చిరంజీవి ఫ్రాన్సిస్..
- అవయవ దానంతో ఏడుగురికి జీవితం
పంజగుట్ట: ఓ వ్యక్తి తాను పుట్టి ఏం సాధించాడో తెలియదు కాని.. చనిపోతూ తన అవయవాలు దానం చేసి మరో ఏడుగురికి ప్రాణం పోసి చిరకాలం గుర్తుండిపోయాడు. సోమవారం నిమ్స్ జీవన్‌దాన్ ప్రతినిధి అనూరాధ తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ లాలాగూడకు చెందిన బి.ఫ్రాన్సిస్(53) ఖైరతాబాద్‌లోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో పనిచేసేవారు. ఈనెల 20న బైక్‌పై కార్యాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఇతను లక్డీకాపూల్ వద్ద ప్రమాదానికి గురయ్యారు.
వెంటనే ఫ్రాన్సిస్‌ను గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. న్యూరోసర్జరీ విభాగం వైద్యులు ఇలియాస్, ప్రవీణ్‌లు ఆయనకు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 23న ఫ్రాన్సిస్‌కు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. అనంతరం గ్లోబల్ జీవన్‌దాన్ కో ఆర్డినేటర్ భానుచంద్ర.. ఫ్రాన్సిస్ భార్య విజయకు అవయవ దానం ఆవశ్యకతను వివరించారు. ఆమె ఒప్పుకోవడంతో ఫ్రాన్సిస్ రెండు కిడ్నీలు, లివర్, గుండె వాల్వులు, కళ్లను సేకరించి అవసరమైన వారికి అమర్చారు.