
మైసూరు: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన యువతి గుండెను సజీవంగా తరలించి మృత్యువుతో పోరాడుతున్న మరొక వ్యక్తికి అమర్చిన ఘటన శనివారం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం చాముండిబెట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నమన (21) అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే శనివారం నమన బ్రెయిన్‌డెడ్ అయినట్లు నిర్ధారించుకున్న వైద్యులు నమన తల్లితండ్రుల సమ్మతితో నమన గుండెను బెంగళూరు నగరంలో మృత్యువుతో పోరాడుతున్న మరొక వ్యక్తికి అమర్చడానికి అంబులెన్స్ ద్వారా బెంగళూరు నగరానికి తరలించడానికి నిర్ణయించుకున్నారు. అందుకోసం మైసూరు–బెంగళూరు వరకు మార్గాన్ని జీరో ట్రాఫిక్ చేయాలంటూ నగర పోలీసులును కోరగా అందుకు అంగీకరించిన పోలీసులు నిర్ధిష్ట సమయంలో గుండెను సజీవంగా తరలించడానికి మార్గాన్ని జీరో ట్రాఫిక్‌గా చేయడానికి చర్యలు తీసుకున్నారు. దీంతో అనుకున్న సమయానికి మైసూరు నుంచి బెంగళూరు నగరంలోని బీజీఎస్ ఆసుపత్రికి గుండెను తరలించి ప్రాణాపాయంలో ఉన్న మరొక వ్యక్తికి విజయవంతంగా అమర్చారు.