అందరూ ఉండి అనాథగా..! | Man Deceased in Ukraine due to brain dead | Sakshi
Sakshi News home page

అందరూ ఉండి అనాథగా..!

Published Tue, May 12 2020 5:05 AM | Last Updated on Tue, May 12 2020 5:05 AM

Man Deceased in Ukraine due to brain dead - Sakshi

ఉక్రెయిన్‌లోని ఆస్పత్రిలో సతీష్‌రెడ్డి చికిత్స పొందుతున్నప్పటి దృశ్యం. (పక్కన ఫైల్‌ ఫొటో)

సాక్షి, కడప/ పెనగలూరు: ఉక్రెయిన్‌ దేశంలో యువకుడి మృతదేహం.. కువైట్‌ దేశంలో అతడి తల్లిదండ్రులు.. వైఎస్సార్‌ జిల్లా బెస్తపల్లెలో చెల్లెలు, ఇతర బంధువులు.. కుమారుడిని కడసారి చూసుకోవడానికి ఉక్రెయిన్‌ వెళ్లడానికి తల్లిదండ్రులకు అవకాశం లేదు.. ఉక్రెయిన్‌ నుంచి కువైట్‌కు మృతదేహం తీసుకువెళ్లడానికి అసలు వీలు కాదు.. ఏపీకి తేవాలంటే ఉక్రెయిన్‌ నుంచి యువకుడి మృతదేహాన్ని, కువైట్‌ నుంచి తల్లిదండ్రులను తీసుకురావడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కష్టం.. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువుల వేదన వర్ణణాతీతం.. కరోనా వైరస్‌ ప్రజలకు ఎలాంటి కష్టాలు కల్పించిందనేదానికి ఈ సంఘటన ఒక నిదర్శనం.

వివరాల్లోకెళ్తే.. వైఎస్సార్‌ జిల్లా పెనగలూరు మండలం బెస్తపల్లెకు చెందిన పి.సుబ్బారెడ్డి, భారతి దంపతులకు సతీష్‌రెడ్డి, గ్రీష్మ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటర్మీడియెట్‌ నెల్లూరులో చదివిన సతీష్‌ రెడ్డిని డాక్టర్‌గా చూడాలనే ఉద్దేశంతో 2018లో వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌కు పంపారు. ఇందుకోసం సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేశారు. కుమారుడిని బాగా చదివించడానికి సుబ్బారెడ్డి దంపతులు కువైట్‌కు వెళ్లారు. అక్కడ సుబ్బారెడ్డి ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తుండగా, ఆయన భార్య భారతి ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌లోని ప్రతిష్టాత్మక కార్కీవ్‌ నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌/ఎండీ ఫిజీషియన్‌ కోర్సులో సీటు సాధించిన సతీష్‌ రెడ్డి ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నాడు. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉంటున్న అతడు ఏప్రిల్‌ 25న తన గదిలోని మంచంపై నుంచి కిందపడడంతో తలకు దెబ్బ తగిలి బ్రెయిన్‌ డెడ్‌కు గురైనట్లు కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించింది. సతీష్‌ను స్నేహితులతోపాటు కళాశాల యాజమాన్యం ఆస్పత్రిలో చేర్చగా వైద్యులు ఆపరేషన్‌ చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో మే 10న మృతిచెందాడు. 

కరోనా సమయంలో కష్టం
బాగా చదువుకుని డాక్టర్‌గా తిరిగొస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా విగత జీవిగా తిరిగొస్తాడని అనుకోలేదని సతీష్‌రెడ్డి తల్లిదండ్రులు, బంధువులు విలపిస్తున్నారు. కరోనా నేపథ్యంలో చివరి చూపైనా దక్కుతుందో, లేదోనని వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సతీష్‌ రెడ్డి మృతదేహం ఉక్రెయిన్‌లో ఉండగా, అతడి తల్లిదండ్రులు కువైట్‌లో ఉండటమే ఇందుకు కారణం. మృతుడి చెల్లెలు గ్రీష్మ, ఇతర బంధువులు బెస్తపల్లెలో ఉన్నారు. అన్నతో పది రోజుల కిందటే మాట్లాడానని ఇంతలోనే ఇలా అవుతుందని అనుకోలేదని మృతుడి సోదరి గ్రీష్మ విలపించింది. తన తమ్ముడు డాక్టర్‌గా తిరిగొస్తాడని అనుకుంటే ఇలా విగత జీవిగా మారతాడని ఊహించలేదని మృతుడి చిన్నాన్న కుమారుడు ఓబుల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు చివరి చూపైనా చూసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సతీష్‌రెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement