
నాన్నా..నీవు కన్నుమూసిన చోటే..
14ఏళ్ల క్రితం తండ్రి మృత్యువాత పడిన ప్రాంతంలోనే కుమారుడూ..
పోలీసాఫీసర్ కావాలనే కల చెదిరిపోయింది
హరనాథ్ కుటుంబంపై పగబట్టిన విధి
విశాఖపట్నం: తాను మరణించి ఐదుగురి జీవితాల్లో వెలుగులు ప్రసాదించిన మండల హరనాథ్ కల చెదిరిపోయింది. చదువుకుని పోలీస్ ఆఫీసర్ కావాలన్న అతని ఆశను మృత్యువు తుంచేసింది. సబ్బవరం వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయి, అవయవదానం చేసిన హరనాథ్‌కు చిన్నప్పట్నుంచి పోలీస్ ఉద్యోగమంటే ఎంతో ఇష్టం. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ఇరుగు పొరుగు వారితోనూ తన లక్ష్యం గురించే ఎక్కువగా చెప్పేవాడు. డిగ్రీ అయ్యాక పోలీస్ సెలక్షన్ కోసం కోచింగ్ తీసుకుంటానని అనేవాడు. ‘ముందు బాగా చదువుకుని ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ అవ్వు’ అంటూ కుటుంబీకులు సరదాగా అనేవారు. హరనాథ్ ఇప్పుడు అర్థాంతరంగా తనువు చాలించడాన్ని వీరంతా గుర్తు చేసుకుంటూ కుమిలిపోతున్నారు. హరనాథ్ తాత, నాన్నమ్మలతో సన్నిహితంగా మెలిగేవాడు.
చిన్నప్పుడే తండ్రి మరణించడంతో ఐదో ఏట వచ్చే వరకు వారి దగ్గరే పెరిగాడు. చదువుల కోసం తల్లితో బర్మా క్యాంపు వచ్చాక సెలవులకు వారి వద్దకే వెళ్తుండేవాడు. అలాగే దసరా సెలవుకు తాతగారింటికి వెళ్లి పూజా సామగ్రి కోసం వెళ్తూ లారీ ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డాడు.
14 ఏళ్ల క్రితం తండ్రి : సుమారు 14 ఏళ్ల క్రితం అంటే 2001 ఏప్రిల్‌లో హరనాథ్ తండ్రి శ్రీనివాస్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశేషమేమిటంటే హరనాథ్ ప్రమాదానికి గురైన ప్రాంతంలోనే లారీ ఢీకొని ఆయన దుర్మరణం పాలయ్యారు. తండ్రీకొడుకులిద్దరు ఒకే ప్రాంతం లో ప్రమాదానికి గురై మృత్యువాత పడడాన్ని ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. భర్త మరణానంత రం పుష్పలత పెద్ద కొడుకు హరనాథ్‌తో పాటు ఇద్దరు క వల పిల్లల (రాము, లక్ష్మణ)లను చదువుల కోసం నగరంలోని బర్మా కాంపునకు వచ్చేసింది. భర్తను కోల్పోయి నా, ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా కష్టపడి పిల్లలను చది విస్తోంది. ఈ తరుణంలో పెద్ద కొడుకును పోగొట్టుకున్న ఆమె సెల్‌ఫోన్లో ఉన్న కొడుకు ఫోటోను చూసుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తోంది. అంతటి విషాదంలోనూ కొడుకు అవయవ దానానికి ముందుకు వచ్చి ఐదుగురికి పునర్జన్మను ప్రసాదించడాన్ని పలువురు శ్లాఘిస్తున్నారు.
ఒత్తిడితో పనికి రాని గుండె..: హరనాథ్ గుండెను చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అమర్చాలనుకున్నారు. అందుకు చార్టర్డ్ ఫ్లైట్‌ను సిద్ధం చేసి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ గుండెపై ఒత్తిడి అధికం కావడం వల్ల కేవలం కవాటాలను మాత్రమే వైద్యులు చెన్నై తీసుకెళ్లారు. హరనాథ్ మృతదేహానికి ఆదివారం బర్మా క్యాంపు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.