గుండెను మార్చి.. పునర్జన్మను ప్రసాదించి..
47 ఏళ్ల బ్రెయిన్‌డెడ్ వ్యక్తి నుంచి గుండె సేకరణ
24 ఏళ్ల మాతృమూర్తికి విజయవంతంగా మార్పిడి
కాకినాడకు చెందిన మహిళకు ‘యశోద’లో చికిత్స
హైదరాబాద్: తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ మహిళకు యశోద ఆస్పత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. 47 ఏళ్ల బ్రెయిన్‌డెడ్ వ్యక్తి నుంచి సేకరించిన గుండెను ఆమెకు విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. బుధవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ జీఎస్‌రావు, గుండె మార్పిడి నిపుణులు డాక్టర్ నరేశ్ కుమార్, డాక్టర్ ఆర్ముగమ్, జీవన్‌దాన్ ఇన్‌చార్జి డాక్టర్ స్వర్ణలతలు శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన అరుణ (24)తన భర్త గోపాలకృష్ణ, కుమారుడు కార్తిక్‌తో కలసి పుణేలో స్థిరపడింది. ఏడాది క్రితం కుటుంబంతో కలిసి పుట్టింటికి వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురైంది. స్థానిక వైద్యులకు చూపించగా బ్రెయిన్‌లో క్లాట్ అయింది. మందులు వాడితే తగ్గిపోతుందన్నారు.
‘కార్డియోమయోపతి’గా గుర్తింపు
తొమ్మిది నెలల తర్వాత అరుణ మార్చి 20న మళ్లీ అనారోగ్యానికి గురైంది. పుణేలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా పది రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. పలు పరీక్షలు చేసి ‘డలేటెట్ కార్డియోమయోపతి’అనే సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వీలైన ంత త్వరలో గుండె మార్పిడి చేయించుకోవాలన్నారు. ఏప్రిల్ 20న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి చెందిన సీనియర్ కార్డి యో థొరాసిక్ సర్జన్ డాక్టర్ నరే శ్ కుమార్, డాక్టర్ ఆర్ముగమ్‌లను సంప్రదించగా.. గుండె దానం కోసం జీవ న్‌దాన్‌లో ఆమె పేరు నమోదు చేయించారు.
47 ఏళ్ల వ్యక్తి నుంచి గుండెను సేకరించి..
ఇదే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలాజీ (47) బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకున్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఆ మేరకు జీవన్‌దాన్‌కు సమాచారం ఇచ్చారు. న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథ్ విజ్ఞప్తి మేరకు ఆయన అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. అప్పటికే ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న అరుణకు గుండె మార్పిడి చికిత్స చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు జూన్ 15న డాక్టర్ నరేశ్ కుమార్, డాక్టర్ ఆర్ముగమ్, డాక్టర్ రాజశేఖర్‌ల నేతృత్వంలోని వైద్య బృందం దాత నుంచి గుండెను సేకరించారు. సోమాజిగూడ నుంచి సికింద్రాబాద్‌కు తరలించారు. సుమారు 20 మందితో కూడిన వైద్య బృందం తొమ్మిది గంటల పాటు శ్రమించి విజయవంతంగా గుండెను అమర్చారు. అనంతరం ఆమె కోలుకోవడంతో జూన్ 29న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు డాక్టర్ నరేశ్ కుమార్, డాక్టర్ ఆర్ముగమ్‌లు స్పష్టం చేశారు. ప్రతి వెయ్యి మంది మహిళలల్లో ఎవరో ఒకరికి ప్రసవానికి ముందు కానీ, తర్వాత కానీ ఇలాంటి సమస్యలు వెలుగు చూస్తుంటాయని, అయితే కొంతమందిలో దానంతట అదే నయమవుతుందన్నారు.
ఇతర ఆస్పత్రులతో ఎంవోయూ
రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు యశోద ఆస్పత్రి వైద్యులు బెంగళూరు, మధ్యప్రదేశ్, కోల్‌కతా, ఏపీలోని పలు ఆస్పత్రులతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్టర్ జీఎస్‌రావు చెప్పారు. తద్వారా ఇతర రాష్ట్రాల్లో కూడా అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చేయవచ్చన్నారు. జీవన్‌దాన్ ఇన్‌చార్జి డాక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ ఇప్పటి వరకు 233 కాలేయ, 400కి పైగా మూత్రపిండాలు, 26 గుండె, 5 ఊపిరితిత్తులు, ఐదు పాంక్రియాస్‌లను సేకరించి ఆయా జబ్బులతో బాధపడుతున్న వారికి పునర్జన్మను ప్రసాదించినట్లు తెలిపారు.