అవయవదానం
డోన్ టౌన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి..బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. డోన్ పట్టణానికి చెందిన వ్యాపారవేత్త దారా శ్రీనివాసరెడ్డి(52) శనివారం సాయంత్రం తన బావగారి ఊరైన కొట్రాయి నుంచి డోన్‌కు ద్విచక్రవాహనంపై వస్తుండగా ఐచర్ వాహనం ఢీ కొనింది. తీవ్రంగా గాయపడిన అతన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు బ్రెయిన్‌డెడ్ అయినట్లుగా తెలిపారు. అయితే బంధువులు హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించగా..అక్కడి వైద్యులు ఫలితం లేదని చెప్పారు. దీంతో అతని గుండె, లివర్, కిడ్నీలను యశోదా ఆసుపత్రి ద్వారా జీవన్‌దాన్ ట్రస్ట్‌కు, రెండు కళ్లను ఎల్‌వీ ప్రసాద్‌ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అందజేసేందుకు భార్య శారదమ్మ అంగీకరించింది. శ్రీనివాస రెడ్డికి కుమార్తెలు ప్రత్యూషా, అలైఖ్యారెడ్డిలు ఉన్నారు. ఇతని స్వగ్రామం మద్దికెర మండలం ఎం. అగ్రహారం గ్రామం కాగా 30 ఏళ్ల క్రితం డోన్ పట్టణంలో స్థిరపడ్డారు.