రేగుపాలెం రైల్వేస్టేషన్ వద్ద బొకారో రైలుకు ఎదురుగా ఆందోళన చేస్తున్న ప్రయాణికులు
యలమంచిలి(అనకాపల్లి జిల్లా): అధిక రద్దీ కారణంగా ప్రయాణికుల మధ్య ఏర్పడిన వివాదంతో బొకారో ఎక్స్‌ప్రెస్ రైలు రెండు గంటల సేపు నిలిచిపోయింది. రిజర్వేషన్ బోగీల్లో అన్‌రిజర్వ్‌డ్ టికెట్లతో ప్రయాణికులు అధిక సంఖ్యలో ఎక్కడంతో ఇరువర్గాల మధ్య గొడవ ఏర్పడింది. ఇది కాస్త పెద్దదికావడంతో శనివారం యలమంచిలి మండలం రేగుపాలెం రైల్వేస్టేషన్ వద్ద దన్బాద్–అలెప్పి (13351) బొకారో ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది.
విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఈ రైలును యలమంచిలి దాటిన తర్వాత వెనుక వస్తున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు (12889) కోసం రేగుపాలెం రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై నిలిపివేశారు. ఇదే సమయంలో రిజర్వుడు టికెట్లున్న ప్రయాణికులు, అన్‌రిజర్వుడు టికెట్లున్న ప్రయాణికుల మధ్య కొనసాగుతున్న వివాదం మరింత పెద్దదైంది. దీంతో వందల సంఖ్యలో ప్రయాణికులు రైల్వే ట్రాక్‌పైకి వచ్చిరైలు ఇంజిన్‌కి ఎదురుగా ఆందోళనకు దిగారు.
రైలు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా దాదాపు 500 మంది ప్రయాణికులు ట్రాక్‌పై ఇంజిన్‌కు ఎదురుగా ఉండిపోవడంతో దాదాపు రెండు గంటల సేపు అక్కడే నిలిచిపోయింది. సమాచారం అందుకొన్న తుని రైల్వే ఎస్‌ఐ షేక్ అబ్దుల్ మారూఫ్ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న ప్రయాణికులకు నచ్చజెప్పారు.
రైల్వే ట్రాక్ నుంచి వారిని పక్కకు తొలగించారు. అనంతరం 12.05 నిమిషాల సమయంలో రేగుపాలెం స్టేషన్ నుంచి రైలును ముందుకు పంపించారు. అన్నవరం రైల్వే స్టేషన్ వరకూ ఎస్కార్ట్‌గా వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment