విజయనగరం జిల్లా గొట్లం వద్ద నిన్న సాయంత్రం చోటు చేసుకున్న రైలు ప్రమాదానికి సమీపంలోని ప్రమాదకరమైన మలుపే కారణమని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇరువైపులా దట్టంగా చెట్లు వ్యాపించి ఉన్నాయి. అలాగే అత్యంత ప్రమాదకరమైన మలుపు ఎదురుగా ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఆ మలుపు కారణంగా ఎదురుగా వస్తున్న ఎటువంటి వాహనాన్ని ప్రయాణికులు గుర్తించలేరని తెలిపారు. ప్రమాదకరమైన మలుపుపై రైల్వే శాఖ అధికారులతో చర్చిస్తానని విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ వెల్లడించారు. ఆ మలుపు వద్ద భద్రత సిబ్బందిని ఏర్పటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరతామన్నారు. ప్రమాద వార్త విన్న వెంటనే ఆమె హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.
బొకారో ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగిలో శనివారం సాయంత్రం ఆకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు రైలు చైన్ లాగారు. పక్కనున్న రైల్వే ట్రాక్‌పైకి పరుగులు తీశారు. అదే సమయంలో పార్వతీపురం నుంచి విజయవాడ వస్తున్న రాయగఢ్ ప్యాసింజర్ రైలు పట్టాలు దాటుతున్న ప్రయాణికులపై నుంచి దూసుకుపోయింది. దాంతో ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి విశాఖపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.