మృత్యువులోనూ ఐదుగురికి పున ర్జన్మ
లబ్బీపేట: అవయవదానంపై నగర ప్రజల్లో చైతన్యం వచ్చింది. తమ బిడ్డలు ప్రాణాలు వదులుతున్నారని తెలిశాక, పుట్టెడు దుఖఃలోను మరో ఐదుగురికి పునర్జన్మను ప్రసాదిస్తున్నారనే ఆత్మసంతృప్తితో అవయవాలు దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మొన్న మణికంఠ, నేడు సుధీర్ మృత్యువులోనూ తమ అవయవాలతో మరో ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించారు.
ఎనికేపాడుకు చెందిన ధనేకుల శివరామప్రసాద్, విజయలక్ష్మి ఇద్దరూ ప్రయివేటు ఉద్యోగులే. వారి పెద్దకుమారుడు సుధీర్ సరోజిని ఇంజినీరింగు కళాశాలలో ఈ ఏడాది మార్చిలో ఇంజినీరింగు పూర్తి చేశారు. చిన్నకుమారుడు సీఏ చేస్తున్నారు. సుధీర్ ఉద్యోగావకాశాల కోసం కంప్యూటర్ శిక్షణ పొందుతూ సర్టిఫికెట్‌ల కోసం ఈ నెల 21న కళాశాలకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తొలుత ప్రభుత్వాస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సుధీర్ బ్రెయిన్‌డెత్‌కు గురయ్యాడని నిర్ధారిం చారు. కుమారుడిని మంచి ఇంజినీర్‌కు చూడాలనుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లారు. సుధీర్ ప్రాణాలను నిలిపే అవకాశం లేనందున అవయవదానం ద్వారానే మరో ఐదుగురికి పునర్జన్మను ఇవ్వవచ్చని అతని స్నేహితులు సలహా ఇవ్వడంతో తండ్రి శివరామ్‌ప్రసాద్ అంగీకరించారు. ఈ విషయంలో ఆంధ్రా హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమణమూర్తి కూడా చొరవ తీసుకున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోని జీవన్‌దాన్ సంస్థకు సమాచారం తెలపడంతో వారి సూచన మేరకు ఆంధ్రా హాస్పిటల్‌లోనే సుధీర్ గుండె, ఊపిరి తిత్తులు, లివర్, కళ్లు, కిడ్నీలను సేకరించి వివిధ ప్రాంతాలకు తరలించారు.
ఆస్పత్రి నుంచి ఆ అవయవాలను తరలిస్తుండగా, సన్నిహితులు, బంధువులు పూలు చిమ్ముతూ అంజలి ఘటించారు. సుధీర్ తరచూ రక్తదానంచేసే వాడని, అదే స్ఫూర్తితో ఐదుగురికి పునర్జన్మను ఇవ్వాలని అవయవాలు దానం చేశామని అతని తండ్రి శివరామప్రసాద్ తెలి పారు. మట్టిలో కలిసిపోయే కన్నా, మరో ఐదుగురికి పునర్జన్మను ఇస్తాయనే దానం చేశామని పేర్కొన్నారు. అవయవదానం చేసిన శివరామప్రసాద్, విజయలక్ష్మి దంపతులను ఆంధ్రా హాస్పిటల్ పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పి.వి.రామారావు, న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు.