సాక్షి, ముంబై: మనిషి చనిపోయినా మరికొందరి ప్రాణాలు నిలబెట్టొచ్చు. ప్రమాదవశాత్తు, ఏదైనా జబ్బు చేసి మనిషి చనిపోతే అవయవ దానం చెయ్యొచ్చు. ఇలా చేయడం వల్ల మరికొందరి ప్రాణాలను కాపాడొచ్చు. ఇటీవల కొందరు కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో తమ వారెవరైనా చనిపోతే అవయవదానం చేయడానికి ముందుకొస్తున్నారు. ముంబై నగరంలో అవయవ దానాలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
తాజాగా ఓ మహిళ బ్రెయిన్ డెడ్(43) అయి మరణించి మరికొందరి జీవితంలో వెలుగులు నింపింది. శ్రీరామ్ గోపాల్, నందిని దంపతులు ములుండ్‌లో నివాసం ఉంటున్నారు. నందిని ఓ ప్రైవేట్ హెచ్‌ఆర్ కన్సల్‌టెంట్‌గా పనిచేస్తోంది. ఇటీవల నందినికి తీవ్ర తలనొప్పి రావడంతో మూర్ఛపోయింది. ఆమెకు వైద్యపరీక్షలు చేసిన బాంబే ఆస్పత్రి వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ధ్రువీకరించారు. తాము ఏమీ చేయలేమని తేల్చిచెప్పారు.
తన భార్య కల్లెదుటే ఉన్నదనే సంతృప్తి
‘తన భార్య చనిపోయినా అవయవాలను దానం చేయాలని శ్రీరామ్‌గోపాల్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు భార్య అవయవాలను దానం చేశాడు’. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ.. తాను బతికి ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఏమి జరుగుతుందోన ని, చనిపోతే తన అవయవాలను దానం చేయాలని భార్య నందిని కోరిందని, ఇదివరకే తన కళ్లను ఐబ్యాంక్‌కు దానం చేసినట్లు చెప్పారు. ఆమె కోరిక మేరకు మరో అవయవాలు వృథాగా పోకుండా ఆమె కిడ్నీలు, కాలేయం, కళ్లను దానం చేసినట్లు చెప్పాడు. తన భార్య అవయవ దానం వల్ల మరో ముగ్గురి ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. తన భార్య కల్లెదురుగా లేకున్నా ఆమె అవయవాలను దానం చేయడం వల్లలో ఆమె ఇంకా బతికి ఉన్నదనే సంతృప్తి కలుగుతుందని కన్నీటి పర్యంతమయ్యాడు.
ముగ్గురి ప్రాణాలు కాపాడగలిగాం: డాక్టర్
ఓ 28 ఏళ్ల మహిళ కిడ్నీ కోసం బాంబే ఆస్పత్రిలో చేరింది. మరో 47 ఏళ్ల మహిళ కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. 72 ఏళ్ల మరో మహిళ కాలెయ సంబంధ వ్యాధితో బాధపడుతూ ఫోర్టిస్ట్ ఆస్పత్రిలో వెయిటింగ్ జాబితాలో ఉన్నారని ఆస్పత్రి ట్రాన్స్‌ప్లాంట్ కో-ఆర్డినేటర్ సంతోష్ సొరాటే పేర్కొన్నారు. ఈ ముగ్గురు మహిళలకు శ్రీరామ్‌గోపాల్ భార్య నందిని దానం చేసిన అవయవాలు ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఆ మూడు ప్రాణాలు నిలబడ్డాయని చెప్పారు.
అవగాహన కల్పించాలి
కిడ్నీ జబ్బుల వైద్యుడు డాక్టర్ హరేస్ దోదేజీ మాట్లాడుతూ ..కిడ్నీ మార్పడి చేయడం ద్వారా ప్రస్తుతం ఓ మహిళ పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. మరో 72 ఏళ్ల మహిళకు కాలెయ మార్పిడి చేశామన్నారు. అవయదానం వల్ల రెండు జీవితాలను కాపాడగలిగామని చెప్పారు. అవయవ దానం పట్ల రోగుల్లో, బంధువుల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు పేర్కొన్నారు. అవయవ దానం చేయడం ద్వారా ఇతర రోగుల ప్రాణాలను కాపాడినవారు అవుతారని వారికి తెలియజెప్పాలని అభిప్రాయపడ్డారు.
చనిపోతూ.. ముగ్గురి జీవితాల్లో వెలుగులు
Published Wed, Aug 6 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement
Advertisement