కిరణ్‌చంద్ (ఫైల్), తల్లిదండ్రులు
శ్రీకాకుళం రూరల్/అక్కిరెడ్డిపాలెం/తిరుపతి తుడా(తిరుపతి జిల్లా)/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటి సారిగా ఓ బ్రెయిన్ డెడ్ విద్యార్థి నుంచి అవయవాలు సేకరించారు. జిల్లా కేంద్రంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో అవయవదానం కార్యక్రమం ఆదివారం జరిగింది. సోంపేట మండలం గీతామందిర్ కాలనీకి చెందిన విద్యార్థి మళ్లారెడ్డి కిరణ్‌చంద్(16)కు బ్రెయిన్ డెడ్ కావడంతో మెదడులోని నరాలు చిట్లి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. విద్యార్థి తల్లిదండ్రులు మోహన్, గిరిజాకల్యాణిల అంగీకారంతో అవయవాలు సేకరించారు.
కిరణ్‌చంద్ ఈ నెలలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. చివరి పరీక్ష ముందు రోజు రాత్రి తీవ్ర జ్వరం, తలనొప్పితో మంచానపడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సీటీ స్కాన్ చేసిన వైద్యులు మెదడులోని నరాలు ఉబ్బినట్లు గుర్తించారు. వెంటనే విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కిరణ్‌చంద్ మెదడులోని నరాలు చిట్లిపోయాయని, ఎక్కడకు తీసుకెళ్లిన బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్యులు తేల్చి చెప్పేశారు. దీంతో కిరణ్‌చంద్ తల్లిదండ్రులు శ్రీకాకుళంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రికి వారం రోజుల కిందట తమ కుమారుడిని తీసుకొచ్చారు.
మోహన్, గిరిజాకల్యాణి దంపతులకు కిరణ్ ఒక్కడే కుమారుడు. అలాంటిది బిడ్డకు ఈ పరిస్థితి రావడంతో వారు చూసి తట్టుకోలేకపోయారు. ఏపీ జీవన్‌దాన్ సంస్థ ఆధ్వర్యంలో అవయవాలు దానం చేయొచ్చని, అవి వేరే వారికి ఉపయోగపడతాయని తెలుసుకున్నారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను మరో ఐదుగురికి అందిస్తే వారిలో తమ కుమారుడిని సజీవంగా చూసుకుంటామని వైద్యులకు చెప్పడంతో.. ఆదివారం రాగోలు జెమ్స్ ఆస్పత్రి వైద్యులంతా కలిసి అవయవాల తరలింపునకు శ్రీకారం చుట్టారు.
గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి ఒక పైలెట్, ఎస్కార్ట్ ద్వారా అవయవాల తరలింపునకు జెమ్స్ ఆస్పత్రి వైద్యులు ఏర్పాట్లు చేశారు. గుండె, కిడ్నీలు, లివర్, కళ్లను ఆపరేషన్ చేసి తీశాక, ముందుగా గుండెను తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రికి తరలించారు. మిగిలిన అవయవాలను విశాఖలోని ఇతరత్రా ఆస్పత్రులకు పంపిస్తామని జెమ్స్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ చెప్పారు.
యువకుడికి కిడ్నీ, లివర్
కిరణ్‌చంద్ అవయవాలను గ్రీన్ చానల్ ద్వారా అంబులెన్స్‌లో విశాఖకు చేర్చారు. ఎయిర్‌పోర్టుకు సాయంత్రం 4.20 గంటలకు చేరుకోగా.. వెంటనే విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలోని ఓ యువకుడికి కిడ్నీ, లివర్‌ను అమర్చి ప్రాణం పోశారు.
దిగ్విజయంగా చిన్నారికి గుండె మార్పిడి
వైద్య రంగంలో మరో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికకు తిరుపతి శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌లోని వైద్యులు గుండె మార్పిడిని విజయవంతంగా పూర్తిచేశారు. నాలుగు నెలల వ్యవధిలోనే ఆస్పత్రిలో వరుసగా ముగ్గురికి గుండె మార్పిడి చికిత్సను నిర్వహించారు. కిరణ్‌చంద్ నుంచి గుండెను వేరుచేసి గ్రీన్ చానల్ ద్వారా విశాఖ విమానాశ్రయానికి, అక్కడి నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి తీసుకొచ్చారు.
అక్కడి నుంచి 27 నిమిషాల్లో శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌కు ప్రత్యేక అంబులెన్స్ ద్వారా తరలించారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్ గణపతి బృందం ఐదేళ్ల చిన్నారికి గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి బాలికకు గుండెను అమర్చారు. తిరుపతి జిల్లా, తడ మండలం, రామాపురంలో నివసిస్తున్న అన్బరసు, గోమతి దంపతులకు ఇద్దరు పిల్లలు.
మొదట జన్మించిన చిన్నారి రీతిశ్రీ పుట్టుకతోనే గుండె బలహీనతతో జన్మించింది. వైద్య పరీక్షలు నిర్వహించి గుండె మార్పిడి అనివార్యమని వైద్యులు నిర్ధారించారు. చెన్నై ఎగ్మోర్ ఆస్పత్రిలో సంప్రదించగా, కొన్ని రోజుల చికిత్స అనంతరం తిరుపతిలోని టీటీడీ శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌కు వెళ్లాలని వైద్యులు సూచించడంతో నాలుగు నెలల కిందట ఇక్కడ చేరారు.
వేగంగా స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం
గుండె మార్పిడి అనివార్యం కావడంతో రీతిశ్రీ తల్లిదండ్రులు ఇటీవల సీఎంవో కార్యాలయంలో సీఎస్ జవహర్‌రెడ్డిని కలిశారు. తమ బిడ్డ పరిస్థితిని, మెడికల్ రిపోర్టులను అందజేశారు. పరిశీలించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి.. గంటల వ్యవధిలోనే ఆరోగ్యశ్రీ నుంచి రూ.10 లక్షలు మంజూరు చేయించారు.
గుండె మార్పిడి చికిత్సకు రూ.20 లక్షలు ఖర్చవుతుండటంతో మరో రూ.10 లక్షలను టీటీడీ సమకూర్చింది. మొత్తం రూ.20 లక్షలతో చిన్నారి కుటుంబానికి ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగానే ఖరీదైన వైద్యాన్ని అందించారు. ఆరోగ్యశ్రీనే తమ బిడ్డను కాపాడిందని, సీఎం జగనన్నకు తాము రుణపడి ఉంటామని రీతిశ్రీ తల్లిదండ్రులు అన్బరసు, గోమతిలు కన్నీళ్లపర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment