
అయ్యో...శ్రీలత
* గిరిజన యువతి బ్రెయిన్‌డెడ్
* పేద కుటుంబానికి పెద్ద కష్టం
చీడికాడ : కోర్టులో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఆమెకు టెస్ట్‌కు హాజరు కావాలని లేఖ అందింది. ఉద్యోగం వస్తే కష్టాలు తీరుతాయని అందరూ భావించారు. ఈ నెల 31న పరీక్షకు హాజరు కావలసి ఉంది. అంతలోనే ఆమెను మృత్యువు కబళించింది. ఉద్యోగం చేసి అమ్మానాన్నల కష్టం తీరుద్దామని ఆ యువతి ఆ కోరిక తీరకుండానే కాల్‌లెటర్ వచ్చిన రోజే అకస్మాత్తుగా అపస్మారకస్థితికి చేరుకుంది.
ఆ యువతి పెదనాన్న వంతంగి పేరయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతగిరి మండలం పెదగంగవరానికి చెందిన అల్లం బుచ్చిబాబు,అతని భార్యమహాలక్ష్మీ ఇద్దరు పిల్లలతో చీడికాడ మండలం కొండ్లకొత్తూరులోని అత్తవారింట్లో ఉండేవారు. గ్రామంలో పూట గడవక బుచ్చిబాబు కుటుంబాన్ని తీసుకుని కొత్తగాజువాకలో ఉంటూ పోర్టులో రోజుకూలిగా పనిచేస్తున్నాడు. బుచ్చిబాబు పెద్దకుమార్తే శ్రీలత(20) ఇంటర్,ఐటీఐ పూర్తి చేసింది.
గురువారం ఉదయం 8గంటల సమయంలో పాలుతాగుతూ శ్రీలత ఆకస్మాత్తుగా అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో ఆమెను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు చెసిన వైద్యులు శ్రీలతకు బ్రెయిన్‌డెడ్ అయిందని చెప్పారు. చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. శ్రీలత మృతి వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. జిల్లాకోర్టులో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ఆమెకు ఈనెల 31న టెస్ట్‌కు అటెండుకావాలని గురువారం ఉదయమే కాల్‌లెటర్ అందింది. ఆ ఆనందంలో ఉండగానే మృత్యువు ఆమెను కబళించింది.