
మరణంలోనూ అపర్ణ కీర్తి
బీటెక్ విద్యార్థిని శరీరదానం
వెంకోజీపాలెం: ఒక ఏడాది గడిస్తే ఆమెకు మంచి ఉద్యోగం లభిస్తుంది. తల్లిదండ్రుల ఆశ యం నెరవేరుతుంది. కూతురి భవిష్యత్‌పై రోజూ ఎన్నో ఊహలు.. అందమైన కలలు..! కానీ దేవుడు మరోలా తలచాడు. వారి కలలను కల్లలు చేశాడు. రోడ్డు ప్రమాద రూపంలో కన్నబిడ్డను శాశ్వతంగా దూరం చేశాడు. గుండెలను పిండేసే ఈ విషాదంలోనూ ఆమె అమ్మానాన్నలు తమ కంటిపాప కోర్కెను నెరవేర్చారు. తన చావును ముందే ఊహించినట్టు మూడు నెలల క్రితం కుమార్తె సమ్మతించిన మేరకు ఆమె అవయవాన్ని దానం చేశారు.
వివరాల్లోకి వెళితే.. స్టీల్‌ప్లాంట్ అసిస్టెంట్ మేనేజర్ దేవినేని ప్రసాద్ కుమార్తె అపర్ణకీర్తి దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఈనెల 3న ఆమె రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. తలకు తీవ్రగాయం కావడంతో ఆమెను హుటాహుటిన నగరంలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ అపర్ణకీర్తి కోమాలోకి వెళ్లిపోయింది. 5న వైద్యులు ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. చివరకు తల్లిదండ్రులను పుట్టెడు దుఃఖంలో ముంచేస్తూ మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు కన్ను మూసింది. కూతురు ఆశయా న్ని గౌరవిస్తూ అమ్మానాన్నలు ఆమె పార్థివ దేహాన్ని శరీరదాన ఫౌండేషన్‌కు అప్పగించారు. దీంతో అపర్ణకీర్తి తన శరీర దానంతో మరికొందరి జీవితాలకు దారి చూపించింది. ఆదర్శంగా నిలిచింది.