మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జమీర్ అహ్మద్
కుటుంబ ఖర్చుల కోసం రూ.5లక్షల అందజేత
అన్ని విధాల ఆదుకుంటానని హామీ
తుమకూరు : తాను మరణిస్తూ మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపి మానవతాను చాటుకున్న హరీష్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని జేడీఎస్ ఎమ్మెల్యే జమీర్ ఆహ్మద్ అన్నారు. తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలూకా, కడబ సమీపంలోని కరెగౌడనహళ్లికి చెందిన హరిష్ (22) మంగళవారం సాయంత్రం జాతీయ రహదారిలో జరిగిన లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణం పోతుందని తెలుసుకొని కళ్లను సేకరించాల్సిందిగా వైద్యులకు తెలపాలని స్థానికులకు సూచిస్తూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
మృతుడి కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ పరామర్శించి హరీష్ మానవతను శ్లాఘించారు. ప్రాణాలు పోతున్న చివరి క్షణంలో కూడా మంచి మనుసుతో మరొకరి జీవితంలో వెలుగు నింపి వెళ్లారని కొనియాడారు. ఈ ప్రమాదం విషయం టీవిలో చూసి బాధపడ్డానని, ఉప ఎన్నికల ఫలితాలు ఉన్నందున ఆ సమయంలో రాలేకపోయానన్నారు. ఇరుకైన ఇంటిలో నివాసం ఉంటున్న హరీష్‌కు దేవుడు విశాలమైన మనస్సు ఇచ్చారన్నారు.
కుటుంబానికి ఆసరాగా ఉన్న హరీష్ మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని ఆదుకుంటానన్నారు. హరిష్ అన్న శ్రీధర్‌కు ఉద్యోగ అవకాశం కల్పించి దగ్గరుండి వివాహం చేయిస్తానని, తల్లికి ఏ కష్టం వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు. అనంతరం కుటుంబ ఖర్చుల కోసం రూ. 5 లక్షలు అందజేశారు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చుమొత్తం సొంతంగా భరిస్తానన్నారు.
హరీష్‌ది విశాల హృదయం
Published Thu, Feb 18 2016 11:58 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM
Advertisement