Annavaram railway station
-
అన్నవరం రైల్వేస్టేషన్‌కు ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): విజయవాడ డివిజన్‌లోనే తొలిసారిగా టెంపుల్ టౌన్ స్టేషన్లలో ఒకటైన అన్నవరం రైల్వేస్టేషన్ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్ సాధించింది. ఇది డివిజన్‌లోనే మొదటిది కాగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో హైదరాబాద్ (నాంపల్లి) తర్వాత రెండోదిగా నిలిచింది. ఈ సర్టిఫికెట్ సాధించేందుకు డివిజన్ అధికారులు అన్నవరం రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేశారు. ఆ స్టేషన్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాల ప్రకారం క్యాటరింగ్ విక్రేతలు, స్టాల్ యజమానులు, సరఫరాదారులకు ఎఫ్ఏఎస్టీఏసీ (ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్)లో శిక్షణ ఇచ్చారు. అనంతరం కమర్షియల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్టేషన్‌లోని అన్ని క్యాటరింగ్ స్టాల్స్‌లో ఆహార భద్రత, పరిశుభ్రత, ప్రమాణాలు, విక్రేతల వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ పరికరాలు, ఆహార ఉత్పత్తుల గడువు తేదీలు, ఉషోగ్రత నియంత్రణ, వ్యర్ధాల తొలగింపు, తడి–పొడి చెత్త విభజన వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని నిరంతరం పర్యవేక్షించేవారు. ప్రారంభంలో ప్రీ–ఆడిట్ నిర్వహించి చివరిగా ఎఫ్ఎస్ఎస్ఏఐచే ఆరు నెలల పాటు పర్యవేక్షణ, మూల్యాంకనం అనంతరం వారి ప్రమాణాలకు అనుగుణంగా అన్నవరం స్టేషన్‌కు ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్ వరించింది. ఈ సర్టిఫికెట్ సాధించడానికి కృషిచేసిన సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, డీఓ మహ్మతుల్లా, ఇతర అధికారులను డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు. -
బొకారో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల మధ్య వివాదం
యలమంచిలి(అనకాపల్లి జిల్లా): అధిక రద్దీ కారణంగా ప్రయాణికుల మధ్య ఏర్పడిన వివాదంతో బొకారో ఎక్స్‌ప్రెస్ రైలు రెండు గంటల సేపు నిలిచిపోయింది. రిజర్వేషన్ బోగీల్లో అన్రిజర్వ్డ్ టికెట్లతో ప్రయాణికులు అధిక సంఖ్యలో ఎక్కడంతో ఇరువర్గాల మధ్య గొడవ ఏర్పడింది. ఇది కాస్త పెద్దదికావడంతో శనివారం యలమంచిలి మండలం రేగుపాలెం రైల్వేస్టేషన్ వద్ద దన్బాద్–అలెప్పి (13351) బొకారో ఎక్స్‌ప్రెస్ రైలు నిలిచిపోయింది. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఈ రైలును యలమంచిలి దాటిన తర్వాత వెనుక వస్తున్న ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు (12889) కోసం రేగుపాలెం రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై నిలిపివేశారు. ఇదే సమయంలో రిజర్వుడు టికెట్లున్న ప్రయాణికులు, అన్‌రిజర్వుడు టికెట్లున్న ప్రయాణికుల మధ్య కొనసాగుతున్న వివాదం మరింత పెద్దదైంది. దీంతో వందల సంఖ్యలో ప్రయాణికులు రైల్వే ట్రాక్‌పైకి వచ్చిరైలు ఇంజిన్‌కి ఎదురుగా ఆందోళనకు దిగారు. రైలు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా దాదాపు 500 మంది ప్రయాణికులు ట్రాక్‌పై ఇంజిన్‌కు ఎదురుగా ఉండిపోవడంతో దాదాపు రెండు గంటల సేపు అక్కడే నిలిచిపోయింది. సమాచారం అందుకొన్న తుని రైల్వే ఎస్ఐ షేక్ అబ్దుల్ మారూఫ్ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న ప్రయాణికులకు నచ్చజెప్పారు. రైల్వే ట్రాక్ నుంచి వారిని పక్కకు తొలగించారు. అనంతరం 12.05 నిమిషాల సమయంలో రేగుపాలెం స్టేషన్ నుంచి రైలును ముందుకు పంపించారు. అన్నవరం రైల్వే స్టేషన్ వరకూ ఎస్కార్ట్‌గా వెళ్లారు. -
నిలిచిన చెన్నై మెయిల్
సాంకేతిక లోపంతో అన్నవరంలో అవస్థలుపడిన ప్రయాణికులు అన్నవరం: సాంకేతిక లోపం కారణంగా హౌరా-చెన్నై మెయిల్ ఆదివారం సాయంత్రం సుమా రు రెండు గంటలపాటు తూర్పుగోదావరిజిల్లా అన్నవరం రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైలు విశాఖపట్నంలో బయలుదేరినప్పటి నుంచీ సెకండ్ క్లాస్ బోగీల్లోని ఒకదాని చక్రాల నుంచి శబ్దం తేడాగా వస్తోందని డ్రైవర్ గుర్తించారు.దీంతో రైలును హంసవరం స్టేషన్లో ఆపి తనిఖీలు చేశారు. ఎస్-11 బోగీ చక్రాల నుంచి శబ్దంతోపాటు మంటలు వస్తున్నాయని గుర్తించారు. రైలును నిలిపే వీలు లేకపోవడంతో నెమ్మదిగా అన్నవరం స్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ బోగీని రైలు నుంచి వేరు చేసి లూప్లైను మీదకు తరలించారు.ప్రయాణికులను మరో బోగీలో ఎక్కించారు. విడదీసిన రైలును మళ్లీ పంపించేటప్పటికి రాత్రి 7.40 గంటలైంది. ఆ ప్రయాణికుల కోసం రాజమండ్రి లేదా విజయవాడలో మరో బోగీ కలుపుతామని అధికారులు చెప్పారు. మెయిల్ నిలిచిపోయిన ప్రభావం ఇతర రైళ్లపై కూడా పడింది. భువనేశ్వర్- సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్‌లను తుని, యలమంచిలి రైల్వే స్టేషన్లలో సుమారు పావుగంట నిలిపివేశారని అధికారులు తెలిపారు. -
రైల్వేస్టేషన్లో మహిళ ప్రసవం
అన్నవరం : నిత్యం రైళ్ల రాకపోకలతో.. ప్రయాణికుల రణగొణ ధ్వనులతో దద్దరిల్లే అన్నవరం రైల్వేస్టేషన్ శనివారం సాయంత్రం ఆస్పత్రిగా మారింది. ఓ మహిళకు పురుడుపోసింది. రైల్వేస్టేషన్లో పనిచేసే మహిళా ఉద్యోగులు ఆస్పత్రి సిబ్బందిగా మారారు. ప్రయాణికులు, ఇతర ఉద్యోగులు అవసరమైన వస్తువులను సమకూర్చారు. వీరి సహకారంతో ఆ మహిళ పండంటి పాపకు జన్మనిచ్చింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచి నిండు గర్బిణి అన్నవరం రైల్వేస్టేషన్లో దిగింది. రెండో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపైకి ఓవర్‌బ్రిడ్జి మీదుగా నడుస్తూ వచ్చి అక్కడ సిమెంట్ బెంచీ మీద కూర్చుంది. సాయంత్రం 4:30 గంటల సమయానికి ఆమెకు నొప్పులు రావడంతో గట్టిగా కేకలు వేసింది. రైల్వేస్టేషన్ మహిళా సిబ్బంది, ప్రయాణికులు ఆమెను గమనించి దగ్గరలోని రైల్వేక్వార్టర్ల నుంచి దుప్పట్లు, చీరలు తెచ్చి ఆమెకు కప్పి దగ్గరలోని వెయిటింగ్ రూమ్ బాత్రూమ్ వద్దకు తీసుకువెళ్లారు. వెంటనే 108 అంబులెన్సుకు ఫోన్ చేశారు. సాయంత్రం ఐదుగంటల సమయంలో ఆమె పాపకు జన్మనిచ్చింది. అదే సమయంలో అంబులెన్సు కూడా రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అంబులెన్సు సిబ్బంది సుధాకర్, అప్పలరాజు తదితరులు ఆమెను, పాపను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. రైల్వే సిబ్బంది శ్రీనివాసరెడ్డి, నాయుడు, జీఆర్పీ జి.లోవరాజు, ప్రయాణికులు రూ.వేయి నగదు, రెండు దుప్పట్లు, పది చీరలు, జాకెట్లను ఆ మహిళకు అందచేశారు. ఆమె స్వస్థలం ఉప్పాడ మండలం పల్లిపేట ఈసందర్భంగా ఆ మహిళ తన పేరు గోనె దుర్గాభవానీ అని, తనది ఉప్పాడ కొత్తపల్లి మండలం పల్లిపేట గ్రామమని, తన అత్త వారి ఊరు ధవళేశ్వరమని చెప్పినట్లు అంబులెన్సు సిబ్బంది తెలిపారు. భర్త పేరు సాయి అని రాజమండ్రి రైల్వేస్టేషన్లో పళ్లు అమ్ముతాడని, ప్రస్తుతం భర్త తనతో ఉండడం లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆమెకు కుడి చేయి, మోచేయి వరకు మాత్రమే ఉంది. ఓ ప్రమాదంలో ఆ చెయ్యి సగం వరకూ తెగిపోయినట్లు చెప్పిందని వివరించారు. సత్యదేవుని దర్శనార్థం అన్నవరం వచ్చానని చెప్పినట్టు రైల్వేస్టేషన్ సిబ్బంది చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.