
అవయవాలను గ్రీన్ చానల్ ద్వారా అంబులెన్స్‌లలో తరలిస్తున్న దృశ్యం (ఇన్‌సెట్‌లో) వలంటీర్ కోటేశ్వరరావు (ఫైల్)
గన్నవరం/తాడేపల్లి రూరల్: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వలంటీర్‌గా పనిచేస్తోన్న ఓ యువకుడికి రోడ్డు ప్రమాదం జరగడంతో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. తల్లి, బంధువుల అనుమతితో గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఆ యువకుడి అవయవాలను దానం చేశారు. మచిలీపట్నం సుల్తానా బజార్‌కు చెందిన మరీదు వెంకటరత్నం (లేటు), రేవతిల రెండవ కుమారుడు కోటేశ్వరరావు (27) అక్కడే వార్డు వలంటీరుగా పనిచేస్తున్నాడు. ఇద్దరు అక్కలకు, అన్నయ్యకు వివాహం జరగడంతో తల్లితో ఉంటున్నాడు.
ఈ నెల 20న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ వివాహంలో పాల్గొనేందుకు బైక్‌పై వెళ్తుండగా భీమడోలు వద్ద కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మెరుగైన వైద్యం కోసం మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. ఇక్కడి డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పారు. కోలుకోకపోవడంతో అవయవదానం చేసేందుకు తల్లి రేవతి ముందుకు వచ్చారు. దీంతో కోటేశ్వరరావు అవయవాలను ఎన్‌ఆర్‌ఐ వైద్యులు తొలగించారు.
8 మందికి కొత్త జీవితం..
కోటేశ్వరరావు శరీరంలో 6 అవయవాలను దానం చేయడంతో ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఎన్‌ఆర్‌ఐ చెన్నై ఆసుపత్రికి చెందిన 40 మంది డాక్టర్లు గురువారం శస్త్రచికిత్స చేశారు. కోటేశ్వరరావు శరీరం నుంచి గుండె, ఊపిరితిత్తులు, ప్రాంకయిటిస్, లివర్‌ను చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. దీనికోసం మంగళగిరి పోలీసులతో పాటు తాడేపల్లి, కృష్ణలంక, పటమట, రామవరప్పాడు, ఆటోనగర్, ఎనికేపాడు, గన్నవరం పోలీసులు హైవేపై భారీ బందోబస్తు నిర్వహించి గుంటూరు నుంచి గన్నవరం వెళ్లే రహదారిలో గ్రీన్ చానల్‌ను ఏర్పాటు చేశారు.
అవయవాలతో ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్ నుంచి బయలుదేరిన 3 అంబులెన్స్‌లు 27 నిమిషాల్లో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి. అక్కడ అవయవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2 విమానాల్లో వాటిని చెన్నైకి తరలించారు. కోటేశ్వరరావు 2 కిడ్నీలలో ఒక కిడ్నీని గుంటూరులోని రమేష్ హాస్పిటల్‌కు, మరో కిడ్నీని మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌లో రోగికి అమర్చనున్నారు. రెండు కళ్లను ఓ కంటి ఆసుపత్రికి అందజేశారు.