రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): విజయవాడ డివిజన్‌లోనే తొలిసారిగా టెంపుల్ టౌన్ స్టేషన్‌లలో ఒకటైన అన్నవరం రైల్వేస్టేషన్ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్ సాధించింది. ఇది డివిజన్‌లోనే మొదటిది కాగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో హైదరాబాద్ (నాంపల్లి) తర్వాత రెండోదిగా నిలిచింది. ఈ సర్టిఫికెట్ సాధించేందుకు డివిజన్ అధికారులు అన్నవరం రైల్వేస్టేషన్‌ను ఎంపిక చేశారు.
ఆ స్టేషన్‌లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాల ప్రకారం క్యాటరింగ్ విక్రేతలు, స్టాల్ యజమానులు, సరఫరాదారులకు ఎఫ్‌ఏఎస్‌టీఏసీ (ఫుడ్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ సర్టిఫికేషన్)లో శిక్షణ ఇచ్చారు. అనంతరం కమర్షియల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్టేషన్‌లోని అన్ని క్యాటరింగ్ స్టాల్స్‌లో ఆహార భద్రత, పరిశుభ్రత, ప్రమాణాలు, విక్రేతల వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ పరికరాలు, ఆహార ఉత్పత్తుల గడువు తేదీలు, ఉషోగ్రత నియంత్రణ, వ్యర్ధాల తొలగింపు, తడి–పొడి చెత్త విభజన వంటి ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని నిరంతరం పర్యవేక్షించేవారు.
ప్రారంభంలో ప్రీ–ఆడిట్ నిర్వహించి చివరిగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐచే ఆరు నెలల పాటు పర్యవేక్షణ, మూల్యాంకనం అనంతరం వారి ప్రమాణాలకు అనుగుణంగా అన్నవరం స్టేషన్‌కు ‘ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికెట్ వరించింది. ఈ సర్టిఫికెట్ సాధించడానికి కృషిచేసిన సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, డీఓ మహ్మతుల్లా, ఇతర అధికారులను డీఆర్‌ఎం నరేంద్ర ఏ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment