీరంలో అమరుస్తారు. బ్రెయిన్‌ డెడ్‌ తర్వాత గుండె, కాలేయం, కిడ్నీలు, పేగులు, ఊపిరితిత్తులు, పాన్‌క్రియాస్‌ను దానం చేయవచ్చు. కార్నియా, గుండె కవాటాలు, చర్మం, ఎముకలను సహజ మరణం పొందిన వారి నుంచి కూడా స్వీకరించవచ్చు. 

వైద్యశాలల్లో పేర్ల నమోదుతో అవయవ మార్పిడి...
అవయవాలు ఎవరికి అవసరమో ఆ జాబితాను దాదాపు ప్రతి వైద్యశాల తయారు చేస్తుంది. అవయవదానానికి సమ్మతించిన వారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే జీవన్‌దాన్‌ సంస్థలో పేర్లు నమోదు చేసుకోవాలి. ఇలా హామీ ఇచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యులు దానానికి సమ్మతించాలి. అలాగే, మొత్తం శరీరాన్ని వైద్య పరీక్షల కోసం దానం చేయవచ్చు. 

ఎవరి అవయవాలు దానం చేయవచ్చు...
సాధారణంగా మనిషి మృతిచెందిన తర్వాతే అవయవదానం అంశం తెరపైకి వస్తుంది. అటువంటి వ్యక్తి అవయవాలు సేకరించడం కోసం మరణానికి ముందు అతని ఆరోగ్య పరిస్థితి, వ్యాధుల సమాచారం ఆధారంగా తగిన పరీక్షలు చేస్తారు. ఆ తర్వాతే అవయవాలు సేకరిస్తారు.

జీవించి ఉండగానే దానం చేసే అవయవాలివే...
మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె, కళ్లు కార్నియా, కాలేయం, పాన్‌క్రియాస్‌ చిన్నపేగు, చర్మ కణజాలం, ఎముక కణజాలం, గుండె కవాటాలు, నరాలు, ఇయర్‌ డ్రమ్స్‌ (చెవికి సంబంధించినవి) వంటివి దానం చేయవచ్చు.

పిల్లలైనా దానం చేయవచ్చు...
అవయవాలను మరణించిన తర్వాత లేదా బ్రెయిన్‌ డెడ్‌ అయిన వారి నుంచి స్వీకరిస్తారు. వైద్యశాలల్లో అటువంటివి సంభవించినప్పుడు బ్రెయిన్‌ డెడ్‌ అయిన పిల్లల అవయవాలను అవసరం ఉన్న చిన్నారులకు అమరుస్తారు. అయితే, స్వీకరించే పిల్లల వయసు కన్నా దాతల వయసు తక్కువగా ఉండాలి.

కేన్సర్‌ రోగులు కూడా అవయవదానం చేయొచ్చు...
కొన్ని రకాల కేన్సర్‌ రోగులు సైతం అవయవదానం చేయొచ్చు. అతని పరిస్థితి ఏమిటన్నదానిపై అవయవదానం చేయొచ్చా.. లేదా..? అనే అంశం ఆధారపడి ఉంటుంది. లేకుంటే అవయవం అమర్చిన వారికి కూడా కేన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది. 

దానం చేసిన అవయవాలు ఎలా పనిచేస్తాయంటే..?
► దాత నుంచి సేకరించిన మూత్రపిండం అమర్చిన వారికి 9 ఏళ్లపాటు పనిచేస్తుంది. 

► జీవించి ఉన్న వారు తమకున్న రెండింటిలో ఒక మూత్రపిండాన్ని రోగికి దానం చేయవచ్చు. 

► జీవించి ఉన్న వ్యక్తి తన ఊపిరితిత్తుల్లో కొంత భాగాన్ని అవసరమైన రోగికి దానం చేయవచ్చు.

►జీవించి ఉన్న వారి నుంచి పాన్‌క్రియాస్‌లో కొంత భాగం దానం చేసినా మిగిలిన భాగం చక్కగా పనిచేస్తుంది. 

►పేగులోని కొంత భాగాన్ని అదే పేగు పాడైపోయిన వారికి దానం చేయవచ్చు

►కాలేయంలో కొంత భాగాన్ని దానం చేయవచ్చు. అలా ఇచ్చిన దాత కాలేయం నుంచి తీసిన

► భాగం కొన్నాళ్లకు మళ్లీ ఏర్పడి పూర్తి అవయవంగా తయారవుతుంది. మానవ శరీరంలో కొంత తీసిన తర్వాత మళ్లీ పెరిగే అవయవం ఇదొక్కటే. 

► కంటిలో ఉండే చూపునకు సంబంధించిన పారదర్శక పొర ప్రమాదం కారణంగా, లేదా ఇన్‌ఫెక్షన్‌ కారణంగా దెబ్బతిన్న రోగికి మళ్లీ కార్నియాను అమర్చడం వల్ల తిరిగి చూపు తెప్పించవచ్చు.

► కాలిన గాయాల వారికి చర్మ కణజాలం మార్పిడి చేయవచ్చు. ఇది జీవించిన వ్యక్తి నుంచే తీసి రోగికి వేయవచ్చు. ఇలా వేసినందుల వల్ల దాతలకు ఏ విధమైన ఇబ్బందీ ఉండదు. 

►గుండెకు బైపాస్‌ సర్జరీ చేసే వారికి పాడైపోయిన నరాల స్థానంలో దాత నుంచి సేకరించిన నరాలను ఉపయోగిస్తుంటారు. 

► అలాగే రక్తం, రక్తం మూలకణాలను దానంగా ఇవ్వవచ్చు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement