ఇతడు చిరంజీవి | tirupati brain dead patient chiranjeevi reddy Organ donation to four people | Sakshi
Sakshi News home page

ఇతడు చిరంజీవి

Published Mon, Aug 1 2016 7:57 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

ఇతడు చిరంజీవి

ఇతడు చిరంజీవి

తిరుపతి స్విమ్స్‌లో చిరంజీవిరెడ్డి బ్రెయిన్‌డెడ్ 
అవయవదానానికి కుటుంబసభ్యుల అంగీకారం
గుండె, కాలేయం, మూత్రపిండాలు సేకరించిన వైద్యులు

హైదరాబాద్ స్టార్ ఆస్పత్రికి గుండె..
►  విశాఖ అపోలోకు కాలేయం

 
తిరుపతి : బ్రెయిన్ డెడ్‌కు గురైన ఓ వ్యక్తి శరీరంలోని అవయవాలను అతని కుటుంబసభ్యులు ఆదివారం దానం చేశారు. నలుగురికి అవయవాలు దానం చేసి ఆ వ్యక్తి చిరంజీవిగా నిలిచాడు. వివరాలు..  తిరుపతి గాంధీపురంలో నివసించే పెద్దపాపమ్మ కుమారుడు బి.చిరంజీవి రెడ్డి(45) నగరంలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అవివాహితుడైన చిరంజీవి తీవ్రమైన జ్వరం, అనారోగ్యంతో బాధపడుతుండడంతో చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ఈనెల 27న స్విమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న చిరంజీవి శనివారం బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు స్విమ్స్ వైద్యులు ధ్రువీకరించారు.

దీంతో చిరంజీవి అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. స్విమ్స్ వైద్యులు, జీవన్‌దాన్ ట్రస్ట్ నిర్వాహకులు ఆదివారం మధ్యాహ్నం వరకు దశల వారీ శస్త్ర చికిత్సలు చేసి 4 అవయవాలు తీశారు.  అందులోగుండెను హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రికి, కాలేయాన్ని విశాఖలోని అపోలో ఆసుపత్రికి విమానం ద్వారా తరలించారు. ఒక కిడ్నీని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని నా రాయణ ఆసుపత్రికి చేర్చారు. మరొక దానిని స్విమ్స్ ఆసుపత్రిలోనే ఓ రోగికి అమర్చారు. చిరంజీవి మృతదేహానికి స్విమ్స్ సి బ్బంది పూ లమాలలు వేసి నివాళులర్పించారు. చిరంజీవి రెడ్డి నుంచి సేకరించిన గుండెను హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో ఓ మహిళకు, కాలేయాన్ని విశాఖ అపోలో మరో వ్యక్తికి ఆదివారం విజయవంతంగా అమర్చారు. మహబూబ్‌నగర్ జిల్లా వట్టివర్లపల్లికి చెందిన పరమేశ్వర్ భార్య విజయలక్ష్మి(36) పదేళ్లుగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ మన్నెం గోపీచంద్‌ను ఆశ్రయించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెకు గుండె మార్పిడి అవసరమని తేలింది. దీంతో దాత కోసం జీవన్‌దాన్‌లో ఆమె పేరు నమోదు చేసుకున్నారు.

ఈ క్రమంలో చిరంజీవిరెడ్డి గురించి తెలుసుకున్న స్టార్ వైద్య బృందం వెంటనే తిరుపతి చేరుకుని గుండెను సేకరించింది. మధ్యాహ్నం 2.15 నిమిషాలకు తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 3.05 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి, అంబులెన్స్‌లో అక్కడి నుంచి ‘గ్రీన్‌చానల్’ద్వారా 15 నిమిషాల్లో స్టార్ ఆస్పత్రికి గుండెను చేర్చింది. అనంతరం వైద్య బృందం విజయవంతంగా విజయలక్ష్మికి గుండెను అమర్చింది. అలాగే విజయవాడకు చెందిన ఓ వ్యక్తి కాలేయ వ్యాధితో బాధపడుతూ విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కాలేయ మార్పిడి అవసరమని తేల్చిన వైద్యులు.. బ్రెయిన్‌డెడ్ అయిన చిరంజీవిరెడ్డి నుంచి కాలేయాన్ని ప్రత్యేక విమానంలో విశాఖ తీసుకొచ్చారు. గ్రీన్ చానల్ ద్వారా అంబులెన్స్‌లో సాయంత్రం 7.25 గంటలకు ఆస్పత్రికి చేర్చి ఆపరేషన్ ప్రారంభించారు. శస్త్రచికిత్స పూర్తయ్యేసరికి 9 నుంచి 10 గంటలు పడుతుందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement