ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్
సియోల్/వాషింగ్టన్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ బ్రెయిన్ డెడ్ అయిందన్న కథనాలతో ప్రపంచమే ఉలిక్కిపడింది. 36 ఏళ్ల వయసున్న కిమ్ గుండెకి జరిపిన శస్త్రచికిత్స ఆయన ప్రాణం మీదకి తెచ్చిందన్న అమెరికా మీడియాలో కథనాలు వస్తుంటే ఉత్తర కొరియా నోరు మెదపడం లేదు. కిమ్ ఆరోగ్యస్థితిపై అక్కడ మీడియా వార్తల్ని ప్రచురించలేదు. రోజువారీ వార్తల్ని కిమ్ సాధించిన విజయాలు, వివిధ రంగాలపై కిమ్ గతంలో వెల్లడించిన అభిప్రాయాల్ని మాత్రమే మీడియా ఇస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కిమ్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
కిమ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలు నిజమో, కాదో తనకు తెలీవని చెప్పారు. కిమ్ బాగానే ఉన్నారని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 15న కిమ్ తన తాత ఇల్ సంగ్ 108 జయంతి వేడుకల్లో పాల్గొనకపోవడంతో ఆయన ఆరోగ్యం బాగోలేదన్న వదంతులు మొదలయ్యాయి. ఉత్తర కొరియాకు అత్యంత ముఖ్యమైన ఈ వేడుకలకు కిమ్ 2011లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి క్రమం తప్పకుండా హాజరవుతున్నారు.
కిమ్ చివరిసారిగా ఏప్రిల్ 12న బయట ప్రపంచానికి కనిపించారని దక్షిణ కొరియా మీడియాలో చాలా వార్తలొచ్చాయి. ఊబకాయం, చైన్ స్మోకింగ్, పని ఒత్తిడి కారణంగా కిమ్‌ను గత ఆగస్టు నుంచి అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయని ప్యాంగ్‌యాంగ్ దగ్గర్లోని రిసార్టులో ఉంచి ఆయనకి చికిత్స అందిస్తున్నారని దక్షిణ కొరియా మీడియా చెబుతోంది. అయితే కిమ్ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా నిఘా విభాగ అధికారులు నిరంతరం నిఘా వేశారని అమెరికాలోని భద్రత విభాగం ఉన్నతాధికారులు చెబుతున్నారు.
వారసులపై ఊహాగానాలు
7దశాబ్దాలుగా అక్కడ వంశపారంపర్య పాలనే నడుస్తోంది. 1948 నుంచి కిమ్ కుటుంబమే అధికారాన్ని చెలాయిస్తోంది. తన తండ్రి కిమ్ సంగ్ మరణానంతరం కిమ్ జాంగ్ ఇల్ 1994లో కొరియా పగ్గాలు చేపట్టారు. జాంగ్ ఇల్ మరణానంతరం కిమ్ 2011లో పీఠమెక్కారు. కిమ్ 2009లో రి సోల్ జూ అనే సింగర్‌ని పెళ్లాడారు. వారికి ముగ్గురు పిల్లలు. వీరంతా చిన్నవాళ్లు కావడంతో గద్దెనెక్కే పరిస్థితి లేదు.
రేసులో ఎవరు !
కిమ్ యో జాంగ్
అధ్యక్షుడు కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ ఆయనకు అత్యంత సన్నిహితురాలు. కిమ్ కుటుంబ సభ్యుల్లో ప్రభుత్వంలో కీలకంగా ఎదుగుతూ అధికారంపై పట్టు సంపాదించిన ఏకైక వ్యక్తి జాంగ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధినేత జిన్‌పింగ్‌లతో కలిసి ఐక్యరాజ్య సమితి సదస్సుల్లో కిమ్ పాల్గొన్నప్పుడు ఆమె తన సోదరుడి వెంటే ఉన్నారు. ఈ నెల మొదట్లో అధికారి వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో ప్రత్యామ్నాయ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అయితే పురుషాధిక్యత కలిగిన ఉత్తర కొరియా సమాజంలో ఒక మహిళకు అధికారం అప్పగిస్తారా అన్నది అనుమానమేనన్న విశ్లేషణలు వినబడుతున్నాయి.
కిమ్ హాన్ సోల్
కిమ్ సవతి సోదరుడైన కిమ్ జాంగ్ నామ్ కొడుకు ఇతను. కిమ్ జాంగ్–2 పెద్ద కుమారుడైన నామ్ జూదానికి అలవాటు పడి చైనాకు ప్రవాసం వెళ్లిపోయాడు. తరచు తన సవతి తమ్ముడు కిమ్ పాలనను విమర్శిస్తూ ఉండేవారు. 2017లో మలేసియా కౌలాలంపూర్ విమానాశ్రయంలో నామ్ దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనుక కిమ్ హస్తముందనే ఆరోపణలున్నాయి. దీంతో నామ్ కుమారుడు కిమ్ హాన్ సోల్ ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌కు వచ్చే సాహసం చెయ్యలేదు. కిమ్ వంశంలో మగవారికే అధికారాన్ని అప్పగించాల్సి వస్తే హాన్ సోల్ కూడా రేసులో ఉన్నట్టే.
కిమ్‌జాంగ్ చోల్
కిమ్‌కున్న సోదరుల్లో జీవించి ఉన్న వ్యక్తి చోల్ మాత్రమే. అయితే ఆయనకి రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదు. గిటార్ వాయించడంలో చోల్ అత్యంత ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తారు. తండ్రి కిమ్ జాగ్–2కి చోల్‌ను వంశోద్ధారకుడిలా కాకుండా ఒక కూతురిలా చూసేవారన్న వార్తలు వచ్చాయి. 2011లో సింగపూర్‌లో ఒక కచేరికి హాజరైన సందర్భంలో జాంగ్ చోల్‌ను దక్షిణ కొరియాకి చెందిన మీడియా సంస్థ కేబీఎస్ ఫొటోలు తీసింది. జాంగ్ చోల్ స్విట్జర్లాండ్‌లో చదువుకున్నారన్న విషయం మినహా ఆయన గురించి వివరాలేవీ తెలీవు.
Comments
Please login to add a commentAdd a comment