
మైత్రి తేజస్విని
లబ్బీపేట(విజయవాడ తూర్పు): మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ బైక్‌తో ఢీకొట్టడంతో బ్రెయిన్ డెడ్ అయిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చిన్నాబత్తుల మైత్రి తేజస్విని అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. విజయవాడలోని ఏలూరురోడ్డులో మంగళవారం రాత్రి ప్రమాదం జరగ్గా, బుధవారం ఉదయం తేజస్విని బ్రెయిన్‌డెడ్ అయిన విషయం తెలిసిందే. జీవన్‌ధాన్ సభ్యులు సంప్రదించగా ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు.
తేజస్విని చికిత్స పొందిన మెట్రో హాస్పిటల్‌లో గురువారం గుండె, కాలేయం, కిడ్నీలు, కళ్లు సేకరించారు. గుండెను చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రికి, కాలేయాన్ని విశాఖపట్నం అపోలోకు, కిడ్నీలను విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి, నెల్లూరు నారాయణ ఆస్పత్రికి తరలించారు. కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు అప్పగించారు. గుండెను చెన్నై తరలించేందుకు ఆస్పత్రి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. గుండెను తరలిస్తున్న సమయంలో బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు భారమైన హృదయాలతో అంజలి ఘటించారు.
Comments
Please login to add a commentAdd a comment