బ్రెయిన్‌డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవ దానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నిండాయి.
పంజగుట్ట (హైదరాబాద్): బ్రెయిన్‌డెడ్ అయిన ఓ వ్యక్తి అవయవ దానంతో ఐదుగురి జీవితాల్లో వెలుగులు నిండాయి. నిమ్స్ జీవన్‌దాన్ ప్రతినిధి అనురాధ దీనికి సంబంధించిన వివరాలను ఆదివారం మీడియాకు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వల్లోల గణేశ్ (56) చిక్కడపల్లిలో నివసిస్తూ స్థానికంగా కెమెరా సర్వీసింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 12న గణేశ్కు హైబీపీతో ఫిట్స్ రావడంతో స్పృహ తప్పి పడిపోయాడు.
కుటుంబ సభ్యులు చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. గణేశ్ బ్రెయిన్‌డెడ్ అయినట్లు 14వ తేదీన వైద్యులు నిర్ధరించారు. అవయవ దానం గురించి జీవన్‌దాన్ ప్రతినిధులు గణేశ్ కుటుంబ సభ్యులకు వివరించారు. అవయవ దానానికి వారు ఒప్పుకోవడంతో గణేశ్కు శస్త్రచికిత్స నిర్వహించి రెండు మూత్రపిండాలు, కాలేయం, రెండు కళ్లు తొలగించి అవసరమైన వారికి అమర్చినట్టు అనురాధ మీడియాకు తెలిపారు.