గొట్లం రైలు ప్రమాద ఘటనలో ఏడు మృతదేహలు గుర్తింపు
విజయనగరం జిల్లాలోని గొట్లంలో నిన్న రాత్రి సంభవించిన రైలు ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఏడు మృతదేహలను గుర్తించినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. మృతదేహలను విశాఖపట్నంలోని రైల్వే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే మరో మృతదేహన్ని గుర్తించవలసి ఉందన్నారు.
మృతుల వివరాలు ఆదివారం విజయనగరంలో పోలీసులు విడుదల చేశారు. అలెక్స్ (27), శ్వేతా సింగ్ (33), సంహిత (10), శౌర్య (2), తారా దేవి (34), కార్తీక్ సాహు (70), లోకేంద్ర కుమార్ (28)లుగా మృతి దేహలను గుర్తించినట్లు చెప్పారు. లోకేంద్ర కుమార్ ఆర్మీలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడని తెలిపారు.
అలాగే మనోజ్ కుమార్ తన భార్య శ్వేతా సింగ్‌తోపాటు ఇద్దరు చిన్నారులు సంహిత, శౌర్యలను కోల్పయింది. మనోజ్ కుటుంబం బెంగళూరు నుంచి బీహార్‌లోని ఔరంగాబాద్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు వివరించారు. అయితే రైలు ప్రమాద ఘటన పట్ల కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖార్గే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ సంఘటనపై ఇప్పటికే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
ఆల్లెప్పి నుంచి దన్బాద్ వెళ్లున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగిలో శనివారం సాయంత్రం ఆకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు రైలు చైన్ లాగారు. అనంతరం రైలు దిగి పట్టాలు దాటేందుకు రైల్వే ట్రాక్‌పైకి పరుగులు తీశారు.
అదే సమయంలో పార్వతీపురం నుంచి విజయవాడ వస్తున్న రాయగఢ్ ప్యాసింజర్ రైలు పట్టాలు దాటుతున్న ప్రయాణికులపై నుంచి దూసుకుపోయింది. దాంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి విశాఖపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.