సాంకేతిక లోపంతో అన్నవరంలో అవస్థలుపడిన ప్రయాణికులు
అన్నవరం: సాంకేతిక లోపం కారణంగా హౌరా-చెన్నై మెయిల్ ఆదివారం సాయంత్రం సుమా రు రెండు గంటలపాటు తూర్పుగోదావరిజిల్లా అన్నవరం రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రైలు విశాఖపట్నంలో బయలుదేరినప్పటి నుంచీ సెకండ్ క్లాస్ బోగీల్లోని ఒకదాని చక్రాల నుంచి శబ్దం తేడాగా వస్తోందని డ్రైవర్ గుర్తించారు.దీంతో రైలును హంసవరం స్టేషన్‌లో ఆపి తనిఖీలు చేశారు. ఎస్-11 బోగీ చక్రాల నుంచి శబ్దంతోపాటు మంటలు వస్తున్నాయని గుర్తించారు.
రైలును నిలిపే వీలు లేకపోవడంతో నెమ్మదిగా అన్నవరం స్టేషన్‌కు తీసుకువచ్చారు. అక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆ బోగీని రైలు నుంచి వేరు చేసి లూప్‌లైను మీదకు తరలించారు.ప్రయాణికులను మరో బోగీలో ఎక్కించారు. విడదీసిన రైలును మళ్లీ పంపించేటప్పటికి రాత్రి 7.40 గంటలైంది. ఆ ప్రయాణికుల కోసం రాజమండ్రి లేదా విజయవాడలో మరో బోగీ కలుపుతామని అధికారులు చెప్పారు. మెయిల్ నిలిచిపోయిన ప్రభావం ఇతర రైళ్లపై కూడా పడింది. భువనేశ్వర్- సికింద్రాబాద్ విశాఖ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్‌లను తుని, యలమంచిలి రైల్వే స్టేషన్లలో సుమారు పావుగంట నిలిపివేశారని అధికారులు తెలిపారు.
నిలిచిన చెన్నై మెయిల్
Published Mon, Nov 24 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:59 PM
Advertisement
Advertisement