ఆదర్శమూర్తి ఈ అమ్మ..! | nirmala samant prabhavalkar donate her daughter's kidney,Liver | Sakshi
Sakshi News home page

ఆదర్శమూర్తి ఈ అమ్మ..!

Published Fri, Jun 20 2014 10:14 PM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

ఆదర్శమూర్తి ఈ అమ్మ..!

ఆదర్శమూర్తి ఈ అమ్మ..!

సాక్షి ముంబై: అమ్మ.. ఈ రెండక్షరాలను ఈ సృష్టిలో దేనితో పోల్చినా తక్కువే అవుతుంది. ప్రాణం పోయడంలో అమ్మ తర్వాతే ఎవరైనా. అది తన బిడ్డకైనా, ఇతరులకైనా ప్రాణం పోసేందుకు అమ్మ ఎప్పుడూ ముందే ఉంటుంది. అందుకే అమ్మను అమ్మతో మాత్రమే పోల్చగలమంటారు కవులు. అలాంటి అమ్మ మనసు ఎంత గొప్పదో చాటిచెప్పే ఓ ఘటన నగరంలో చోటుచేసుకుంది. తన బిడ్డ బతకదని తెలిసి, కనీసం ఆమె అవయవాలను ఇతరులకు దానం చేస్తేనైనా తన బిడ్డ ఉనికి మరికొన్ని కాలాలు ఈ భూమిపై ఉంటుందని భావించింది.
 
గుండె నిబ్బరం చేసుకొని బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉన్న తన బిడ్డ కాలేయాన్ని, మూత్రపిండాలను దానం చేసి ఇద్దరికి ప్రాణం పోసింది. వివరాల్లోకెళ్తే... ముంబై మాజీ మేయర్ నిర్మలా సావంత్ ప్రభావల్కర్ తన 18 ఏళ్ల కూతురు నీలిమకు తలనొప్పి రావడంతో బాంద్రాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. జూన్ 6న ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. తలనొప్పి తీవ్రం కావడంతోపాటు విరేచనాలు కూడా అవుతుండడంతో పరీక్షలు చేసిన వైద్యులు ఆమె మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయిందని గుర్తించారు. చూస్తుండగానే ఆమె పరిస్థితి మరింత విషమించింది.
 
మెదడు పనిచేయకపోవడంతో శరీరంలోని ఒక్కో అవయం పట్టును కోల్పోతూ నిర్జీవంగా మారడం మొదలైంది. దీంతో బ్రెయిన్ డెడ్‌గా వైద్యలు ధ్రువీకరించుకొని విషయాన్ని తల్లికి చెప్పారు. ఆమె శరీరం వైద్యానికి ఏమాత్రం సహకరించడంలేదని చెప్పిన వైద్యులు ‘క్లినికల్లీ డెడ్’గా ప్రకటించారు. 18 సంవత్సరాలు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అలా నిర్జీవంగా పడి ఉండడాన్ని చూడలేకపోయిన ఆ కన్నతల్లి గుండలవిసేలా విలపించింది. అంతలోనే తేరుకొని ఎలాగైనా తన కూతురు అస్థిత్వాన్ని కాపాడుకోవాలనుకుంది. అందుకు మార్గం    ఆమె అవయవాలను దానం చేయడమేనని నిర్ణయించుకొని విషయాన్ని వైద్యులకు చెప్పింది.
 
 దీంతో కాలేయం, మూత్రపిండాలు అవసరమున్న బాధితులను గుర్తించిన వైద్యులు వెంటనే నీలిమ అవయవాలను వారికి అమర్చే ఏర్పాట్లు చేశారు. అనుకున్నట్లుగానే అమర్చి ఇద్దరి ప్రాణాలు కాపాడారు. లీలావతి ఆసుపత్రిలో 38 ఏళ్ల వ్యక్తికి కిడ్నీలను, ఠాణేలోని జుపిటర్ ఆసుపత్రిలోని ఓ వృద్ధుడికి కాలేయాన్ని అమర్చడం ద్వారా వారి ప్రాణాలను కాపాడారు. తన బిడ్డ మరణిస్తూ కూడా ఇద్దరికి ప్రాణాలను కాపాడిందని ఆ తల్లి పలువురితో గర్వంగా చెప్పుకోవడం పలువురిని కదిలించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement