ఆ బాలిక వల్ల ఏడుగురికి కొత్త జీవితం
పంజగుట్ట (హైదరాబాద్): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన 14 ఏళ్ల బాలిక అవయవాలతో మరో ఏడుగురికి కొత్త జీవితం. దీనికి సంబంధించి నిమ్స్ జీవన్‌దాన్ ప్రతినిధి అనురాధ తెలిపిన వివరాల ప్రకారం... బీదర్‌కు చెందిన ఐనాపూర్ మహేష్ తన భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె శివాని(14)తో కలిసి తిరుపతికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా గత నెల 30న బీదర్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహేష్ కుటుంబ సభ్యులందరికీ గాయాలు కాగా, వారిని అపోలో ఆస్పత్రికి తరలించారు.
మహేష్ కుమార్తె శివాని (14) తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహేష్ తన కుమార్తె అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావడంతో శివానికి శస్త్రచికిత్స నిర్వహించి రెండు కిడ్నీలు, లివర్, రెండు హార్ట్ వాల్వులు, రెండు కండ్లు తొలగించి వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అవసరమైన వారికి అమర్చారు.