Gotlam train accident
-
రైలు దుర్ఘటనపై పూర్తిస్థాయి విచారణ
ఈస్ట్రన్ రైల్వే సేఫ్టీ ఆఫీసర్ నాయక్ వెల్లడి విజయనగరం, న్యూస్‌లైన్: విజయనగరం జిల్లా గొట్లాం సమీపంలో జరిగిన రైలు దుర్ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఈస్ట్రన్ రైల్వే సేఫ్టీ ఆఫీసర్ (ఢిల్లీ) సుదర్శన్ నాయక్ తెలిపారు. సోమవారం ఆయన ఘటనా స్థలాన్ని సందర్శించారు. బొకారొ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వస్తున్నాయన్న వదంతులతో చైన్ లాగి కిందకి దిగిన కొందరు ప్రయాణికులను విజయవాడ-రాయగడ పాసింజర్ ఢీ కొనడంతో 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై విచారణ నిమిత్తం విజయనగరం వచ్చిన సుదర్శన్ నాయక్ స్థానిక రైల్వే విశ్రాంతి భవనంలో విలేకరులతో మాట్లాడారు. ప్రమాదంపై విచారణ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటైందని, ఈ ఘటనకు సంబంధించిన కారణాలతో పాటు, ప్రత్యక్ష సాక్షుల కథనాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కొంత సమాచారం సేకరించామని, వీడియో ఫుటేజీలు, ఫొటోల ఆధారంగా పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. క్షతగాత్రులను, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డివిజనల్ రైల్వే మేనేజర్ అనిల్‌కుమార్, సీనియర్ డీసీఎం యల్వేందర్ యాదవ్ పాల్గొన్నారు. -
ఆ పెట్టెలే ప్రాణాలు తీశాయా!
సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా గొట్లాం రైలు దుర్ఘటనలో మృతిచెందినవారి ప్రాణాలెలా పోయాయి? రైల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకోవాలనుకున్నవారు ఆపనిచేసినా ఎందుకు బతకలేకపోయారు? దూకే సమయంలో రైల్లో ఏం జరిగింది? ఎడమవైపు తలుపు నుంచి దూకితే ప్రాణాలు దక్కేవా? వంటి ఎన్నో జవాబు దొరకని సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రత్యక్షసాక్షులు, నిపుణులతో మాట్లాడాక ఎస్-1 బోగీలో తలుపులకు అడ్డంగా పెట్టిన పెట్టెలే ఎనిమిది మంది మృత్యువాత పడడానికి కారణంగా కనిపిస్తోంది. అలెప్పి-ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్‌లో నిత్యం వందలాది మంది సైనిక సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీసులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో తమ వెంట తెచ్చుకునే వస్తువులు, బ్యాగులు, బట్టలు, ఆయుధ సామగ్రితో కూడిన బాక్సులను సైనిక సిబ్బంది ఎక్కడపడితే అక్కడ ఉంచుతారు. ప్రమాదం జరిగిన రోజున ఎస్-1 బోగీలో తలుపులకు ఆనుకుని ఈ పెట్టెలు భారీగా పేర్చేశారు. రైల్వే, ఆర్పీఎఫ్ సిబ్బంది సైతం వీరిని ఏం అనలేక మౌనంగా ఉండిపోయారు. మంటలు చెలరేగినట్లు వచ్చిన వదంతులకు భయపడి కొందరు ప్రయాణికులు చైన్ లాగడంతో పలువురు బయటకు దూకేందుకు ప్రయత్నించారు. అయితే ఎడమవైపు తలుపులకు అడ్డంగా పెట్టెలు ఉండడంతో చేసేదిలేక కుడివైపు తలుపులు తీసి బయటకు దూకేశారు. దీంతో పక్కనుంచి వెళ్తున్న మరో రైలు వీరిని ఢీకొట్టింది. ఆ పెట్టెలే గనుక అడ్డంగా లేనిపక్షంలో రైల్వే ట్రాక్లేని ఎడమవైపు నుంచి దూకాలనుకునే వారు ప్రాణాలతో బయటపడి ఉండేవారని ప్రమాద ఘటను ప్రత్యక్షంగా చూసిన కొందరు ప్రయాణికులు వివరించారు. ప్రాణాలు తీస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం: రైల్వేశాఖ నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాలకు భద్రతలేకుండా చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. రైల్వే సిబ్బంది భద్రతకు సంబంధించిన నిబంధనలను సరిగా పాటించకపోవడం ప్రమాదాలకు కారణమవుతోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా లాంగ్విజిల్స్ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ప్రమాదాలకు దారితీస్తోంది. విజయనగరం జిల్లా గొట్లాం రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వేలో నిబంధనల ఉల్లంఘన మరోసారి చర్చనీయాంశమైంది. కాగా గొట్లాం దుర్ఘటన నేపథ్యంలో తూర్పుకోస్తా రైల్వే అప్రమత్తమైంది. రాత్రి వేళల్లో కచ్చితంగా అమలుచేయాల్సిన లాంగ్ విజిల్, ఇతర సంకేతాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సిబ్బందిని హెచ్చరించింది. విచారణ జరపాలి: మంత్రి శత్రుచర్ల సాక్షి, హైదరాబాద్: విజయనగరం జిల్లా గొట్లాం వద్ద రైలు ఢీకొని ఎనిమిది మంది మృతిచెందిన ఘటనపై విచారణ జరిపించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు రైల్వే శాఖను డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ఒక ప్రకటనలో సంతాపం తెలియజేశారు. ప్రమాదం దురదృష్టకరం: బొత్స ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ), న్యూస్‌లైన్: విజయనగరం సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం దురదృష్టకరమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రమాదంపై కేంద్రానికి నివేదిక పంపుతామన్నారు. ప్రమాదంపై వైఎస్సార్ సీపీ ఆవేదన సాక్షి, హైదరాబాద్: విజయనగరం సమీపంలో రైలు ఢీకొని 8 మంది మృతి చెందడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మైసూరారెడ్డి, కొణతాల రామకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో బస్సు దగ్ధమైన విషాదం మరువకముందే రైలు ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. -
రైల్వే దుర్ఘటన.. వదంతులు ప్రాణాలు తీశాయి!
* రైలు దూసుకుపోయి 8 మంది దుర్మరణం * విజయనగరం జిల్లా గొట్లాం రైల్వేస్టేషన్ వద్ద దుర్ఘటన * రైల్లో మంటలు వస్తున్నాయని వదంతులు... * భయంతో పట్టాలపైకి దూకిన ‘బొకారో’ ప్రయాణికులు * వారిపైనుంచి దూసుకెళ్లిన మరో రైలు సాక్షి ప్రతినిధి, విజయనగరం/విశాఖపట్నం: విజయనగరం సమీపంలోని గొట్లాం రైల్వే స్టేషన్ వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా దీపావళి జరుపుకోవాలని ఆశించిన వారి జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. క్షణాల్లోనే అంతా మాంసం ముద్దలుగా మారి తుప్పల్లోకి ఎగిరిపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. అలెప్పీ-ధన్‌బాద్ బొకారో ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో గొట్లాం స్టేషన్ సమీపంలోకి చేరుకుంది. ఇంతలో ఎవరో ఏసీ బోగీల్లో నుంచి మంటలు వ్యాపిస్తున్నాయంటూ కేకలేశారు. దీంతో దానికి పక్కనే ఉన్న ఎస్-1 బోగీలో కలకలం రేగగా కొందరు ప్రయాణికులు ఆందోళనతో చైన్ లాగి రైలును ఆపేశారు. ప్రాణభయంతో అందులోని ప్రయాణికులు కిందకి దూకేసి పక్క ట్రాక్ మీద నిలబడ్డారు. అయితే వారు దూకేసిన ప్రాంతం మలుపు తిరిగి ఉండడం, చీకట్లు అలుముకోవడంతో ఎట్నుంచి ఏం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాము నిలబడిన పట్టాల మీదుగా రాయగఢ-విజయవాడ ప్యాసింజర్ రైలు వస్తున్న విషయాన్ని వీరు గుర్తించలేదు. దాంతో ఘోరం జరిగిపోయింది. ఆ ప్యాసింజర్ దూసుకురావడంతో పట్టాలపై ఉన్న ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతదేహాలు బోగీల కిందనే ఉండిపోవడంతో చాలా సేపటి వరకు అసలేం జరిగిందో, ఎందరు మరణించారో తెలియని పరిస్థితి నెలకొంది. విజయనగరం నుంచి పోలీసులు, రైల్వే అధికారులు వచ్చి రైలును ముందుకుపోనిచ్చి మాంస ఖండాలను సేకరించారు. వీటిని అదే ప్యాసింజర్‌లో విశాఖ తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని విజయనగరం జిల్లాకేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. కళ్లముందే భార్యాబిడ్డలు మృతి.. బీహార్ రాష్ర్టంలోని ఔరంగాబాద్‌కు చెందిన మనోజ్‌కుమార్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య శ్వేతా సింగ్(34), కుమార్తె శౌర్య(10), కుమారుడు నందిత్(2)తో కలిసి దీపావళి పండగ కోసం స్వస్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో భార్య, ఇద్దరు పిల్లలు తన కళ్ల ముందే ముక్కలవడం చూసి మనోజ్ రోదన మిన్నంటింది. అలాగే జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అయోధ్యా మెహతా తన భార్య తారా దేవి(43)తో ప్రయాణిస్తున్నారు. తారాదేవి ఈ ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయారు. ముక్కలైన ఆమె శరీరాన్ని చూసి అయోధ్యా మెహతా గుండెలవిసేలా రోదించారు. వీరితోపాటు ఒడిశాకు చెందిన కార్తీక్ సాహు(70), బీహార్‌కు చెందిన అలెక్స్ టెప్నో(27), హైదరాబాద్‌కు చెందిన లోకేంద్ర కుమార్(28), విజయనగరం జిల్లా సీతానగరం మండలానికి చెందిన ఆదిరాజు(60) ఈ దుర్ఘటనలో మరణించారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్‌లు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎంపీ ఝాన్సీ వచ్చి రైల్వే మంత్రి ఖర్గేతో మాట్లాడి పరిస్థితిని వివరించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు తదితరులు వచ్చి బాధితులను ఓదార్చారు. ఇదిలా ఉండగా విశాఖలో ఆరు మృతదేహాలకు ఆదివారం శవపరీక్షలు నిర్వహించి వారి బంధువులకు అప్పగించారు. మరో రెండు మృతదేహాలను ఆంధ్రామెడికల్ కళాశాల మార్చురీలో ఉంచారు. ఆలస్యమే ఆయువు తీసిందా?: బొకారో ఎక్స్‌ప్రెస్ రెండుగంటలు ఆలస్యంగా రావడం వల్ల ఎనిమిది నిండు ప్రాణాలు గాల్లోకలిసి పోయాయి. అలెప్పీ-ధన్‌బాద్ బొకారో ఎక్స్‌ప్రెస్ శనివారం సాయంత్రం 4.42గంటలకు విజయనగరం రైల్వే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉండగా 6.23 గంటలకు వచ్చింది. విజయనగరం నుంచి 6.28కి బయలుదేరగా పది నిముషాల వ్యవధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ రెండు గంటలు ఆలస్యంగా రాకపోయి ఉంటే ఇంతమంది ప్రాణా లు పోయి ఉండేవి కావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రైలు ప్రమాదానికి మలుపే కారణం
విజయనగరం జిల్లా గొట్లం వద్ద నిన్న సాయంత్రం చోటు చేసుకున్న రైలు ప్రమాదానికి సమీపంలోని ప్రమాదకరమైన మలుపే కారణమని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇరువైపులా దట్టంగా చెట్లు వ్యాపించి ఉన్నాయి. అలాగే అత్యంత ప్రమాదకరమైన మలుపు ఎదురుగా ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆ మలుపు కారణంగా ఎదురుగా వస్తున్న ఎటువంటి వాహనాన్ని ప్రయాణికులు గుర్తించలేరని తెలిపారు. ప్రమాదకరమైన మలుపుపై రైల్వే శాఖ అధికారులతో చర్చిస్తానని విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ వెల్లడించారు. ఆ మలుపు వద్ద భద్రత సిబ్బందిని ఏర్పటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరతామన్నారు. ప్రమాద వార్త విన్న వెంటనే ఆమె హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బొకారో ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగిలో శనివారం సాయంత్రం ఆకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు రైలు చైన్ లాగారు. పక్కనున్న రైల్వే ట్రాక్‌పైకి పరుగులు తీశారు. అదే సమయంలో పార్వతీపురం నుంచి విజయవాడ వస్తున్న రాయగఢ్ ప్యాసింజర్ రైలు పట్టాలు దాటుతున్న ప్రయాణికులపై నుంచి దూసుకుపోయింది. దాంతో ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి విశాఖపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.