Bokaro express
-
బొకారో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల మధ్య వివాదం
యలమంచిలి(అనకాపల్లి జిల్లా): అధిక రద్దీ కారణంగా ప్రయాణికుల మధ్య ఏర్పడిన వివాదంతో బొకారో ఎక్స్‌ప్రెస్ రైలు రెండు గంటల సేపు నిలిచిపోయింది. రిజర్వేషన్ బోగీల్లో అన్రిజర్వ్డ్ టికెట్లతో ప్రయాణికులు అధిక సంఖ్యలో ఎక్కడంతో ఇరువర్గాల మధ్య గొడవ ఏర్పడింది. ఇది కాస్త పెద్దదికావడంతో శనివారం యలమంచిలి మండలం రేగుపాలెం రైల్వేస్టేషన్ వద్ద దన్బాద్–అలెప్పి (13351) బొకారో ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఈ రైలును యలమంచిలి దాటిన తర్వాత వెనుక వస్తున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు (12889) కోసం రేగుపాలెం రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై నిలిపివేశారు. ఇదే సమయంలో రిజర్వుడు టికెట్లున్న ప్రయాణికులు, అన్‌రిజర్వుడు టికెట్లున్న ప్రయాణికుల మధ్య కొనసాగుతున్న వివాదం మరింత పెద్దదైంది. దీంతో వందల సంఖ్యలో ప్రయాణికులు రైల్వే ట్రాక్‌పైకి వచ్చిరైలు ఇంజిన్‌కి ఎదురుగా ఆందోళనకు దిగారు. రైలు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా దాదాపు 500 మంది ప్రయాణికులు ట్రాక్‌పై ఇంజిన్‌కు ఎదురుగా ఉండిపోవడంతో దాదాపు రెండు గంటల సేపు అక్కడే నిలిచిపోయింది. సమాచారం అందుకొన్న తుని రైల్వే ఎస్ఐ షేక్ అబ్దుల్ మారూఫ్ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న ప్రయాణికులకు నచ్చజెప్పారు. రైల్వే ట్రాక్ నుంచి వారిని పక్కకు తొలగించారు. అనంతరం 12.05 నిమిషాల సమయంలో రేగుపాలెం స్టేషన్ నుంచి రైలును ముందుకు పంపించారు. అన్నవరం రైల్వే స్టేషన్ వరకూ ఎస్కార్ట్‌గా వెళ్లారు. -
బొకారో ఎక్స్‌ప్రెస్‌లో దారుణం..!
సాక్షి, తూర్పుగోదావరి : బొకారో ఎక్స్‌ప్రెస్‌లో దారుణం చోటుచేసుకుంది. రైలులోని ఓ బోగిలో ప్యాసింజర్లపై ఉన్మాది వీరంగం సృష్టించాడు. అతడిని అడ్డుకుని సముదాయించిన హోమ్ గార్డుపై దాడి చేసి రైల్లోంచి తోసేశాడు. తుని రూరల్ వద్ద హోంగార్డు రైలు నుంచి కిందపడి దుర్మరణం చెందాడు. తుని రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే ఉన్మాదిని పట్టుకుని ప్రయాణికులు పోలీసులకు అప్పగించారు. మృతుడు కోటనందూరు హోంగార్డు రెడ్డి వెంకటశివగా పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ నయీం ఆస్మీ మృతదేహాన్ని పరిశీలించారు. -
రైల్వే ప్రయాణికుడి వీరంగం
బొబ్బిలి: విశాఖ నుంచి బొబ్బిలి వైపు వస్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్ బోగీ మీదకి మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఎక్కి కలకలం సృష్టించాడు. శనివారం సాయంత్రం బొకారో ట్రైన్‌ను విజయనగరంలో రన్నింగ్‌లో ఎక్కిన ఒడిశా వాసి పైన ఉండే విద్యుత్ తీగలను అం దుకోబోతుండటాన్ని గొట్లాం స్టేషన్ వద్ద గమనించిన లైన్‌మన్, టోకెన్ పోర్టర్లు స్టేషన్‌కు సమాచారమందించారు. వెంటనే స్టేషన్ సిబ్బం ది ∙బొకారో ట్రైన్ డ్రైవర్లక సమాచారమందించారు. దీంతో డ్రైవర్లు గరుగుబిల్లి వద్ద ట్రైన్‌ను నిలిపివేసి కిందికి దిగమని కేకలు వేశారు. అయినా మత్తు వీడని ప్రయాణికుడు చేతులు మీదికెత్తుతూ కాసేపు హల్చల్ చేశాడు. చివరకు కొందరు మీదికి ఎక్కి మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడ్ని కిందికి నెట్టేశారు. వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని బొబిŠబ్లి స్టేషన్‌కు తరలించారు. మద్యం మత్తులో ఉండడం వల్ల వివరాలు చెప్పలేకపోతున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. -
సూట్‌కేసుల్లోని 70 తులాలా బంగారం మాయం..!
సాక్షి, విజయనగరం : బొకారో రైలులో భారీ దొంగతనం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా చెల్లూరుకి చెందిన రైల్వే కాంట్రాక్టర్ సత్యనారాయణ ఒడిషాలోని ఆర్తబిరాలో ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వెళ్లొస్తుంగా ఈ ఘటన చోటుచేసుకుంది. 77 తులాల బంగారం గల తన రెండు సూట్ కేసులు మాయమయ్యాయని బాధితుడు తెలిపాడు. తిట్లఘర్ - రాయగడ మధ్యలో దొంగతనం జరిగినట్టు వెల్లడించాడు. సూట్‌కేసుల్లో సుమారు 77 తులాల బంగారం ఉందని సత్యనారాయణ తెలిపారు. బాధితుడు తొలుత పార్వతీపురం రైల్వేస్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. భారీ దోపిడీ నేపథ్యంలో విజయనగరంలో ఫిర్యాదు చేయాలని రైల్వే అధికారులు సూచించారు. -
బోగీలు లేకుండా వెళ్లిన రైలు ఇంజిన్
బాడంగి: బోగీలు లేకుండానే ఎక్స్ ప్రెస్ ప్రయాణించించడం స్థానికులలో ఆసక్తిని పెంచగా, రైళ్లోని ప్రయాణికులను మాత్రం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా బాడంగి మండలం దొంకినవలస వద్ద చోటుచేసుకుంది. బోగీలను విడిచి ధన్‌బాద్ - అల్లెప్పఝా బొకారో ఎక్స్ ప్రెస్ ఇంజిన్ రెండు కిలోమీటర్ల దూరం ముందుకు వెళ్లిపోయింది. బోగీలతో లింక్ తెగిపోవడంతో రైలు ఇంజిన్ మాత్రమే వెళ్లిపోయిందని రైల్వే అధికారులు తెలిపారు. ఇంజిన్ మాత్రమే వెళ్లడంతో దాదాపు గంటన్నర పాటు బోగీలు అక్కడే నిలిచిపోయాయి. ఆ సమయంలో మరో రైలు రాకపోవడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పిందని వివరించారు. -
బొకారో ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
తాడేపల్లిగూడెం: కేరళ నుంచి బొకారో వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌లో గురువారం మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైలు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి రైల్వేస్టేషన్లో ఆగి ఉన్న సమయంలో ఎస్8 భోగిలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే పోర్టర్లు ట్రైన్ ను నిలిపివేసి మరమ్మత్తులు నిర్వహించారు. బ్రేక్‌లు పట్టేయడంతో పొగలు అలుముకున్నాయని గుర్తించి వాటిని సరిచేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
సాంకేతిక లోపంతో నిలిచిపోయిన బొకారో ఎక్స్‌ప్రెస్
ప్రకాశం: జిల్లాలోని ఉలవపాడు మండలం చాగొల్లు వద్ద బోకారో ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ఉదయం నిలిచిపోయింది. సాంకేతిక లోపం కారణంగానే రైలును నిలిపివేసినట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
ఆ పెట్టెలే ప్రాణాలు తీశాయా!
సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా గొట్లాం రైలు దుర్ఘటనలో మృతిచెందినవారి ప్రాణాలెలా పోయాయి? రైల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నవారు ఆపనిచేసినా ఎందుకు బతకలేకపోయారు? దూకే సమయంలో రైల్లో ఏం జరిగింది? ఎడమవైపు తలుపు నుంచి దూకితే ప్రాణాలు దక్కేవా? వంటి ఎన్నో జవాబు దొరకని సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రత్యక్షసాక్షులు, నిపుణులతో మాట్లాడాక ఎస్-1 బోగీలో తలుపులకు అడ్డంగా పెట్టిన పెట్టెలే ఎనిమిది మంది మృత్యువాత పడడానికి కారణంగా కనిపిస్తోంది. అలెప్పి-ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్‌లో నిత్యం వందలాది మంది సైనిక సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీసులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో తమ వెంట తెచ్చుకునే వస్తువులు, బ్యాగులు, బట్టలు, ఆయుధ సామగ్రితో కూడిన బాక్సులను సైనిక సిబ్బంది ఎక్కడపడితే అక్కడ ఉంచుతారు. ప్రమాదం జరిగిన రోజున ఎస్-1 బోగీలో తలుపులకు ఆనుకుని ఈ పెట్టెలు భారీగా పేర్చేశారు. రైల్వే, ఆర్పీఎఫ్ సిబ్బంది సైతం వీరిని ఏం అనలేక మౌనంగా ఉండిపోయారు. మంటలు చెలరేగినట్లు వచ్చిన వదంతులకు భయపడి కొందరు ప్రయాణికులు చైన్ లాగడంతో పలువురు బయటకు దూకేందుకు ప్రయత్నించారు. అయితే ఎడమవైపు తలుపులకు అడ్డంగా పెట్టెలు ఉండడంతో చేసేదిలేక కుడివైపు తలుపులు తీసి బయటకు దూకేశారు. దీంతో పక్కనుంచి వెళ్తున్న మరో రైలు వీరిని ఢీకొట్టింది. ఆ పెట్టెలే గనుక అడ్డంగా లేనిపక్షంలో రైల్వే ట్రాక్లేని ఎడమవైపు నుంచి దూకాలనుకునే వారు ప్రాణాలతో బయటపడి ఉండేవారని ప్రమాద ఘటను ప్రత్యక్షంగా చూసిన కొందరు ప్రయాణికులు వివరించారు. ప్రాణాలు తీస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం: రైల్వేశాఖ నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాలకు భద్రతలేకుండా చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. రైల్వే సిబ్బంది భద్రతకు సంబంధించిన నిబంధనలను సరిగా పాటించకపోవడం ప్రమాదాలకు కారణమవుతోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా లాంగ్విజిల్స్ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ప్రమాదాలకు దారితీస్తోంది. విజయనగరం జిల్లా గొట్లాం రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వేలో నిబంధనల ఉల్లంఘన మరోసారి చర్చనీయాంశమైంది. కాగా గొట్లాం దుర్ఘటన నేపథ్యంలో తూర్పుకోస్తా రైల్వే అప్రమత్తమైంది. రాత్రి వేళల్లో కచ్చితంగా అమలుచేయాల్సిన లాంగ్ విజిల్, ఇతర సంకేతాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సిబ్బందిని హెచ్చరించింది. విచారణ జరపాలి: మంత్రి శత్రుచర్ల సాక్షి, హైదరాబాద్: విజయనగరం జిల్లా గొట్లాం వద్ద రైలు ఢీకొని ఎనిమిది మంది మృతిచెందిన ఘటనపై విచారణ జరిపించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు రైల్వే శాఖను డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ఒక ప్రకటనలో సంతాపం తెలియజేశారు. ప్రమాదం దురదృష్టకరం: బొత్స ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ), న్యూస్‌లైన్: విజయనగరం సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం దురదృష్టకరమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రమాదంపై కేంద్రానికి నివేదిక పంపుతామన్నారు. ప్రమాదంపై వైఎస్సార్ సీపీ ఆవేదన సాక్షి, హైదరాబాద్: విజయనగరం సమీపంలో రైలు ఢీకొని 8 మంది మృతి చెందడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధమైన విషాదం మరువకముందే రైలు ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. -
గొట్లం రైలు ప్రమాద ఘటనలో ఏడు మృతదేహలు గుర్తింపు
విజయనగరం జిల్లాలోని గొట్లంలో నిన్న రాత్రి సంభవించిన రైలు ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఏడు మృతదేహలను గుర్తించినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. మృతదేహలను విశాఖపట్నంలోని రైల్వే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే మరో మృతదేహన్ని గుర్తించవలసి ఉందన్నారు. మృతుల వివరాలు ఆదివారం విజయనగరంలో పోలీసులు విడుదల చేశారు. అలెక్స్ (27), శ్వేతా సింగ్ (33), సంహిత (10), శౌర్య (2), తారా దేవి (34), కార్తీక్ సాహు (70), లోకేంద్ర కుమార్ (28)లుగా మృతి దేహలను గుర్తించినట్లు చెప్పారు. లోకేంద్ర కుమార్ ఆర్మీలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడని తెలిపారు. అలాగే మనోజ్ కుమార్ తన భార్య శ్వేతా సింగ్‌తోపాటు ఇద్దరు చిన్నారులు సంహిత, శౌర్యలను కోల్పయింది. మనోజ్ కుటుంబం బెంగళూరు నుంచి బీహార్‌లోని ఔరంగాబాద్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు వివరించారు. అయితే రైలు ప్రమాద ఘటన పట్ల కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖార్గే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ సంఘటనపై ఇప్పటికే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఆల్లెప్పి నుంచి దన్బాద్ వెళ్లున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగిలో శనివారం సాయంత్రం ఆకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు రైలు చైన్ లాగారు. అనంతరం రైలు దిగి పట్టాలు దాటేందుకు రైల్వే ట్రాక్‌పైకి పరుగులు తీశారు. అదే సమయంలో పార్వతీపురం నుంచి విజయవాడ వస్తున్న రాయగఢ్ ప్యాసింజర్ రైలు పట్టాలు దాటుతున్న ప్రయాణికులపై నుంచి దూసుకుపోయింది. దాంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి విశాఖపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
రైలు కిందపడి 8 మంది ప్రయాణికుల దుర్మరణం
-
రైలు ప్రమాదానికి మలుపే కారణం
విజయనగరం జిల్లా గొట్లం వద్ద నిన్న సాయంత్రం చోటు చేసుకున్న రైలు ప్రమాదానికి సమీపంలోని ప్రమాదకరమైన మలుపే కారణమని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇరువైపులా దట్టంగా చెట్లు వ్యాపించి ఉన్నాయి. అలాగే అత్యంత ప్రమాదకరమైన మలుపు ఎదురుగా ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆ మలుపు కారణంగా ఎదురుగా వస్తున్న ఎటువంటి వాహనాన్ని ప్రయాణికులు గుర్తించలేరని తెలిపారు. ప్రమాదకరమైన మలుపుపై రైల్వే శాఖ అధికారులతో చర్చిస్తానని విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ వెల్లడించారు. ఆ మలుపు వద్ద భద్రత సిబ్బందిని ఏర్పటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరతామన్నారు. ప్రమాద వార్త విన్న వెంటనే ఆమె హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బొకారో ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగిలో శనివారం సాయంత్రం ఆకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు రైలు చైన్ లాగారు. పక్కనున్న రైల్వే ట్రాక్‌పైకి పరుగులు తీశారు. అదే సమయంలో పార్వతీపురం నుంచి విజయవాడ వస్తున్న రాయగఢ్ ప్యాసింజర్ రైలు పట్టాలు దాటుతున్న ప్రయాణికులపై నుంచి దూసుకుపోయింది. దాంతో ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి విశాఖపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
విజయనగరం రైలు ప్రమాదంతో కుటుంబం చెల్లాచెదురు
-
రైలు ప్రమాదంతో కుటుంబం చెల్లాచెదురు
(విజయనగరం నుంచి గౌరీకుమార్, సూరిబాబు) బొకారో ఎక్స్ ప్రెస్ నుంచి దూకి, రాయగఢ ప్యాసింజర్ ఢీకొన్న ప్రమాదంతో ఓ కుటుంబం మొత్తం చెల్లాచెదురైపోయింది. శనివారం సాయంత్రం 6.38 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం ఎనిమిది మంది మరణించినట్లు కలెక్టర్, ఇతర అధికార వర్గాలు తెలిపాయి. మృతులంతా ఎస్-2 బోగీలో ప్రయాణిస్తున్నవారేనని తెలిసింది. ఎస్-2 బోగీలోని 16వ నెంబరు సీటులో ప్రయాణిస్తున్న మనోజ్ కుమార్ సింగ్ కుటుంబంలోని దాదాపు సభ్యులంతా మరణించారు. ఆయనొక్కరే ప్రాణాలు దక్కించుకున్నారు. ఆయన భార్య శ్వేతా సింగ్ (33) ఆ బోగీలోని 5వ నెంబరు సీట్లో ప్రయాణించారు. ఆమెతో పాటు కుమార్తె సంహితకుమారి (10), బాబు శౌర్య (2) కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఇదే ప్రమాదంలో ఎస్ 2 బోగీలోని 9వ నెంబరు సీట్లో ప్రయాణించిన కార్తీక్ సాహు (70), అదే బోగీలోని తారాదేవి (34) కూడా మరణించారు. వీరంతా ప్రమాదం జరిగిన సంఘటనలోనే మరణించారు. అలెక్స్ తోప్నో (26) విజయనగరం కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. మరో ఇద్దరి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బీహార్ రాష్ట్రంలోని నవాబ్ జిల్లాకు చెందిన కార్పస్ అనే వ్యక్తికి కాలు ఫ్రాక్చర్ కావడంతో అతడిని విశాఖపట్నం తరలించారు. గాయపడిన వారిని గొట్లాం, విజయనగరం ఆస్పత్రులకు తరలించారు. విశాఖ రైల్వే స్టేషన్ లో అత్యవసర కేంద్రం ఏర్పాటు చేశారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లోని హెల్ప్ లైన్ సెంటర్ల ఫోన్ నెంబర్లు: 0891 2843003, 004, 005, 006 -
రైలు కిందపడి 8 మంది ప్రయాణికుల దుర్మరణం
విజయనగరం: గత రెండు రోజుల క్రితం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు దుర్ఘటన మరవకముందే మరో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలోని గొట్లాం సమీపంలో శనివారం దీపావళి పండుగపూట పెనువిషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో రైలు కిందపడి 8 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. సిగ్నల్ లేకపోవడంతో బొకారో రైలు అక్కడే ఆగిపోయింది. అప్పుడే బొకారొ ఎక్స్ ప్రెస్ -1, ఎస్-2 బోగీల్లో పొగలు, మంటలు చెలరేగాయంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు భయపడి రైలులో నుంచి ఒక్కసారిగా పక్క ట్రాకుపై దూకారు. ప్రయణికులంతా చైన్‌లాగి హడావుడిగా దూకడంతో, అదే సమయంలో పక్క ట్రాక్ పైకి దూసుకొచ్చిన విజయవాడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 8 మంది మృతిచెందినట్టు సమాచారం. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన రాత్రి 7.15 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. రైలు ఒక్కసారిగా ఢీకొట్టడంతో ట్రాక్‌పై మృతదేహాలన్ని చిధ్రమయ్యాయి. తెగిపడిన అవయవాలతో ట్రాక్ భయంకరంగా కనిపిస్తోంది. ఈ ఘోరప్రమాదంలో ఎంతమంది మృతిచెందారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో బెంగాల్ వాసులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.