తొలుత బ్రెయిన్ డెడ్.. తరువాత మృతి శోకసముద్రంలో
వెంకటరెడ్డి కుటుంబసభ్యులు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అయోధ్యరామిరెడ్డి
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, జేసీఎస్ కన్వినర్ మేకా వెంకటరెడ్డి కన్నుమూశారు. తొలుత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బ్రెయిన్ డెడ్ అయిందని మణిపాల్ వైద్యులు శుక్రవారం తెలిపారు. ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్నారు. వెంకటరెడ్డి కన్నుమూసినట్లు శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ప్రకటించారు.
ఈ వార్త తెలియడంతో వెంకటరెడ్డి భార్య సునీత, కుమార్తె, కుమారుడు, కుటుంబసభ్యులు ఆస్పత్రి వద్దే కుప్పకూలారు. తమకు దిక్కెవరంటూ సునీత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లిలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ వర్గీయులను టీడీపీకి చెందినవారు దుర్భాషలాడటమేగాక ద్విచక్ర వాహనాలతో ఢీకొట్టిన విషయం తెలిసిందే. కిందపడిపోయి తలకు తీవ్రగాయమైన మేకా వెంకటరెడ్డి తొలుత బ్రెయిన్ డెడ్ అయ్యారు. చికిత్స చేసినా ఫలితం లేకపోయింది.
పార్టీ అండగా ఉంటుందన్న ఎంపీ ఆళ్ల
అంతకుముందు చికిత్స పొందుతున్న మేకా వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి శుక్రవారం మణిపాల్ ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వెంకటరెడ్డికి బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు తెలపడంతో ఎంత ఖర్చయినా ఆయనకు వైద్యం చేయాలని ఎంపీ సూచించారు.
వెంకటరెడ్డి భార్య సునీత, కుమారుడు హేమంత్, కుమార్తెలను పరామర్శించారు. ఆ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా జేసీఎస్ కో–ఆర్డినేటర్ ఈదులమూడి డేవిడ్‌రాజు, పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి, జేసీఎస్ నియోజకవర్గ కనీ్వనర్ మున్నంగి వివేకానందరెడ్డి, పార్టీ నాయకులు రాజారెడ్డి, భూపతి కిషోర్‌నాయుడు తదితరులు ఆస్పత్రికి వెళ్లారు.
పోలీసుల అదుపులో నిందితులు
కుంచనపల్లిలో గురువారం రాత్రి ఈ దాడులకు తెగబడిన నిందితులు టీడీపీ తాడేపల్లి పట్టణ కార్యాలయంలో తలదాచుకున్నట్లు తెలిసింది. వెంకటరెడ్డి చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్ద పరిస్థితిని గమనించేందుకు శుక్రవారం తెల్లవారుజామున మహానాడుకు చెందిన ఓ మాజీ రౌడీషీటర్ తన కొడుకైన రౌడీషీటర్‌ను, కొందరు యువకులను తీసుకుని వచ్చారు. ఇదే క్రమంలో వెంకటరెడ్డిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చారు. ఆ వాహనంపైన వెనుక కూర్చున్న ప్రకాశం జిల్లా పొదిలి మండలం బచ్చలకుర్రపాడుకు చెందిన యువకుడు, ప్రస్తుతం మహానాడులో నివాసముంటున్న మాదల గురువర్ధన్‌ను వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు గుర్తుపట్టారు.
ఆ వాహనాన్ని, గురువర్ధన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. గురువర్ధన్‌ను, ద్విచక్ర వాహనాన్ని పట్టుకున్నారని తెలియడంతో దాడిలో పాల్గొన్న యువకుల తల్లిదండ్రులతో టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయంలో మంతనాలు జరిపారు. పోలీసుల నుంచి ఒత్తిడి రావడంతో వెంకటరెడ్డిని ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన బొమ్మలబోయిన ఈశ్వర్‌ను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
తరువాత తమ అనుకూల మీడియాలో వైఎస్సార్‌సీపీకి, వెంకటరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. వారు తమ కార్యకర్తలే కాదంటూనే.. ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతున్న వారిని వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకున్నారని, బైక్ బ్రేక్ ఫెయిలవడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రచారం చేయసాగారు. వెంకటరెడ్డిని వెనుక నుంచి బైక్‌తో ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment