నలుగురికి ఊపిరి పోసిన మహిళ ప్రభుత్వాసుపత్రుల్లో ఇదే తొలిసారి
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాసుపత్రుల చరిత్రలోనే తొలిసారిగా హైదరాబాద్ నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఒకేరోజు నాలుగు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. నిమ్స్‌లో గుండె, కిడ్నీ, ఉస్మానియాలో కాలేయం, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను వైద్యులు ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు చెందిన 33 ఏళ్ల మహిళ అవయవాలను దానం చేసి నలుగురికి పునర్జన్మనిచ్చారు. ఈ నెల 3న ఎద్దు పొడవడంతో ఆ మహిళ తీవ్ర గాయాలపాలయ్యారు. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
బ్రెయిన్‌డెడ్ అయినట్టు ప్రకటించిన వైద్యులు ఆమె బంధువులకు అవయవ దానంపై అవగాహన కల్పించారు. అందుకు వారు అంగీకరించడంతో జీవన్‌దాన్‌లో అవయవ మార్పిడి శస్త్రచికిత్స కోసం పేర్లు నమోదు చేసుకున్న నలుగురికి ఆమె అవయవాలను అమర్చాలని వైద్యులు నిర్ణయించారు. బ్రెయిన్‌డెడ్ మహిళ నుంచి సేకరించిన గుండెను బెలెటైడ్ కార్డియోపతి (గుండె కండరాలు దెబ్బతినడం)తో బాధపడుతున్న మంచిర్యాలకు చెందిన జ్యోతి(23)కి, మరో బాధితుడికి ఒక కిడ్నీని నిమ్స్ వైద్యులు అమర్చారు. అలాగే ఉస్మానియాలో చికిత్స పొందుతున్న ఓ బాధితుడికి కాలేయాన్ని, మరొకరికి మూత్రపిండాన్ని విజయవంతంగా అమర్చారు.
ఒకే రోజు నాలుగు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు
Published Mon, Mar 7 2016 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM
Advertisement
Advertisement