సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా గొట్లాం రైలు దుర్ఘటనలో మృతిచెందినవారి ప్రాణాలెలా పోయాయి? రైల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నవారు ఆపనిచేసినా ఎందుకు బతకలేకపోయారు? దూకే సమయంలో రైల్లో ఏం జరిగింది? ఎడమవైపు తలుపు నుంచి దూకితే ప్రాణాలు దక్కేవా? వంటి ఎన్నో జవాబు దొరకని సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రత్యక్షసాక్షులు, నిపుణులతో మాట్లాడాక ఎస్-1 బోగీలో తలుపులకు అడ్డంగా పెట్టిన పెట్టెలే ఎనిమిది మంది మృత్యువాత పడడానికి కారణంగా కనిపిస్తోంది. అలెప్పి-ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్‌లో నిత్యం వందలాది మంది సైనిక సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీసులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో తమ వెంట తెచ్చుకునే వస్తువులు, బ్యాగులు, బట్టలు, ఆయుధ సామగ్రితో కూడిన బాక్సులను సైనిక సిబ్బంది ఎక్కడపడితే అక్కడ ఉంచుతారు.
ప్రమాదం జరిగిన రోజున ఎస్-1 బోగీలో తలుపులకు ఆనుకుని ఈ పెట్టెలు భారీగా పేర్చేశారు. రైల్వే, ఆర్పీఎఫ్ సిబ్బంది సైతం వీరిని ఏం అనలేక మౌనంగా ఉండిపోయారు. మంటలు చెలరేగినట్లు వచ్చిన వదంతులకు భయపడి కొందరు ప్రయాణికులు చైన్ లాగడంతో పలువురు బయటకు దూకేందుకు ప్రయత్నించారు. అయితే ఎడమవైపు తలుపులకు అడ్డంగా పెట్టెలు ఉండడంతో చేసేదిలేక కుడివైపు తలుపులు తీసి బయటకు దూకేశారు. దీంతో పక్కనుంచి వెళ్తున్న మరో రైలు వీరిని ఢీకొట్టింది. ఆ పెట్టెలే గనుక అడ్డంగా లేనిపక్షంలో రైల్వే ట్రాక్‌లేని ఎడమవైపు నుంచి దూకాలనుకునే వారు ప్రాణాలతో బయటపడి ఉండేవారని ప్రమాద ఘటను ప్రత్యక్షంగా చూసిన కొందరు ప్రయాణికులు వివరించారు.
ప్రాణాలు తీస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం: రైల్వేశాఖ నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాలకు భద్రతలేకుండా చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. రైల్వే సిబ్బంది భద్రతకు సంబంధించిన నిబంధనలను సరిగా పాటించకపోవడం ప్రమాదాలకు కారణమవుతోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా లాంగ్‌విజిల్స్ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ప్రమాదాలకు దారితీస్తోంది. విజయనగరం జిల్లా గొట్లాం రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వేలో నిబంధనల ఉల్లంఘన మరోసారి చర్చనీయాంశమైంది. కాగా గొట్లాం దుర్ఘటన నేపథ్యంలో తూర్పుకోస్తా రైల్వే అప్రమత్తమైంది. రాత్రి వేళల్లో కచ్చితంగా అమలుచేయాల్సిన లాంగ్ విజిల్, ఇతర సంకేతాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సిబ్బందిని హెచ్చరించింది.
విచారణ జరపాలి: మంత్రి శత్రుచర్ల
సాక్షి, హైదరాబాద్: విజయనగరం జిల్లా గొట్లాం వద్ద రైలు ఢీకొని ఎనిమిది మంది మృతిచెందిన ఘటనపై విచారణ జరిపించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు రైల్వే శాఖను డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ఒక ప్రకటనలో సంతాపం తెలియజేశారు.
ప్రమాదం దురదృష్టకరం: బొత్స
ఎన్‌ఏడీ జంక్షన్ (విశాఖ), న్యూస్‌లైన్: విజయనగరం సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం దురదృష్టకరమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రమాదంపై కేంద్రానికి నివేదిక పంపుతామన్నారు.
ప్రమాదంపై వైఎస్సార్ సీపీ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: విజయనగరం సమీపంలో రైలు ఢీకొని 8 మంది మృతి చెందడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధమైన విషాదం మరువకముందే రైలు ప్రమాదం జరగడం బాధాకరమన్నారు.
ఆ పెట్టెలే ప్రాణాలు తీశాయా!
Published Mon, Nov 4 2013 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM
Advertisement
Advertisement