
గుంటూరు మెడికల్ : ప్రత్యర్థుల చేతిలో గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన తన కుమారుడి అవయవాలను దానం చేసేందుకు నిశ్చయించుకుని ఆ తల్లి పలువురికి మార్గదర్శకంగా నిలిచింది. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా జంగమహేశ్వరపురానికి చెందిన పుల్లారెడ్డి (30)కి సోదరుడు పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి (43)తోపాటు సోదరి సరోజిని ఉన్నారు. తండ్రి పెద్దవీరారెడ్డి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి కాశమ్మ పెద్ద కుమారుడు పోలిరెడ్డి, కుమార్తె సరోజినిలకు పెళ్లిచేసి ఇద్దరు కుమారులతో కలిసి ఉంటోంది.
పుల్లారెడ్డి సోదరి సరోజిని, బావ చెన్నారెడ్డిలకు వారి ఇంటికి ఎదురుగా ఉంటున్న గొంగటి నాగిరెడ్డి, ఆయన భార్య పద్మ, కుమారులు శ్రీనివాసరెడ్డి, వీరారెడ్డిలతో కొద్దిరోజులుగా వివాదం నడుస్తూ ఉంది. సరోజిని తన సోదరులు పుల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డికి ఈ నెల 4న విషయం తెలియజేసింది. సోదరులు ఇద్దరూ సరోజిని ఇంటికి వెళ్లి ఆరా తీస్తున్న సమయంలో నాగిరెడ్డి కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేశారు. పుల్లారెడ్డి బ్రెయిన్‌డెడ్ అయినట్లు మంగళవారం జీజీహెచ్ వైద్యులు నిర్ధారించారు. పెద్ద కుమారుడు చనిపోయి, చిన్న కుమారుడు బ్రెయిడ్‌డెడ్ అవడంతో తల్లి కాశమ్మ పెద్ద మనసుతో తన కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చింది. రెండు కిడ్నీలు, రెండు కళ్లు, లివర్ సేకరించి జీవన్‌దాన్ ట్రస్ట్ కోఆర్డినేటర్ ద్వారా ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్న ఐదుగురికి అవయవాలను అమర్చనున్నట్టు వైద్యులు తెలిపారు.