
రైల్వే దుర్ఘటన.. వదంతులు ప్రాణాలు తీశాయి!
* రైలు దూసుకుపోయి 8 మంది దుర్మరణం
* విజయనగరం జిల్లా గొట్లాం రైల్వేస్టేషన్ వద్ద దుర్ఘటన
* రైల్లో మంటలు వస్తున్నాయని వదంతులు...
* భయంతో పట్టాలపైకి దూకిన ‘బొకారో’ ప్రయాణికులు
* వారిపైనుంచి దూసుకెళ్లిన మరో రైలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం/విశాఖపట్నం: విజయనగరం సమీపంలోని గొట్లాం రైల్వే స్టేషన్ వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా దీపావళి జరుపుకోవాలని ఆశించిన వారి జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. క్షణాల్లోనే అంతా మాంసం ముద్దలుగా మారి తుప్పల్లోకి ఎగిరిపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. అలెప్పీ-ధన్‌బాద్ బొకారో ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో గొట్లాం స్టేషన్ సమీపంలోకి చేరుకుంది. ఇంతలో ఎవరో ఏసీ బోగీల్లో నుంచి మంటలు వ్యాపిస్తున్నాయంటూ కేకలేశారు. దీంతో దానికి పక్కనే ఉన్న ఎస్-1 బోగీలో కలకలం రేగగా కొందరు ప్రయాణికులు ఆందోళనతో చైన్ లాగి రైలును ఆపేశారు. ప్రాణభయంతో అందులోని ప్రయాణికులు కిందకి దూకేసి పక్క ట్రాక్ మీద నిలబడ్డారు.
అయితే వారు దూకేసిన ప్రాంతం మలుపు తిరిగి ఉండడం, చీకట్లు అలుముకోవడంతో ఎట్నుంచి ఏం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాము నిలబడిన పట్టాల మీదుగా రాయగఢ-విజయవాడ ప్యాసింజర్ రైలు వస్తున్న విషయాన్ని వీరు గుర్తించలేదు. దాంతో ఘోరం జరిగిపోయింది. ఆ ప్యాసింజర్ దూసుకురావడంతో పట్టాలపై ఉన్న ఎనిమిది మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతదేహాలు బోగీల కిందనే ఉండిపోవడంతో చాలా సేపటి వరకు అసలేం జరిగిందో, ఎందరు మరణించారో తెలియని పరిస్థితి నెలకొంది. విజయనగరం నుంచి పోలీసులు, రైల్వే అధికారులు వచ్చి రైలును ముందుకుపోనిచ్చి మాంస ఖండాలను సేకరించారు. వీటిని అదే ప్యాసింజర్‌లో విశాఖ తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని విజయనగరం జిల్లాకేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు.
కళ్లముందే భార్యాబిడ్డలు మృతి..
బీహార్ రాష్ర్టంలోని ఔరంగాబాద్‌కు చెందిన మనోజ్‌కుమార్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య శ్వేతా సింగ్(34), కుమార్తె శౌర్య(10), కుమారుడు నందిత్(2)తో కలిసి దీపావళి పండగ కోసం స్వస్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో భార్య, ఇద్దరు పిల్లలు తన కళ్ల ముందే ముక్కలవడం చూసి మనోజ్ రోదన మిన్నంటింది. అలాగే జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అయోధ్యా మెహతా తన భార్య తారా దేవి(43)తో ప్రయాణిస్తున్నారు. తారాదేవి ఈ ప్రమాదంతో ప్రాణాలు కోల్పోయారు. ముక్కలైన ఆమె శరీరాన్ని చూసి అయోధ్యా మెహతా గుండెలవిసేలా రోదించారు. వీరితోపాటు ఒడిశాకు చెందిన కార్తీక్ సాహు(70), బీహార్‌కు చెందిన అలెక్స్ టెప్నో(27), హైదరాబాద్‌కు చెందిన లోకేంద్ర కుమార్(28), విజయనగరం జిల్లా సీతానగరం మండలానికి చెందిన ఆదిరాజు(60) ఈ దుర్ఘటనలో మరణించారు.
విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్‌లు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎంపీ ఝాన్సీ వచ్చి రైల్వే మంత్రి ఖర్గేతో మాట్లాడి పరిస్థితిని వివరించి సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు తదితరులు వచ్చి బాధితులను ఓదార్చారు. ఇదిలా ఉండగా విశాఖలో ఆరు మృతదేహాలకు ఆదివారం శవపరీక్షలు నిర్వహించి వారి బంధువులకు అప్పగించారు. మరో రెండు మృతదేహాలను ఆంధ్రామెడికల్ కళాశాల మార్చురీలో ఉంచారు.
ఆలస్యమే ఆయువు తీసిందా?:
బొకారో ఎక్స్‌ప్రెస్ రెండుగంటలు ఆలస్యంగా రావడం వల్ల ఎనిమిది నిండు ప్రాణాలు గాల్లోకలిసి పోయాయి. అలెప్పీ-ధన్‌బాద్ బొకారో ఎక్స్‌ప్రెస్ శనివారం సాయంత్రం 4.42గంటలకు విజయనగరం రైల్వే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉండగా 6.23 గంటలకు వచ్చింది. విజయనగరం నుంచి 6.28కి బయలుదేరగా పది నిముషాల వ్యవధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ రెండు గంటలు ఆలస్యంగా రాకపోయి ఉంటే ఇంతమంది ప్రాణా లు పోయి ఉండేవి కావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.