(విజయనగరం నుంచి గౌరీకుమార్, సూరిబాబు)
బొకారో ఎక్స్ ప్రెస్ నుంచి దూకి, రాయగఢ ప్యాసింజర్ ఢీకొన్న ప్రమాదంతో ఓ కుటుంబం మొత్తం చెల్లాచెదురైపోయింది. శనివారం సాయంత్రం 6.38 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది మరణించినట్లు కలెక్టర్, ఇతర అధికార వర్గాలు తెలిపాయి. మృతులంతా ఎస్-2 బోగీలో ప్రయాణిస్తున్నవారేనని తెలిసింది. ఎస్-2 బోగీలోని 16వ నెంబరు సీటులో ప్రయాణిస్తున్న మనోజ్ కుమార్ సింగ్ కుటుంబంలోని దాదాపు సభ్యులంతా మరణించారు. ఆయనొక్కరే ప్రాణాలు దక్కించుకున్నారు. ఆయన భార్య శ్వేతా సింగ్ (33) ఆ బోగీలోని 5వ నెంబరు సీట్లో ప్రయాణించారు. ఆమెతో పాటు కుమార్తె సంహితకుమారి (10), బాబు శౌర్య (2) కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఇంకా ఇదే ప్రమాదంలో ఎస్ 2 బోగీలోని 9వ నెంబరు సీట్లో ప్రయాణించిన కార్తీక్ సాహు (70), అదే బోగీలోని తారాదేవి (34) కూడా మరణించారు. వీరంతా ప్రమాదం జరిగిన సంఘటనలోనే మరణించారు. అలెక్స్ తోప్నో (26) విజయనగరం కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. మరో ఇద్దరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బీహార్ రాష్ట్రంలోని నవాబ్ జిల్లాకు చెందిన కార్పస్ అనే వ్యక్తికి కాలు ఫ్రాక్చర్ కావడంతో అతడిని విశాఖపట్నం తరలించారు. గాయపడిన వారిని గొట్లాం, విజయనగరం ఆస్పత్రులకు తరలించారు. విశాఖ రైల్వే స్టేషన్ లో అత్యవసర కేంద్రం ఏర్పాటు చేశారు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ లోని హెల్ప్ లైన్ సెంటర్ల ఫోన్ నెంబర్లు: 0891 2843003, 004, 005, 006