అంగట్లో అవయవాలు | Organs Smuggling Scam In Tamil Nadu | Sakshi
Sakshi News home page

అంగట్లో అవయవాలు

Published Tue, Sep 4 2018 10:53 AM | Last Updated on Tue, Sep 4 2018 10:53 AM

Organs Smuggling Scam In Tamil Nadu - Sakshi

మానవుల్లో ‘అవయవాల దానం’ అనే మహోత్కృష్ట సేవానిరతిని నీరుగార్చేశారు. ఉదాత్తమైన హృదయంతో ఉచితంగా అందజేసే అవయాలను అంగడి సరుకుగా మార్చేశారు. అందులోనూ స్వదేశీయులకు మొండిచేయి చూపుతూ విదేశీయుల ముందు చేయిచాపుతూ లక్షలు ఆర్జిస్తున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ పుణ్యమా అని అవయవాల అమ్మకాల దారుణం బట్టబయలైంది.

సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల బారినపడి ప్రాణాలతో బయటపడే అవకాశం లేని వ్యక్తులు, బ్రెయిన్‌ డెడ్‌కు గురయ్యేవారు అవయవాలు దానం చేయడం సహజం. బాధితుల బంధువుల సమ్మతితో అవయవాలను స్వీకరించి మరో రోగికి అమర్చాలనే నిబంధన ఉంది. అయితే 90 శాతానికి పైగా కేసుల్లో బంధువులకు తెలియకుండా అవయవాలను తస్కరిస్తున్నారు. దాదాపు మరణశయ్యపై ఉన్న రోగిని ఎంచుకుని అతడు కోలుకోవడానికి శస్త్రచికిత్స అవసరమని చెప్పి ఒప్పించి అవయవాలు కాజేస్తున్నారు. తస్కరించిన అవయవాలను లక్షలాది రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తమిళనాడుకు చెందిన రోగుల అవయవాలను తమిళనాడులోని వివిధ ఆస్పత్రుల్లో అవయవాల కోసం కాచుకుని ఉండే విదేశీయులకు పెద్ద మొత్తంలో అమ్మివేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమిళనాడులోని కార్పొరేట్‌ ఆస్పత్రుల సహకారంతో ఈ ఘోరాలు సాగిపోతున్నాయి. అవయవాల కేటాయింపునకు సంబంధించి కేంద్రం రూపొందించిన నియమ నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా అక్రమాలు సాగిపోతున్నాయి. తమిళనాడులో అందుబాటులోకి వచ్చిన అవయవాలను ముందుగా తమిళనాడుకు చెందిన రోగికి అమర్చాల్సి ఉంటుంది. అలాంటి రోగి లేనిపక్షంలోనే ఇతరులను పరిగణనలోకి తీసుకోవాలి. అయితే అవయవదానంలోని చట్టాలను ధిక్కరించి.. ఎక్కువసొమ్ము ముట్టజెప్పే విదేశీయులకు అమరుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కేరళ వ్యకి అవయవాలు ఉక్రెయిన్‌ వ్యక్తికి
ఈ ఏడాది మే 18వ తేదీన సేలంలో జరిగిన ఒక ప్రమాదంలో కేరళకు చెందిన కుటుంబం తీవ్రంగా గాయపడింది. ఈ కుటుంబంలోని మణికంఠన్‌ అనే వ్యక్తి బ్రెయిన్‌డెడ్‌కు గురికాగా అతడి అవయవాలను తమిళనాడుకు చెందిన వారికి అమర్చలేదు. ఊపిరితిత్తులను ఇజ్రాయిల్‌కు చెందిన రోగికి, ఇతర అవయవాలను ఉక్రెయిన్‌ దేశానికి చెందిన వ్యక్తికి అమర్చారు. ఈ దుర్మార్గంపై విచారణ జరపాల్సిందిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌.. తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామికి ఉత్తరం ద్వారా కోరారు. ఎడపాడి వెంటనే విచారణకు ఆదేశించగా విచారణ కమిటీ బృందం సోమవారం నివేదికను సమర్పించింది.

మంత్రి భార్యకు కూడా అమర్చకుండా..
నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి. అవయవాల దాత కోసం ఎదురుచూసే వారు తమ పేర్లను అందుకు సంబంధించిన జాబితాలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జాబితాలోని వరుస ప్రాధాన్యత ప్రకారం మాత్రమే అవయాలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే ఇద్దరు వ్యక్తులు తమ వరుసవారీ నంబరును తారుమారు చేసి అవయవాలను పొందినట్లు తేలింది. మరో కార్పొరేట్‌ ఆస్పత్రి వారు భారతీయునికి అమర్చాల్సిన అవయవాన్ని విదేశీయుని అమ్మివేసి అమర్చారు. ఈ శస్త్రచికిత్స మే 21వ తేదీన జరిగింది. సేలంలో ప్రమాదానికి గురైన కేరళ వ్యక్తి మణికంఠన్‌ అవయవాలను దానం చేయడానికి కుటుంబసభ్యులను బలవంతంగా ఒప్పించారు. మణికంఠన్‌ కిడ్నీని అమర్చాల్సిన వ్యక్తికి బదులుగా ఉక్రెయిన్‌కు చెందిన రోగికి అమర్చారు. అలాగే మణికంఠన్‌ గుండెను ఉక్రెయిన్‌ దేశానికి చెందిన వ్యక్తికి అమర్చాలని నిర్ణయించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా లెబనాన్‌ దేశానికి చెందిన రోగికి అమర్చారు. అయితే మణికంఠన్‌ గుండె లెబనాన్‌ వ్యక్తికి సెట్‌ కాకపోవడంతో కొన్ని గంటల్లోనే మృతిచెందాడు. మణికంఠన్‌ అవయవాలు ఎవరెవరికి అమర్చారో అనే వివరాలను సైతం నమోదు చేయలేదు. మూత్రపిండాల మార్పిడికి ఎంతోకాలంగా వేచి ఉన్న తమిళనాడు మంత్రి భార్యకు సైతం లేని ప్రాధాన్యత నివ్వకుండా విదేశీయునికి అమ్ముకున్నట్లు తేలింది.

అంతా దళారీల ద్వారానే..
అవయవదానాలకు చెందిన అన్ని అక్రమాలు కార్పొరేట్‌ ఆస్పత్రులోని అవయవ మార్పిడి విభాగం, దళారీల నడుమ సెల్‌ఫోన్ల ద్వారానే రహస్యంగా సాగిపోతోంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో ఇలాంటి అక్రమాలు ఎక్కువగా సాగుతున్నట్లు విచారణ బృందం కనుగొంది. అంగీకారం లేకుండా మనుషుల అవయవాల తొలగింపు చట్టం సెక్షన్‌ 18,  ఐపీసీ 420 సెక్షన్‌ కింద చీటింగ్, 465 సెక్షన్‌ కింద అక్రమాలు, 120 సెక్షన్‌ కింద మూకుమ్మడి కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు విచారణ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అక్రమంగా అవయవాల మార్పిడిలో సుమారు రూ.12 కోట్ల అవినీతి చోటుచేసుకున్నట్లు రాష్ట్ర స్థాయి విచారణలో స్పష్టమైనందున సీబీఐ విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు, ధర్మపురి పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement