తాను మరణిస్తూ.. ఐదుగురికి ప్రాణం పోస్తూ..
-
దినేష్‌రెడ్డి అవయవదానానికి కుటుంబ సభ్యుల అంగీకారం
-
అవయవాలు హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు
-
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
నెల్లూరురూరల్ : చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబానికి దున్నుగా నిలిచాడు. ఇప్పుడు తాను మరణిస్తూ.. మరో ఐదుగురికి ప్రాణాలు పోస్తున్నాడు. బ్రెయిన్ డెడ్ అయిన దినేష్‌రెడ్డి (32) తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంనూ తమ బిడ్డ అవయవాలు ఇతరులకు ఊపిరి పోస్తాయనే ఆశతో అంగీకరించారు. ఈ సంఘటన శుక్రవారం నెల్లూరులో చోటు చేసుకుంది. విడవలూరు మండలం వావిళ్లకు చెందిన చిల్లకూరు శ్రీహరిరెడ్డి, వసంతలక్ష్మి దంపతులు బతుకుతెరువు కోసం నెల్లూరు నగరానికి 16 ఏళ్ల క్రితం వచ్చారు. నవాబు పేటలోని పుల్లమ్మసత్రం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గేదెలతో మినీ పాలడెయిరీ నడుపుతూ సంతోషంగా జీవిస్తున్నారు. వారికి ఒక కుమార్తె అనూష, కుమారుడు దినేష్‌రెడ్డి ఉన్నారు. కుమారుడు స్థానిక చికెన్ స్టాల్‌లో పనిచేస్తున్నాడు. సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంపై విధి పగబట్టింది. పెళ్లీడు కొచ్చిన కుమారుడు దినేష్‌రెడ్డి ఈ నెల 13న రాత్రి ఫిట్స్ రావడంతో పడిపోయాడు. తల్లిదండ్రులు హుటావుటిన అపోలో స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెదడుకి ఆపరేషన్ చేశారు. చికిత్స పొందుతుండగానే మరొక సారి ఈ నెల 18న తీవ్రమైన ఫిట్స్‌కు గురై కోమాలోకి వెళ్లాడు. పరిశీలించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయిందని నిర్ధారించారు. పిడుగు లాంటి ఈ వార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కుప్ప కూలిపోయారు. తన బిడ్డను ఎలాగోలా బతికించాలని డాక్టర్ల బతిమిలాడారు. బ్రెయిన్ డెడ్‌కు గురైన వ్యక్తిని బతికించడం సాధ్యం కాదని డాక్టర్లు వివరించారు. బిడ్డ ఎలాగు బతకడని అవయవదానం చేస్తే మీ బిడ్డ కనీసం ఐదు మందికి ప్రాణదానం చేస్తాడని డాక్టర్లు చెప్పడంతో దుఃఖాన్ని దాచుకుని మరో ఐదుగురికి జీవితాన్నిస్తాడనే ఆశతో అవయవదానానికి అంగీకరించారు. జీవన్‌దాన్ ట్రస్ట్ అనుమతి పొందిన నారాయణ ఆసుపత్రికి దినేష్‌రెడ్డిని తరలించారు. శనివారం తెల్లవారు జామున ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి దినేష్‌రెడ్డి శరీర భాగాలను తరలించేందుకు డాక్టర్లు ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్‌కు గుండె, లివర్
దినేష్‌రెడ్డి గుండెను, లివర్‌ను ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక కిడ్నీని నారాయణ ఆసుపత్రికి , మరో కిడ్నీని కిమ్స్ ఆసుపత్రికి, కళ్లను మోడరన్ ఐ బ్యాంక్‌కు తరలించనున్నారు.