సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా విధించిన లాక్‌డౌన్ ఆంక్షల వల్ల వైద్య సేవలు అందక బ్రిటన్‌లో 65 ఏళ్ల లోపు వృద్ధుల్లో ఎక్కువ మంది గుండెపోటుతో మరణించారు. కరోనాతోపాటు అత్యవసర ఆపరేషన్లను మినహా మిగతా వైద్య సేవలను నిలిపి వేయడం వల్ల ఇళ్లకే పరిమితమైన వీరు గుండెపోటుకు గురయ్యారు. గత మార్చి, ఏప్రిల్ రెండు నెలల కాలంలోనే బ్రిటన్‌లో 2,800 మంది 65 ఏళ్ల లోపు వృద్ధులు గుండెపోటుతో మరణించారు.
సాధారణ సమయాల్లో గుండెపోటుతో మరణించే వారి సంఖ్యకన్నా ఇది 420 ఎక్కువ. జూలై నెల వరకు 800 మంది వృద్ధులు ఎక్కువగా గుండెపోటుతో మరణించారు. అంటే కోవిడ్ లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా గుండెపోటుతో మరణించిన వారి సంఖ్య దాదాపు 13 శాతం పెరిగిందని ‘బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్’ వెల్లడించింది. లాక్‌డౌన్ సందర్భంగా పింఛనుదారుల మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని ఫౌండేషన్ అంచనా వేసింది. సాధారణ పరిస్థితుల్లోకన్నా ఆంక్షల సమయంలో 976 మంది పింఛనుదారులు మరణించారని, సాధారణ సమయాల్లోకన్నా ఈ మరణాలు ఆరు శాతం ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
కరోనా మినహా వైద్య సేవలపై ఇప్పటికీ ఆంక్షలు కొనసాగించినట్లయితే భవిష్యత్‌లో గుండెపోటు మరణాలు, పింఛనుదారుల అకాల మృతి పెరగుతుందని బ్రిటన్ హార్ట్ ఫౌండేషన్ అసోసియేట్ మెడికల్ డైరెక్టర్ సోన్యా బాబు–నారాయణ్ హెచ్చరించారు. గత మార్చి నెల నుంచి జూన్ వరకు నాలుగు నెలల కాలంలో ఆస్పత్రుల్లో సాధారణ అడ్మిషన్లు 1,73,000 తగ్గగా, లక్షా పదివేల మంది అనారోగ్యం వల్ల ఆస్పత్రుల్లో అడ్మిషన్ల కోసం ఎదురు చూస్నున్నట్లు నారాయణ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment