
అవయవదాత కుటుంబానికి ఊరట
* వసూలు చేసిన సొమ్మును తిరిగిచ్చేసిన ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి
* జీవన్‌దాన్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవిరాజు జోక్యంతో సుఖాంతం
సాక్షి, విజయవాడ: బ్రెయిన్‌డెడ్‌కు గురై ఆరు అవయవాలను దానం చేసిన ఇమడాబత్తుని ఏడుకొండలు కుటుంబానికి ఊరట లభించింది. అతని వైద్యంకోసం బిల్లులకింద వసూలు చేసిన మొత్తాన్ని మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి శనివారం తిరిగిచ్చేసింది.
కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యానికి రూ.లక్షల్లో ఫీజు చెల్లించడానికి అప్పులు చేసి రోడ్డున పడిన అవయవదాత ఏడుకొండలు కుటుంబ దీనస్థితిని వివరిస్తూ ‘అవయవదాత’ను పిండేశారు’ శీర్షికన ‘సాక్షి’ పత్రికలో, టీవీలో కథనం వెలువడడం తెలిసిందే. అంతేగాక ‘సాక్షి’ చొరవ తీసుకుని ఏడుకొండలు కుటుంబ పరిస్థితుల్ని జీవన్‌దాన్ ట్రస్టు చైర్మన్, ఎన్టీఆర్ ఆరోగ్యవర్సిటీ ఉపకులపతి డాక్టర్ రవిరాజు దృష్టికి తీసుకుపోయింది. ఈ నేపథ్యంలో రవిరాజు జోక్యం చేసుకుని మాట్లాడడంతో ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. బిల్లుల కింద తాము వసూలు చేసిన రూ.1.50 లక్షల సొమ్మును అవయవదాత ఏడుకొండలు కుటుంబానికి తిరిగిచ్చింది.