సాక్షి, హైదరాబాద్: జిల్లాల్లోనూ బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఫలితంగా అవయవదానాలు విరివిగా పెంచి, బాధితులకు మార్పిడి చికిత్సలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ముందుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనంతరం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ ఏర్పాట్లు చేస్తారు. సంబంధిత మెడికల్ కాలేజీల్లోనూ అపస్మారకస్థితికి చేరిన రోగుల బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ కమిటీలు ఏర్పాటు చేస్తారు. తక్షణమే కాకతీయ, నిజామాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల్లో బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ, అవయవాల సేకరణ చర్యలు తీసుకోనున్నారు.
డిమాండ్ ఎక్కువ... అవయవాలు తక్కువ
కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తులు, క్లోమం వంటి అవయవాలను అవసరమైనవారికి మార్పిడి చేయడానికి వైద్యపరంగా వీలుంది. రాష్ట్రంలో జీవన్‌దాన్ పథకం ద్వారా అవయవ దానాలు, అవయవమార్పిడి జరుగుతున్నాయి. ఈ పథకం ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. వెబ్‌సైట్‌లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకుంటే, వారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనర్ కార్డు అందజేస్తుంది.
ఉమ్మడి రాష్ట్రంలో 2002లో తొలిసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. జీవన్‌దాన్‌లో ప్రస్తుతం 2,863 మంది అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. నమోదు చేసుకోనివారు 90 శాతం మంది బాధితులు ఉంటారని జీవన్‌దాన్ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రస్తుతం 10 వేల మంది బాధితులు కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటున్నారు.
వారిలో సగం మందికైనా కిడ్నీ మార్పిడి చేయడానికి వీలుంది. కానీ, అవయవాల లభ్యత కొరవడింది. దానికి ప్రధాన కారణం బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ చేయడానికి అనువైన వసతులు లేకపోవడమే. హైదరాబాద్‌లో మాత్రమే నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతోపాటు 30 ప్రైవేట్ ఆసుపత్రుల్లో బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ జరుగుతోంది. జిల్లాల్లో ఇటువంటి ఏర్పాట్లు లేవు. దీంతో వేలాదిమంది బ్రెయిన్‌డెడ్ కేసులు నమోదవుతున్నా, నిర్ధారణ జరగక అవయవాలు వృథాగా పోతున్నాయి.
బ్రెయిన్‌డెడ్‌ను ఎలా నిర్ధారిస్తారు?
ప్రమాదం వల్లగాని, నివారణ కాని వ్యాధి వల్ల కాని మనిషి అపస్మారక స్థితిలోకి చేరుకుంటాడు. కృత్రిమ ఆక్సిజన్ ద్వారా రక్తప్రసరణ జరుగుతున్నప్పటికీ తిరిగి స్పృహలోకి రాని స్థితిని బ్రెయిన్ డెడ్‌గా పేర్కొంటారు.ఆ సమయంలో గుండె స్పందనలూ, ఊపిరితిత్తుల పనితీరు, కిడ్నీలు, కాలేయం సజీవంగానే ఉంటాయి. అయితే రోగి ఎట్టి పరిస్థితుల్లోనూ బతికే అవకాశం ఉండదు. ఈ పరిస్థితిని నిర్ధారించాలంటే కొన్ని నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి. న్యూరాలజీ, న్యూరోసర్జరీ, అనస్థిసిస్ట్, జనరల్ ఫిజీషియన్‌లతోపాటు ఆస్పత్రి సూపరింటెండెంట్లతో కూడిన బృందం కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాల ద్వారా బ్రెయిన్‌డెడ్ అనే విషయాన్ని నిర్ధారణ చేస్తారు.
జిల్లాల్లో అనువైన పరిస్థితులు
కరోనా కాలంలో పెరిగిన వైద్య మౌలిక సదుపాయాల కారణంగా అవయవ దానాలు, సేకరణకు అవకాశాలు విస్తృతమయ్యాయి. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి అవయవాలను సేకరించాలన్నా, వారు చనిపోవడానికి ముందు అవసరమైన చికిత్స పొందాలన్నా తప్పనిసరిగా ఐసీయూ వసతి ఉన్న ఆసుపత్రులు కావాలి. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో 11,845 ఐసీయూ, వెంటిలేటర్లు ఉండగా, అందులో ప్రభుత్వంలో 2,143, ప్రైవేట్‌లో 9,702 ఐసీయూ, వెంటిలేటర్ పడకలు ఉన్నాయి. ఫలితంగా బ్రెయిన్‌డెడ్ అయిన కేసుల నిర్వహణ సులువని అంటున్నారు. కాగా, 2013లో 189 అవయవదానాలు జరిగితే, ఈ ఏడాది 662 జరగడం గమనార్హం.
అవయవ మార్పిడికి డిమాండ్ పెరిగింది
అవయవ మార్పిడికి రాష్ట్రంలో డిమాండ్ పెరిగింది. కానీ, ఆ మేరకు అవయవాలను అందించలేకపోతున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 10 వేల మంది కిడ్నీ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇంకా అనేకమంది రిజిస్ట్రేషన్‌న్ చేయించుకోవడంలేదు. ఈ నేపథ్యంలో జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అవకాశం ఉన్నచోట బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
– డాక్టర్ స్వర్ణలత, జీవన్‌దాన్ ఇన్‌చార్జి
Comments
Please login to add a commentAdd a comment