
తాను లేకున్నా.. ఐదుగురికి ప్రాణం పోసింది
బెంగళూరు: ఇంజనీర్ కావాలని కలలు కంది. కల సాకారం కాకుండానే చిన్న వయసులోనే కనుమూసింది. ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. తాను ఈ లోకంలో లేకున్నా అవయవదానం చేయడం ద్వారా మరో ఐదుగురికి పునర్జన్మ ఇచ్చి సజీవంగా బతుకుతోంది కర్ణాటకకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని సంజన (18). బ్రెయిన్ డెడ్ అయిన సంజన అవయవాలను తల్లిదండ్రుల అనుమతితో దానం చేశారు.
సంజన గుండెను కోయంబత్తూరుకు చెందిన శివన్ (30) అనే వ్యక్తికి అమర్చారు. సంజన గుండెను బెంగళూరు నగరంలో కెంగేరి బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి నుంచి బొమ్మసంద్ర నారాయణ హెల్త్ సిటీకి తీసుకెళ్లడానికి పోలీసు అధికారులు సహకరించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీంతో కేవలం 28 నిమిషాల్లో 37 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుండెను సురక్షితంగా చేర్చారు. శివన్ కు గుండెను దానం చేయకుంటే మరో పది రోజులు మాత్రమే బతికేవాడని వైద్యులు తెలిపారు. సంజన కళ్లు, కాలేయం, కిడ్నీలను మరో నలుగురు రోగులకు దానం చేశారు. బెంగళూరుకు చెందిన 44 ఏళ్ల మహిళకు కాలేయం, కిడ్నీ దానం చేశారు. మరో పేషెంట్కు ఇంకో కిడ్నీ, మరో ఇద్దరికి కళ్లను దానం చేశారు.
హసన్కు చెందిన సంజన ఈ నెల 21న మైసూర్ కేఆర్ఎస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం హాసన్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వైద్యులు శ్రమించినా ఫలితం లేకపోయింది. సంజన బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. సంజన అవయవాలను దానం చేయాలని వైద్యులు ఆమె తల్లిదండ్రులను ఒప్పించారు. వైద్యుల సలహా మేరకు ఆమెను బెంగళూరులోని కెంగేరి బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు.
సంజన మరణించినా ఆమె అవయవాలను దానం చేయడంతో మరో ఐదుగురి రూపంలో బతికే ఉంటుందని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి వైస్ చైర్మన్, చీఫ్ న్యూరో సర్జన్ డాక్టర్ ఎన్ కే వెంకటరమణ అన్నారు. అవయవ దానం చేసేందుకు అంగీకరించిన సంజన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన హసన్ డాక్టర్లకు, బెంగళూరు పోలీసులకు అభినందనలు తెలిపారు.