రైల్వేస్టేషన్‌లో మహిళ ప్రసవం
అన్నవరం : నిత్యం రైళ్ల రాకపోకలతో.. ప్రయాణికుల రణగొణ ధ్వనులతో దద్దరిల్లే అన్నవరం రైల్వేస్టేషన్ శనివారం సాయంత్రం ఆస్పత్రిగా మారింది. ఓ మహిళకు పురుడుపోసింది. రైల్వేస్టేషన్‌లో పనిచేసే మహిళా ఉద్యోగులు ఆస్పత్రి సిబ్బందిగా మారారు. ప్రయాణికులు, ఇతర ఉద్యోగులు అవసరమైన వస్తువులను సమకూర్చారు. వీరి సహకారంతో ఆ మహిళ పండంటి పాపకు జన్మనిచ్చింది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గుంటూరు-విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్ నుంచి నిండు గర్బిణి అన్నవరం రైల్వేస్టేషన్‌లో దిగింది.
రెండో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపైకి ఓవర్‌బ్రిడ్జి మీదుగా నడుస్తూ వచ్చి అక్కడ సిమెంట్ బెంచీ మీద కూర్చుంది. సాయంత్రం 4:30 గంటల సమయానికి ఆమెకు నొప్పులు రావడంతో గట్టిగా కేకలు వేసింది. రైల్వేస్టేషన్ మహిళా సిబ్బంది, ప్రయాణికులు ఆమెను గమనించి దగ్గరలోని రైల్వేక్వార్టర్ల నుంచి దుప్పట్లు, చీరలు తెచ్చి ఆమెకు కప్పి దగ్గరలోని వెయిటింగ్ రూమ్ బాత్‌రూమ్ వద్దకు తీసుకువెళ్లారు. వెంటనే 108 అంబులెన్సుకు ఫోన్ చేశారు. సాయంత్రం ఐదుగంటల సమయంలో ఆమె పాపకు జన్మనిచ్చింది. అదే సమయంలో అంబులెన్సు కూడా రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. అంబులెన్సు సిబ్బంది సుధాకర్, అప్పలరాజు తదితరులు ఆమెను, పాపను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. రైల్వే సిబ్బంది శ్రీనివాసరెడ్డి, నాయుడు, జీఆర్‌పీ జి.లోవరాజు, ప్రయాణికులు రూ.వేయి నగదు, రెండు దుప్పట్లు, పది చీరలు, జాకెట్లను ఆ మహిళకు అందచేశారు.
ఆమె స్వస్థలం ఉప్పాడ మండలం పల్లిపేట
ఈసందర్భంగా ఆ మహిళ తన పేరు గోనె దుర్గాభవానీ అని, తనది ఉప్పాడ కొత్తపల్లి మండలం పల్లిపేట గ్రామమని, తన అత్త వారి ఊరు ధవళేశ్వరమని చెప్పినట్లు అంబులెన్సు సిబ్బంది తెలిపారు. భర్త పేరు సాయి అని రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో పళ్లు అమ్ముతాడని, ప్రస్తుతం భర్త తనతో ఉండడం లేదని చెప్పినట్లు పేర్కొన్నారు. ఆమెకు కుడి చేయి, మోచేయి వరకు మాత్రమే ఉంది. ఓ ప్రమాదంలో ఆ చెయ్యి సగం వరకూ తెగిపోయినట్లు చెప్పిందని వివరించారు. సత్యదేవుని దర్శనార్థం అన్నవరం వచ్చానని చెప్పినట్టు రైల్వేస్టేషన్ సిబ్బంది చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.