Gotlam
-
లారీ, బైక్ ఢీ: ఇద్దరు మృతి
విజయనగరం : విజయనగరం జిల్లా బొందపల్లె మండలం గొట్లాం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్‌పై ఇద్దరు విజయనగరం వైపు వెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న తేజ, శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. -
రైలు ప్రమాదానికి మలుపే కారణం
విజయనగరం జిల్లా గొట్లం వద్ద నిన్న సాయంత్రం చోటు చేసుకున్న రైలు ప్రమాదానికి సమీపంలోని ప్రమాదకరమైన మలుపే కారణమని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఇరువైపులా దట్టంగా చెట్లు వ్యాపించి ఉన్నాయి. అలాగే అత్యంత ప్రమాదకరమైన మలుపు ఎదురుగా ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆ మలుపు కారణంగా ఎదురుగా వస్తున్న ఎటువంటి వాహనాన్ని ప్రయాణికులు గుర్తించలేరని తెలిపారు. ప్రమాదకరమైన మలుపుపై రైల్వే శాఖ అధికారులతో చర్చిస్తానని విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ వెల్లడించారు. ఆ మలుపు వద్ద భద్రత సిబ్బందిని ఏర్పటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరతామన్నారు. ప్రమాద వార్త విన్న వెంటనే ఆమె హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బొకారో ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగిలో శనివారం సాయంత్రం ఆకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. దాంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు రైలు చైన్ లాగారు. పక్కనున్న రైల్వే ట్రాక్‌పైకి పరుగులు తీశారు. అదే సమయంలో పార్వతీపురం నుంచి విజయవాడ వస్తున్న రాయగఢ్ ప్యాసింజర్ రైలు పట్టాలు దాటుతున్న ప్రయాణికులపై నుంచి దూసుకుపోయింది. దాంతో ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి విశాఖపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
విశాఖ రైల్వేస్టేషన్‌లోని హెల్ప్‌లైన్ సెంటర్ల ఫోన్ నంబర్లు
విశాఖపట్నం: విజయనగరం సమీపంలోని గొట్లాం వద్ద రైలు ప్రమాద వివరాలు తెలిపేందుకు విశాఖ రైల్వేస్టేషన్లో ఎమర్జెన్సీ కౌంటర్ ఏర్పాటు చేశారు. అయిదు హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. హెల్ప్ లైన్ సెంటర్ల ఫోన్ నంబర్లు: 0891 2843003, 004, 005, 006 ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయింది, ఎంతమంది గాయపడింది ఇంకా స్సష్టంగా తెలియలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశం చిమ్మచీకటిగా ఉన్నందున సహాయక చర్యలు చేపట్టడం కూడా కష్టంగా ఉంది. రైల్వే అధికారులు చనిపోయినవారి వివరాలను సేకరిస్తున్నారు. -
సహాయక చర్యలు చేపట్టాలని జగన్ పిలుపు
హైదరాబాద్: విజయనగరం జిల్లా గొట్లాంలో జరిగిన రైలు ప్రమాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన జరిగిన ప్రదేశంలో సహాయక చర్యలు చేపట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో ఎక్కువ మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ఆదుకోవాలని పిలుపు ఇచ్చారు. క్షతగాత్రులకు రక్తం కావలసి ఉంటుందని, యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
రక్తందానం చేసేవారు ముందుకు రండి!
విజయనగరం: జిల్లాలోని గొట్లాం సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రైలుప్రమాదంలో తీవ్రగాయాలపాలైన క్షతగాత్రులకు రక్తం అవసరమవుతోంది. రక్తందానం చేయాలనుకునేవారు స్వచ్చంధంగా ముందుకు రావాలంటూ సాక్షి విజ్క్షప్తి చేస్తోంది. రైలుప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను విజయనగరం, గొట్లాం సమీప ఆస్పత్రులకు తరలించినట్టు సమాచారం. విజయనగరం ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం లేనందున క్షతగాత్రులను వైజాగ్ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రైల్వే ప్రమాదం ఘటనపై స్పందించిన ఆ జిల్లా కలెక్టర్ క్రాంతీలాల్ దండే ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. విజయనగరం అధికార యంత్రంగం కూడా కదలి సహాయక చర్యల్లో నిమగ్నమైనట్టు సమాచారం.