organs donate
-
పెళ్లంటే.. రక్తదానం..అవయవదానం..ఇదో వెరైటీ మ్యారేజ్..!
ఛత్తీస్‌గఢ్: ఎవరైనా పెళ్లంటే..బంధుమిత్రులతో ఘణంగా చేసుకోవాలని భావిస్తారు. పసందైన విందుతో అందరి మన్ననలను పొందాలని భావిస్తారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లో ధమ్తారీ జిల్లాలో జరిగిన ఓ పెళ్లి మాత్రం కాస్త విభిన్నంగా జరిగింది. సమాజానికి ఉపయోగపడేలా వివాహాన్ని కొత్తగా జరుపుకోవాలనుకున్నారు వధూవరులు.ఇంతకూ వారు ఏం చేశారంటే.. జిల్లాలోని కాండెల్ గ్రామంలో ముకేష్, నేహాల వివాహాం అందరికీ స్ఫూర్తిని కలిగిస్తోంది. పెళ్లిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు వధూవరులు. వారి పెళ్లికార్డులపై కూడా రక్తదాన ప్రాముఖ్యతను పేర్కొన్నారు. వారిరువురు పెళ్లిలో రక్తదానం చేయడమే గాక అవయవదానం చేస్తామని కూడా ప్రమాణం చేశారు. బంధుమిత్రుల చేత కూడా ఈ ప్రమాణాన్ని చేపించారు. రక్తదానం చేయడానికి గ్రామవాసులందరు ముందుకు వచ్చారు. ఈ విభిన్నమైన కార్యక్రమంతో వీరి పెళ్లి ఆదర్శవంతంగా జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ధమ్తారీ జిల్లా స్వాతంత్య్రోద్యమంలోనే ప్రముఖంగా నిలిచింది. 1920లోనే గాంధీజీ సత్యాగ్రహాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇదీ చదవండి:పీనాసి ప్రియుడు: అరటి పండు తొక్కతీసి... -
అలా అయితే నా భర్త బతికేవాడు.. జీవితం ఇంకోలా ఉండేది: మీనా ఎమోషనల్
ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. భర్త మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న మీనా.. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారు. ఇటీవల సినిమా షూటింగ్స్‌కి కూడా హాజరయ్యారు. పలువురు బంధువులు, స్నేహితులు తరుచూ కలుస్తుండడంతో మీనా మళ్లీ యాక్టివ్ అయ్యారు. అంతేకాదు తాజాగా ఆమె గోప్ప నిర్ణయం తీసుకున్నారు. తన తదనంతరం అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించి, అందరిచే శభాష్ అనిపించుకున్నారు. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే(ఆగస్ట్ 13) సందర్భంగా తాను ఆర్గాన్ డొనేట్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నానని, మీరు కూడా గొప్ప నిర్ణయాన్ని తీసుకోండి అని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. (చదవండి: 'జబర్దస్త్' మానేయడంపై తొలిసారి నోరువిప్పిన అనసూయ) ‘ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప పని ఇంకోటి ఉండదు. అవయవాలను దానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఒకరికి అవయవాలు దానం చేయడం వల్ల వారి కుటుంబంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో నేను కళ్లారా చూశాను. మా సాగర్‌కు(మీనా భర్త) ఇంకా అలాంటి దాతలు దొరికి ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేది. ఒక దాత 8 మంది ప్రాణాలను కాపాడొచ్చు. అవయవ దానం గొప్పదనం గురించి ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అవయవ దానం అనేది కేవలం డాక్టర్లు, పేషెంట్ల మధ్య సంబంధం కాదు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా అందరికీ సంబంధించింది. నేను నా ఆర్గాన్స్‌ను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నాను’అంటూ ఎమోషనల్ పోస్ని ఇన్‌స్టాలో షేర్ చేసింది. మీనా నిర్ణయం వెనుక ఆమె భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. మీనా భర్తకు ఊపిరితిత్తులు మారిస్తే బ్రతికేవాడు. కానీ సమయానికి దాతలు దొరక్కపోవడంతో ఆయన మృతి చెందారు. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
డాక్టర్స్ డే: బాలీవుడ్ జంట కొత్త నిర్ణయం
జన్మనిచ్చేది అమ్మ అయితే.. ప్రాణం పోసేది వైద్యుడు. కరోనా లాంటి ప్రాణాంతక రోగాలు వచ్చినప్పుడు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడేందుకు శ్రమిస్తారు. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ జంట జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్ ఓ ప్రతిజ్ఞ పూనారు. తమ అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు. "రితేశ్, నేను ఈ పని ఎప్పుడో చేయాలని భావించాం, కానీ కుదరలేదు. ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా మేము మా అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ సంకల్పానికి పూనుకునేందుకు మమ్మల్ని ప్రోత్సహించిన డా.నోజర్ శెరీర్, FOGSIకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. (ఇది శాశ్వతం.. మీ ప్రేమకు ధన్యవాదాలు!) ఒకరికి జీవితాన్ని ఇవ్వడమే అసలైన బహుమతి. కాబట్టి మీరు కూడా ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు ఈ పనిలో భాగస్వాములు అవండి. అవయవదానం చేస్తామని ప్రతిజ్ఞ పూనండి" అని జెనీలియా పిలుపునిచ్చింది. వీరి నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ వైద్యులు బిధాన్ చంద్రరాయ్ గుర్తుగా ప్రతి ఏటా జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటాం. ఆయన 1882 జూలై 1న జన్మించగా 1962 జూలై 1వ తేదీనే మరణించారు. ఆయన అందించిన విశేషమైన సేవలకు గానూ భారత ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 4న బిధాన్ చంద్రరాయ్‌కు అత్యున్నత పురస్కారమైన భారత రత్నను బహుకరించింది. (విద్యుత్ జమాల్‌కు అండగా జెనీలియా!) View this post on Instagram @riteishd and me have been thinking about it for a long time but unfortunately didn’t get down to doing it. Today on Doctor’s Day we pledge to donate our organs. We want to thank Dr Nozer Sherier and FOGSI for inspiring us. The greatest gift you can give someone is ‘The gift of life’. .We urge you all to take a part in this initiate and pledge to save lives, pledge to donate your organs. A post shared by Genelia Deshmukh (@geneliad) on Jul 1, 2020 at 4:29am PDT -
35 కిలోమీటర్లు...30 నిమిషాలు!
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి–శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య మార్గం... అనునిత్యం రద్దీగా ఉండే ఈ రూట్లో వాహనాల సరాసరి వేగం 25కి.మీ. మించదు... మధ్యాహ్నం వేళల్లో ఆ వేగం 20 దాటదు. మరోపక్క నగరంలో వాహనాల సరాసరి వేగం గంటకు 27.1 కిమీ మాత్రమే. అయితే సోమవారం ఆ మార్గంలో ‘ప్రయాణించాల్సిన’ గుండె (లైవ్ ఆర్గాన్) కోసం నగర ట్రాఫిక్ పోలీసులు ‘గ్రీన్ ఛానల్’ ఇచ్చారు. ఫలితంగా 35 కిమీ మార్గాన్ని అంబులెన్స్ కేవలం 30 నిమిషాల్లో అధిగమించింది. అంటే... గంటకు 60 కిమీ వేగంతో ప్రయాణించింది. అంబులెన్స్‌కు పైలెట్‌గా వాహనంలో వెళ్లిన బృందం మొదలు ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమష్టిగా, సమన్వయంతో పని చేయడంతోనే ఇది సాధ్యమైంది. మధ్యాహ్నం మొదలైన ‘ఆపరేషన్’... నగర ట్రాఫిక్ విభాగంలోని అన్ని మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్లు సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మోగాయి. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్‌కు గురైన నిజామాబాద్ వాసి వంశీకృష్ణ (19) నుంచి సేకరించిన గుండెను శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రికి చేర్చాల్సి ఉందని సందేశం వినిపించింది. చెన్నైలోని సదరు ఆస్పత్రిలో ఈ గుండెను రిసీవ్ చేసుకోవాల్సిన రోగికి ఆపరేషన్ సైతం ప్రారంభమైనట్లు వర్తమానం అందింది. ఈ లైవ్ ఆర్గాన్‌తో కూడిన అంబులెన్స్ మధ్యాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరనున్నట్లు ట్రాఫిక్ పోలీసుల చేతుల్లో ఉన్న వాకీటాకీల్లో సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అన్నిస్థాయిల అధికారులు రంగంలోకి దిగారు. 12 గంటల నుంచే ఈ రూట్లో ఉన్న జంక్షన్లలో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు చేపట్టారు. ‘సెంటర్’ నుంచి నిరంతర పర్యవేక్షణ... డోనర్ ఇచ్చిన గుండెతో కూడిన బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్ విమానాశ్రయం వరకు ఉన్న 35 కిమీ దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ రూట్ సైబరాబాద్ పరిధిలోనూ కొంత ఉండటంతో అక్కడి అధికారులతోనూ సమన్వయం చేసుకున్నారు. మహంకాళి ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్లడానికి సిద్ధం కాగా, మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో ఉండే అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంతం పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రయాణించిన మార్గం ఇలా... సరిగ్గా మధ్యాహ్నం 12.33 గంటలకు ‘లైవ్ ఆర్గాన్ బాక్స్’తో కూడిన అంబులెన్స్ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరింది. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి చౌరస్తా, లక్డీకాపూల్, మాసబ్‌ట్యాంక్, మెహదీపట్నం, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వే మీదుగా కేవలం 30 నిమిషాల్లో సరిగ్గా మధ్యాహ్న 1.03 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంతో రికార్డు సమయంలో గమ్యం చేరుకోవడం సాధ్యమైంది. ఈ కాస్సేపు అంబులెన్స్ సైరన్‌కు పోటీగా ట్రాఫిక్ పోలీసులు వైర్లెస్ సెట్స్ నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న విమానంలో ఈ లైవ్ ఆర్గాన్ చెన్నై వెళ్లిపోయింది. ట్రాఫిక్ పోలీసుల సహకారంతోనే ఈ తరలింపు సాధ్యమైందంటూ యశోద ఆస్పత్రి యాజమాన్యం ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపింది. -
కరాటే మాస్టర్ కుమార్తె బ్రెయిన్‌డెడ్..
అన్నానగర్: తిరుచ్చికి చెందిన కరాటే మాస్టర్ కుమార్తె బెంగళూర్‌లో జరిగిన రో డ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. బ్రెయిన్‌డెడ్ అయిన ఆమె ఆవయవాలను కుటుం బీకులు దానం చేశారు. దీంతో ఐదుగురికి పునర్జన్మ లభించింది. తిరుచ్చికి చెందిన ప్రసిద్ధ కరాటే మాస్టర్ వాసుదేవన్. తిరుచ్చి పాఠశాల, కళాశాలలో, పోలీసు శిక్షణ కళాశాలలో కరాటే నేర్పిస్తున్నారు. ఈయన కుమారులు వెంకట్, ముత్తుకుమార్, కుమార్తె రథి(38). ఈమెకి వివాహం జరిగి బెంగళూర్‌లో భర్త ఆనందపిళ్ళై, పిల్లలతో నివసిస్తున్నారు. రెండు రోజుల కిందట బెంగళూర్‌లో రథి స్కూటిలో వెళుతూ ప్రమాదంలో చిక్కుకున్నారు. వెంట నే ఆమెని అక్కడున్న ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. కానీ ఆదివారం ర«థి బ్రెయిన్‌డెడ్ చెందింది. దీంతో అవయవదానం చెయ్యడానికి కుటుంబీకులు ముందుకు వచ్చారు. ఆమె గుండె, రెండు మూత్రపిండాలు, కళ్లు, కాలేయాన్ని డాక్టర్ల బృందం సహాయంతో తీసి దానంగా ఆయా ఆస్పత్రులకు ఇచ్చారు. -
తేజోదీప్తి.. సజీవ కీర్తి
లబ్బీపేట(విజయవాడ తూర్పు): మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ బైక్‌తో ఢీకొట్టడంతో బ్రెయిన్ డెడ్ అయిన యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ చిన్నాబత్తుల మైత్రి తేజస్విని అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. విజయవాడలోని ఏలూరురోడ్డులో మంగళవారం రాత్రి ప్రమాదం జరగ్గా, బుధవారం ఉదయం తేజస్విని బ్రెయిన్‌డెడ్ అయిన విషయం తెలిసిందే. జీవన్‌ధాన్ సభ్యులు సంప్రదించగా ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. తేజస్విని చికిత్స పొందిన మెట్రో హాస్పిటల్లో గురువారం గుండె, కాలేయం, కిడ్నీలు, కళ్లు సేకరించారు. గుండెను చెన్నైలోని గ్లోబల్ ఆస్పత్రికి, కాలేయాన్ని విశాఖపట్నం అపోలోకు, కిడ్నీలను విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి, నెల్లూరు నారాయణ ఆస్పత్రికి తరలించారు. కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు అప్పగించారు. గుండెను చెన్నై తరలించేందుకు ఆస్పత్రి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. గుండెను తరలిస్తున్న సమయంలో బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు భారమైన హృదయాలతో అంజలి ఘటించారు. -
ఏ తల్లి చేయని పని చేసింది
గుంటూరు మెడికల్ : ప్రత్యర్థుల చేతిలో గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన తన కుమారుడి అవయవాలను దానం చేసేందుకు నిశ్చయించుకుని ఆ తల్లి పలువురికి మార్గదర్శకంగా నిలిచింది. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా జంగమహేశ్వరపురానికి చెందిన పుల్లారెడ్డి (30)కి సోదరుడు పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి (43)తోపాటు సోదరి సరోజిని ఉన్నారు. తండ్రి పెద్దవీరారెడ్డి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి కాశమ్మ పెద్ద కుమారుడు పోలిరెడ్డి, కుమార్తె సరోజినిలకు పెళ్లిచేసి ఇద్దరు కుమారులతో కలిసి ఉంటోంది. పుల్లారెడ్డి సోదరి సరోజిని, బావ చెన్నారెడ్డిలకు వారి ఇంటికి ఎదురుగా ఉంటున్న గొంగటి నాగిరెడ్డి, ఆయన భార్య పద్మ, కుమారులు శ్రీనివాసరెడ్డి, వీరారెడ్డిలతో కొద్దిరోజులుగా వివాదం నడుస్తూ ఉంది. సరోజిని తన సోదరులు పుల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డికి ఈ నెల 4న విషయం తెలియజేసింది. సోదరులు ఇద్దరూ సరోజిని ఇంటికి వెళ్లి ఆరా తీస్తున్న సమయంలో నాగిరెడ్డి కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేశారు. పుల్లారెడ్డి బ్రెయిన్‌డెడ్ అయినట్లు మంగళవారం జీజీహెచ్ వైద్యులు నిర్ధారించారు. పెద్ద కుమారుడు చనిపోయి, చిన్న కుమారుడు బ్రెయిడ్‌డెడ్ అవడంతో తల్లి కాశమ్మ పెద్ద మనసుతో తన కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చింది. రెండు కిడ్నీలు, రెండు కళ్లు, లివర్ సేకరించి జీవన్‌దాన్ ట్రస్ట్ కోఆర్డినేటర్ ద్వారా ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్న ఐదుగురికి అవయవాలను అమర్చనున్నట్టు వైద్యులు తెలిపారు. -
చిన్నబాబు గొప్ప హృదయం..
పంజగుట్ట: విజయవాడలో బ్రైయిన్ డెడ్ అయిని బాలుడి కాలేయం నగరానికి తరలించారు. నిమ్స్ జీవన్ దాన్ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం ... విజయవాడకు చెందిన రూప్‌కుమార్ (13) అక్కడి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. రూప్‌కుమార్ ఈనెల 24న పాఠశాలలో ఆడుకుంటుడగా తోటి విద్యార్ది కాలు తగిలి బెంచ్‌పై పడ్డాడు. అతని తలకు బలమైన దెబ్బతగిలింది. తల్లి విజయవాడ సన్ షైన్ ఆసుపత్రికి తరలించింది. 25న వైద్యులు రూప్‌కుమార్‌కు బ్రైయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. జీవన్ దాన్ ప్రతినిధులు అతని తల్లిదండ్రులు శివరామకృష్ణ, తల్లి సునీతలకు అవయవదానం గురించి వివరించారు. వారు ఒప్పుకోవడంతో శస్త్రచికిత్స చేసి బాలుడి 2 కిడ్నీలు, కాలేయం, కళ్లు సేకరించారు. కిడ్నీలు, కళ్లు విజయవాడలోని వివిధ ఆసుపత్రులకు తరలించగా కాలేయంను బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో అంబులెన్స్ లో కాలేయాన్ని తీసుకువస్తుండగా ఎక్కడికక్కడ పోలీసులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా చూశారు... -
విడవలూరు యవకుడికి బ్రెయిన్‌డెడ్
-
విడవలూరు యవకుడికి బ్రెయిన్‌డెడ్
నెల్లూరు: విడవలూరుకు చెందిన దినేష్‌రెడ్డి అనే యవకుడికి బ్రెయిన్ డెడ్ అయింది. దాంతో యవకుడు దినేష్‌రెడ్డి అవయవాలను దానం చేసేందుకు అతడి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. ఈ నెల 13న దినేష్‌రెడ్డికి ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యాడు. అయితే దినేష్‌రెడ్డి బ్రతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో అతడి తల్లిదండ్రుల అంగీకారం మేరకు నెల్లూరు జిల్లాలోని నారాయణ ఆస్పత్రిలో విజయవంతంగా అవయవదానం ఆపరేషన్ చేశారు. దినేష్ రెడ్డి కిడ్నీని నెల్లూరులోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి.. మరొక కిడ్నీని నారాయణ ఆస్పత్రిలో ఉంచారు. గుండె, కాలేయాన్ని గ్రీన్ ఛానెల్ ద్వారా హైదరాబాద్‌కు అధికారులు తరలించినట్టు సమాచారం. -
ఒక నిర్ణయం ఆరుగురికి పునరుజ్జీవం
♦ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడు ♦ ఆయన అవయవదానానికి ఒప్పుకున్న భార్య, కుటుంబ సభ్యులు ♦ గుండె గుంటూరుకు, ఊపిరితిత్తులు చెన్నైకు తరలింపు తాను మరణిస్తూ మరో ఆరుగురి జీవితాల్లో వెలుగును ప్రసాదించాడు పెల్లేటి సుబ్బారెడ్డి. తన అవయవ దానంతో ధన్యుడయ్యాడు. ఆయన అవయవాల దానానికి ఒప్పుకున్న భార్య, కుటుంబ సభ్యులు పలువురికి ఆదర్శంగా నిలిచారు. నెల్లూరురూరల్ : ప్రకాశం జిల్లా, ఉలవపాడు మండలం కర్రేడు గ్రామానికి చెందిన పెల్లేటి సుబ్బారెడ్డి రైతు కుటుంబంలో జన్మించారు. కరువు పరిస్థితుల్లో పంటలు సక్రమంగా పండకపోవడంతో బతుకు దెరువుకోసం కూలీగా మారాడు. భార్య శివకుమారి, పిల్లలను ఇంటి వద్దే వదిలిపెట్టి జిల్లాలోని ఇందుకూరుపేటకు వలస వచ్చాడు. మద్యం దుకాణంలో రోజువారీ కూలీగా చేరాడు. రెండు వారాలకోసారి ఇంటికెళ్లి భార్య పిల్లలను చూసి వచ్చే వాడు. సుబ్బారెడ్డి కుమార్తె సమీరారెడ్డి మూడో తరగతి, కొడుకు జశ్వంత్‌రెడ్డి రెండోతరగతి చదువుతున్నారు. ఆదివారం గాంధీజయంతి కావడంతో మద్యం దుకాణానికి సెలవు ఇవ్వడంతో సుబ్బారెడ్డి స్నేహితులతో కలిసి సరదాగా గడిపాడు. ఇందుకూరుపేట మండలం మొత్తల గ్రామం వద్ద ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్తున్న సుబ్బారెడ్డి జారీ కింద పడ్డాడు. స్థానికులు సుబ్బారెడ్డిని నారాయణ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంతో షంగా సాగుతున్న వారి జీవితంలో రోడ్డు ప్రమాదంలో భర్త తీవ్రంగా గాయపడ్డాడనే పిడుగులాంటి వార్త విని కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. బ్రెయిన్ డెడ్ అని చెప్పిన డాక్టర్లు సుబ్బారెడ్డిని పరీక్షించిన డాక్టర్లు మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయిందని, బ్రెయిన్ డెడ్ అయిందని సుబ్బారెడ్డి కోలుకునే అవకాశం లేదని తేల్చి చెప్పారు. పుట్టెడు దుఖ:ంలో ఉన్న భార్య, కుటుంబ సభ్యులు సుబ్బారెడ్డి ఎలా బతకడని, కనీసం అవయవదానం చేస్తే ఇతరుల జీవితాల్లో బతికే ఉంటాడని ఆలోచన చేశారు. ఆయన అవయవదానానికి అంగీకరించారు. దీంతో నారాయణ ఆస్పత్రివారు విజయవాడలోని జీవన్ దాస్ ట్రస్టును సంప్రదించి అవయవదానానికి ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆపరేషన్ చేసి సుబ్బారెడ్డి అవయవాలను వేరు చేశారు. గుంటూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు గుండెను ప్రత్యేక హెలికాప్టర్లో తరలించారు. లివర్‌ను విజయవాడ మణిపాల్ ఆస్పత్రికి, ఒక కిడ్నీని తిరుపతి రుయా హాస్పిటల్‌కు, ఊపిరితిత్తులను చెన్నై పోతీస్ ఆస్పత్రికి ప్రత్యేక అంబులెన్స్ లో తరలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసి జిల్లా సరిహద్దుల వరకు ఆటంకాలు లేకుండా చూశారు. రెండో కిడ్నీని నారాయణ హాస్పిటల్‌కు, నేత్రా లను నెల్లూరులోని మోడరన్ ఐ ఆసుపత్రికి దానం చేశారు. ఇలా సుబ్బారెడ్డి మరణించి మరో ఆరుగురికి జీవితాన్నిచ్చాడు. అవయవాలను తరలించేటప్పుడు భార్య, బంధుమిత్రులు, సోదరుల ఆర్త నాదాలు మిన్నంటాయి. సుబ్బారెడ్డా... నీవు లేకుండా మేమెలా బతకాలంటూ పెద్ద ఎత్తున వెక్కి, వెక్కి ఏడ్చారు. వీరు రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెను కదిలించాయి. అభినందనీయం నారాయణ ఆస్పత్రి సీఈవో డాక్టర్ విజయమోహన్ రెడ్డి మాట్లాడుతూ సుబ్బారెడ్డి బ్రెయిన్ డెడ్ అయినట్టు తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు అవవయదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సుబ్బారెడ్డి అవయదానంతో ఆరుగురి జీవితాల్లో వెలుగులు రానున్నాయని తెలిపారు. కుటుంబ సభ్యులకు ఆస్పత్రి పరంగా తాము అండ గా ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ శ్రీరాంసతీష్, సురేష్, వరప్రసాద్ పాల్గొన్నారు. హెలికాప్టర్ సమకూర్చిన కృష్ణపట్నం పోర్టు నెల్లూరు రూరల్ : అవయవదానంలో గుండెను తరలించేందుకు కృష్ణపట్నం పోర్టు ప్రత్యేక హెలికాప్టర్‌ను సమకూర్చింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన సుబ్బారెడ్డి అవయవదానం ఆపరేషన్ నారాయణ హాస్పిటల్లో మంగళవారం నిర్వహించారు. గుండెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌ను ఏర్పాటు చేశారు. అవయవదానానికి తమ వంతు సాయంగా కృష్ణపట్నం పోర్టు సొంత హెలికాప్టర్‌ను పంపించినట్లు పోర్టు పీఆర్ హెడ్ వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ విజయకుమార్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మీడియా మేనేజర్ శీనయ్య పాల్గొన్నారు. ఆశయం బతికి ఉండాలనే .. అవయవ దాత భార్య శివకుమారి మాట్లాడుతూ తన భర్త సుబ్బారెడ్డి కావలిలో డిగ్రీ చదివేటప్పుడే అవయవదానం చేసేందుకు అంగీకరించినట్లు డైరీలో రాసుకున్నాడన్నారు. అవయవదానం వల్ల మరి కొంతమంది ప్రాణాలను కాపాడవచ్చని బతికి ఉన్నప్పుడే చర్చించేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయం బతికి ఉండాలనే సంకల్పంతో అవయవదానం చేసినట్లు పేర్కొన్నారు. తమది పేద కుటుంబం అని, కుటుంబ పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. -
ఒక కిడ్నీ నెల్లూరుకు, మరో కిడ్నీ చెన్నైకి
-
బ్రెయిన్‌డెడ్ కావడంతో అవయవదానం
తిరుపతి మెడికల్ : అనారోగ్యంతో బాధపడుతూ బ్రెయిన్ డెడ్‌కు గురైన ఓ వ్యక్తి శరీరంలోని అవయవాలను అతని కుటుంబ సభ్యులు ఆదివారం దానం చేశారు. తిరుపతి గాంధీపురంలో నివాసం ఉండే పెద్దపాపమ్మకు కుమారుడు బి.చిరంజీవి రెడ్డి(45) ఉన్నాడు. అవివాహితుడైన చిరంజీవి తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తీవ్రమైన జ్వరంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న చిరంజీవిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఈనెల 27న స్విమ్స్‌లో చేర్చారు. అత్యవసర విభాగం నుంచి ఆర్‌ఐసియు విభాగంలో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్న చిరంజీవికి శనివారం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో చిరంజీవి బ్రెయిన్ డెడ్‌కు గురైనట్టు స్విమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా అవయవదానానికి ముందుకు వచ్చారు. స్విమ్స్ అధికారులు, జీవన్‌దాన్ ట్రస్ట్ నిర్వాహకులు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దశల వారీగా శస్త్ర చికిత్సలు చేసి నాలుగు అవయవాలను తీసుకున్నారు. అందులో గుండెను హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌కు విమానం ద్వారా తీసుకెళ్లారు. లివర్‌ను విశాఖపట్నంలోని అపోలో హాస్పిటల్‌కు విమానం ద్వారా తరలించారు. రెండు కిడ్నీల్లో ఒకటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని నారాయణ హాస్పిటల్‌కు, మరొకటి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని ఓ రోగికి అమర్చారు. మరణించినా తన అవయవాలను మరో నలుగురికి దానం చేసిన చిరంజీవి మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, దాత కుటుంబ సభ్యులకు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్, డిప్యూటీ డెరైక్టర్లు ఆదిక్రిష్ణ, డాక్టర్ వెంకటరామరెడ్డి,అవయవ దాన కోఆర్డినేటర్ ప్రసాద్ రెడ్డి, జయశ్రీ,సుదర్శన్, ప్రకాష్‌లు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
తాను లేకున్నా.. ఐదుగురికి ప్రాణం పోసింది
బెంగళూరు: ఇంజనీర్ కావాలని కలలు కంది. కల సాకారం కాకుండానే చిన్న వయసులోనే కనుమూసింది. ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. తాను ఈ లోకంలో లేకున్నా అవయవదానం చేయడం ద్వారా మరో ఐదుగురికి పునర్జన్మ ఇచ్చి సజీవంగా బతుకుతోంది కర్ణాటకకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని సంజన (18). బ్రెయిన్ డెడ్ అయిన సంజన అవయవాలను తల్లిదండ్రుల అనుమతితో దానం చేశారు. సంజన గుండెను కోయంబత్తూరుకు చెందిన శివన్ (30) అనే వ్యక్తికి అమర్చారు. సంజన గుండెను బెంగళూరు నగరంలో కెంగేరి బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి నుంచి బొమ్మసంద్ర నారాయణ హెల్త్ సిటీకి తీసుకెళ్లడానికి పోలీసు అధికారులు సహకరించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దీంతో కేవలం 28 నిమిషాల్లో 37 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుండెను సురక్షితంగా చేర్చారు. శివన్ కు గుండెను దానం చేయకుంటే మరో పది రోజులు మాత్రమే బతికేవాడని వైద్యులు తెలిపారు. సంజన కళ్లు, కాలేయం, కిడ్నీలను మరో నలుగురు రోగులకు దానం చేశారు. బెంగళూరుకు చెందిన 44 ఏళ్ల మహిళకు కాలేయం, కిడ్నీ దానం చేశారు. మరో పేషెంట్‌కు ఇంకో కిడ్నీ, మరో ఇద్దరికి కళ్లను దానం చేశారు. హసన్‌కు చెందిన సంజన ఈ నెల 21న మైసూర్ కేఆర్ఎస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం హాసన్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వైద్యులు శ్రమించినా ఫలితం లేకపోయింది. సంజన బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. సంజన అవయవాలను దానం చేయాలని వైద్యులు ఆమె తల్లిదండ్రులను ఒప్పించారు. వైద్యుల సలహా మేరకు ఆమెను బెంగళూరులోని కెంగేరి బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. సంజన మరణించినా ఆమె అవయవాలను దానం చేయడంతో మరో ఐదుగురి రూపంలో బతికే ఉంటుందని బీజీఎస్ గ్లోబల్ ఆస్పత్రి వైస్ చైర్మన్, చీఫ్ న్యూరో సర్జన్ డాక్టర్ ఎన్ కే వెంకటరమణ అన్నారు. అవయవ దానం చేసేందుకు అంగీకరించిన సంజన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన హసన్ డాక్టర్లకు, బెంగళూరు పోలీసులకు అభినందనలు తెలిపారు.