పూర్ణచంద్ర గుప్తా (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: స్నేహితుడి నిశ్చితార్థానికి అతని సొంతూరుకు వెళ్దామని ఆనందంతో ఉన్న మిత్రులు.. ఆ స్నేహితుడి మృతదేహాన్నే తీసుకువెళ్లాల్సి రావడం కలలో కూడా అనుకోలేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. 29 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండాయని భోరున విలపిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో యువ వైద్యుడు పూర్ణచంద్ర బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు.
► ఏపీలోని గుంటూరు జిల్లా నిజాంపట్నంకు చెందిన తునుగుంట్ల పూర్ణచంద్ర గుప్తా (29) చినకాకాని ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఎంబీబీఎస్, గాంధీ మెడికల్ కాలేజీ జనరల్ సర్జరీ విభాగంలో ఎండీ ఎంఎస్ చదువుకున్నారు.
► గాంధీలోనే సీనియర్ రెసిడెంట్ (ఎస్‌ఆర్)గా విధులు నిర్వర్తించి ఈ ఏడాది జూలైలో పూర్తి చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్య ప్రవేశ పరీక్షల ప్రిపరేషన్ కోసం స్నేహితులతో కలిసి పద్మారావునగర్‌లో ఉంటున్నారు. వారం రోజుల క్రితం ఆయనకు గుండెలో స్వల్పంగా నొప్పి రావడంతో గాంధీలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. నివేదికలన్నీ నార్మల్‌గానే వచ్చాయి.
► బుధవారం ఉదయం 5 గంటలకు మరోసారి ఛాతిలో నొప్పి రావడంతో ఎసిడిటీ అనుకుని గాంధీ ఆస్పత్రికి వచ్చి ఇంజక్షన్ తీసుకున్నారు. పద్మారావునగర్‌లోని గదికి వెళ్లవద్దని, అత్యవసర విభాగ భవనం పైనున్న పీజీ హాస్టల్‌లో ఉండాలని సహచర వైద్యుల సూచన మేరకు మెట్ల మార్గంలో వెళ్తున్న క్రమంలో తీవ్రస్థాయిలో హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. వైద్యులు అతడిని ఐసీయూలో అడ్మిట్ చేసి తీ వ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది.
పది రోజుల్లో నిశ్చితార్థం..
పూర్ణచంద్ర గుప్తాకు మరో పది రోజుల్లో వివాహ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. గతంలోనే ఆయన తల్లి చనిపోయింది. వెన్నెముక ఆపరేషన్ చేయించుకుని బెడ్‌కే పరిమితమైన తండ్రి బాగోగుల్ని సోదరుడు చూస్తున్నాడు. పూర్ణచంద్ర కోరిక మేరకు నిశ్చితార్థానికి వైద్య మిత్రులంతా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఇంతలోనే మృత్యువు కబళించడంతో అంత్యక్రియలకు స్నేహితుని మృతదేహాన్ని తీసుకుని ఆయన సొంతూరుకు వెళ్తున్నామని భోరుమన్నారు. పూర్ణచంద్ర గుప్తా మృతదేహానికి గాంధీ ప్రిన్సిపాల్ ప్రకాశరావు, సూపరింటెండెంట్ రాజారావు, వైద్యులు నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment